Gautam Adani Networth: ఒకప్పుడు ప్రపంచంలోని ముగ్గురు అత్యంత ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ నికర విలువ ఇప్పుడు గణనీయంగా తగ్గి ఉండవచ్చు, కానీ, అతను ఇప్పటికీ ప్రపంచ అగ్ర ధనవంతుల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. గత మూడు వారాలుగా, అదానీ గ్రూప్ షేర్లలో రిటర్న్ ర్యాలీతో, గౌతమ్ అదానీ నికర విలువ మళ్లీ మెరుగుపడటం ప్రారంభించింది.
ఈ మూడు వారాల కాలంలో, షేర్లు మంచి పని తీరు కనబరచడంతో గౌతమ్ అదానీ నికర విలువ 50 శాతానికి పైగా పెరిగింది. మళ్లీ టాప్ 20 సంపన్న వ్యక్తుల్లో (World's Top 20 Richest Persons) చేరడానికి కేవలం ఒక అడుగు దూరంలో అదానీ ఉన్నారు.
నాలుగైదు నెలల క్రితం భారీ స్థాయిలో అదానీ నెట్‌వర్త్
అన్నింటికంటే మొదట చెప్పుకోవాల్సింది.. గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో టాప్-2 స్థానంలో కూడా అతి కొద్ది సమయం పాటు కొనసాగారు. టాప్-3 ప్లేస్‌లో చాలా కాలం ఉన్నారు. అప్పట్లో, ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్డ్
(Bernard Arnault), టెస్లా CEO ఎలాన్ మస్క్ (Elon Musk) మాత్రమే అతని కంటే ధనవంతులు. గత ఏడాది సెప్టెంబరు నెలలో 3వ స్థానాన్ని అదానీ సాధించారు. ఆ తర్వాత కూడా అదానీ సంపద పెరుగుతూ వెళ్లింది. ఆ సమయంలోనే టాప్-3 నుంచి టాప్-2కి వెళ్లి, మళ్లీ టాప్-3కి వచ్చి సెటిల్ అయ్యారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ప్రకారం, అక్టోబర్ 31న మార్కెట్ ముగిసిన తర్వాత అదానీ మొత్తం ఆస్తుల విలువ 143 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
హిండెన్‌బర్గ్ నివేదిక వల్ల భారీ నష్టం
అయితే, 2023 జనవరి 24 హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక విడుదలైన తర్వాత, అదానీ గ్రూప్ షేర్లలో నెల రోజుల పాటు భారీ పతనం కొనసాగింది. తన నివేదికలో, అదానీ గ్రూపుపై తీవ్రమైన ఆరోపణలను హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసింది. అదానీ గ్రూప్ షేర్ల విలువ చాలా ఎక్కువగా ఉందని, అక్రమ పద్ధతుల్లో షేర్ల ధరలు పెంచారని విమర్శించడంతో పాటు ఇతర ఆరోపణలు కూడా చేసింది. ఈ నివేదిక తర్వాత, నెల రోజుల్లోనే, అదానీ కంపెనీల షేర్ల ధరలు 80 శాతం వరకు పడిపోయాయి. గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఏకంగా రూ. 12.06 లక్షలు తగ్గింది. ఈ ఫలితంగా, గౌతమ్ అదానీ నికర విలువ కేవలం 40 బిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. అదానీ, కేవలం ఒక నెలలో 80 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఇప్పుడు గౌతమ్ అదానీ ఆస్తుల విలువ ఇది
బ్లూంబెర్గ్ బిలియనీర్ జాబితా ప్రకారం... 2023 ఫిబ్రవరి 27 నాటికి గౌతమ్ అదానీ నికర విలువ కేవలం 37.7 బిలియన్ డాలర్లు. తాజా జాబితా ప్రకారం గౌతమ్ అదానీ నికర విలువ 57.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే, గత మూడు వారాల్లోనే అతని సంపద సుమారు 20 బిలియన్ డాలర్ల వరకు పెరిగింది, ఇది 52.52 శాతం వృద్ధికి సమానం.
తాజా గణాంకాల ప్రకారం, ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ 21వ స్థానానికి చేరుకున్నారు, టాప్-20 లిస్ట్‌లో పేరు నమోదు చేయించుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. అలిస్ వాల్టన్ 61.5 బిలియన్ డాలర్ల నికర విలువతో ఇప్పుడు 20వ స్థానంలో ఉన్నారు.