Gautam Adani:
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) కష్టాలు అన్నీ ఇన్నీ కావు! ఏడాది కాలంగా ఆయన ప్రతి వారం రూ.3000 కోట్ల మేర నష్టపోతున్నారట! అత్యున్నత శిఖర స్థాయి నుంచి ఇప్పుడాయన సంపద 53 బిలియన్ డాలర్లకు తగ్గిపోయిందని ఎంత్రీఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 పేర్కొంది. కొన్ని రోజుల క్రితం ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న ఆయన ఇప్పుడు 23కు తగ్గిపోయారని వెల్లడించింది. హిండెన్‌బర్గ్ రిపోర్టుతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే.
కొన్ని నెలల్లోనే అదానీ 28 బిలియన్ డాలర్ల నికర సంపదను నష్టపోయారు. దాంతో భారత్ అత్యంత సంపన్నుడి స్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) వదిలేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అంబానీ నెట్‌వర్త్ 82 బిలియన్ డాలర్లుగా అంచనా. 'తమ సంపదలో 35 శాతం నష్టపోవడంతో గౌతమ్ అదానీ కుటుంబం ఆసియా రెండో సంపన్నుడి స్థానాన్ని ఝాంగ్ షాన్‌షన్‌కు వదిలేయాల్సి వచ్చింది. హిండెన్ బర్గ్ నివేదిక వచ్చినప్పట్నుంచి అదానీ 60 శాతం సంపద కోల్పోయారు' అని హురున్ ఇండియా (Hurun India) వెల్లడించింది.
చివరి ఏడాది కాలంలో అదానీ 35 శాతం సంపద కోల్పోయారు. ప్రపంచ కుబేరుల్లో తొమ్మిదో స్థానంలో నిలిచిన అంబానీ 20 శాతం సంపద నస్టపోయారు. అవెన్యూ సూపర్ మార్కెట్ (డీమార్ట్) ఛైర్మన్, స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ రాధాకృష్ణ దమానీ, ఆయన కుటుంబం 30 శాతం సంపద నష్టపోయారు. ప్రస్తుతం వారి సంపద 16 బిలియన్ డాలర్లుగా అంచనా. గ్లోబల్ టాప్-100 నుంచీ ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో ఉదయ్ కొటక్ (Uday Kotak) 13 శాతం నష్టపోయారు. ఆయన సంపద 14 బిలియన్ డాలర్లు. ప్రపంచ సంపన్నుల్లో ఆయన ర్యాంకు 135. వ్యాక్సింగ్ కింగ్ సైరస్ పూనావాలా (Cyrus Poonawala) ఆస్తి 4 శాతం పెరిగి 27 బిలియన్ డాలర్లకు చేరుకుంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్టులో భారత్ 187 బిలియనీర్లతో మూడో స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా మన కన్నా ముందున్నాయి.
'ఐదేళ్లుగా అంతర్జాతీయ సంపన్నుల జనాభాలో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఐదేళ్ల క్రితం గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో 4.9 శాతం మంది ఉండగా ఇప్పుడు 8 శాతానికి పెరిగారు' అని హురున్ తెలిపింది. ఇక హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 8 శాతం తగ్గింది. గతేడాది వారి మొత్తం సంపద 10 శాతం తగ్గింది. 1078 మంది సంపద పెరగ్గా అందులో 176 మంది కొత్తవాళ్లే. 2479 మంది నెట్‌వర్త్‌లో ఎలాంటి మార్పు లేదు. 445 మంది సంపద మాత్రం తగ్గింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.