Foreign Currency Exchange Rates: భారతదేశ రూపాయితో పాటు, ప్రపంచ ప్రధాన దేశాల విదేశీ కరెన్సీల మారకపు ధరలకు సంబంధించి పెద్ద మార్పునకు రంగం సిద్ధం అవుతోంది. ఇది అమల్లోకి వస్తే, భారతదేశ రూపాయితో పాటు ఇతర కరెన్సీల మారకం రేట్లను ప్రతిరోజూ అధికారికంగా వెల్లడిస్తారు. కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (CBIC) ఈ మార్పునకు శ్రీకారం చుట్టింది, త్వరలోనే ఇది అమలులోకి రాబోతోంది.
ఇకపై ప్రతిరోజు మారకపు రేట్ల నోటిఫికేషన్
ప్రస్తుతం, తన ఇంటిగ్రేటెడ్ కస్టమ్స్ పోర్టల్‌లో పక్షం రోజులకు ఒకసారి (ప్రతి 15 రోజులకు ఒకసారి) విదేశీ కరెన్సీ మారకపు రేట్లను CBIC విడుదల తేస్తోంది. PTI వార్తల ప్రకారం... ఇకపై ప్రతి రోజు మారకం విలువలను నోటిఫై చేస్తుంది, సాయంత్రం 6 గంటలకు వీటిని వెల్లడిస్తుంది. ఫారిన్ కరెన్సీ ఎక్సేంజ్ రేట్లను ఏరోజుకారోజు విడుదల చేయడం వల్ల, మారకపు విలువల్లో హెచ్చుతగ్గులను బట్టి విదేశీ వ్యాపారాలు, లావాదేవీలను కొనసాగించడానికి ఎగుమతి & దిగుమతి వ్యాపారులకు అవకాశం చిక్కుతుంది. రోజువారీ రేట్ల ఆధారంగా, ఎగుమతి & దిగుతులపై కస్టమ్స్ సుంకాన్ని కచ్చితంగా లెక్కించేందుకు వాళ్లకు వీలవుతుంది.
ప్రస్తుతం, CBIC ప్రతి 15 రోజులకు 22 ప్రధాన కరెన్సీల మారకపు ధరలను తెలియజేస్తోదని చెప్పుకున్నాం కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి పొందిన రేట్ల ఆధారంగా ప్రతి నెల మొదటి గురువారం, మూడో గురువారం నాడు వాటిని పోర్టల్‌లో నోటిపై చేస్తోంది. అలా ప్రకటించిన కొత్త రేట్లు, ఆ రోజు ఆర్ధరాత్రి తర్వాత నుంచి అమల్లోకి వస్తున్నాయి.
విదేశీ మారకపు రేట్లను SBI నుంచి స్వీకరణ
ఇకపై, మారకపు ధరల నోటిఫికేషన్ ప్రక్రియ మొత్తం ఆటోమేటిక్‌గా జరగబోతోంది. SBI నుంచి స్వీకరించిన విదేశీ మారకపు రేట్లను, ప్రతిరోజూ సమీప ఐదు పైసలకు సర్దుబాటు చేస్తారు. ఆ తర్వాత, వాటిని ఇండియన్ కస్టమ్స్ EDI సిస్టమ్‌తో ఏకీకృతం చేసి సాయంత్రం 6 గంటలకు ఇండియన్ కస్టమ్స్ నేషనల్ ట్రేడ్ పోర్టర్‌లో (ICEGATE లేదా ఐస్‌గేట్) ఉంచుతారు.
విదేశీ కరెన్సీల మారకపు రేట్లలో హెచ్చుతగ్గులను మరింత నిశితంగా పరిశీలించేందుకు ICEGATE పోర్టల్‌లో 22 కరెన్సీల మారకపు ధరలను ప్రకటించాలని CBIC నిర్ణయించినట్లు ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు. ఇందుకు సంబంధించి అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు, కొత్త విధానం త్వరలో అమలులోకి రానుంది.
"విదేశీ మారక ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా కస్టమ్స్ సుంకం గణనలో ఏర్పడే హెచ్చుతగ్గులను నివారించడానికి ప్రతిపాదిత మార్పు సాయపడుతుంది" - AMRG & అసోసియేట్స్ సీనియర్ పార్టనర్ రజత్ మోహన్
ఈ స్కీమ్ ప్రకారం.. సెలవు రోజుల్లో విదేశీ మారకపు రేట్లను SBI విడుదల చేయదు. అలాంటి సందర్భంలో గత రోజు రేట్లే మరుసటి రోజుకు వర్తిస్తాయి.