Elon Musk Burnt Hair Perfume: అపర కుబేరుడు, టెస్లా ‍‌(Tesla) కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 51 సంవత్సరాల వయస్సున్న మస్క్ చాలా సరదా మనిషి, సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఆయన చేసే పనులన్నీ ఎప్పటికప్పుడు వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇటీవలే, ట్విట్టర్‌ కొనుగోలు వ్యవహారంతో చాలా గందరగోళం సృష్టించారు.


ఇన్‌ ద సేమ్‌ లైన్‌.. పెర్‌ఫ్యూమ్‌ సేల్స్‌ మ్యాన్‌గానూ మస్క్‌ మారారు. ఇల్లిల్లూ తిరిగి పెర్‌ఫ్యూమ్‌ అమ్మట్లేదు లెండి!. కొత్తగా పెర్‌ఫ్యూమ్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. బర్ట్న్‌ హెయిర్‌ (Burnt Hair) బ్రాండ్‌ పేరిట కొత్త రకం ఫ్లేవర్‌ని మార్కెట్‌కు పరిచయం చేశారు. తనను తాను సేల్స్‌ మ్యాన్‌గా పరిచయం చేసుకున్నారు. 






'ది ఫైనెస్ట్‌ ఫ్రాగ్రెన్స్‌ ఆఫ్ ది ఎర్త్‌' అంటూ  బర్ట్న్‌ హెయిర్‌ని పేర్కొన్న మస్క్‌, నా పేరు లాంటి పేరుతో ఫ్రాగ్రెన్స్‌ బిజినెస్‌లోకి వస్తున్నానని గతంలో ట్వీట్‌ చేశారు. ట్విటర్‌ బయోలో 'పెర్‌ఫ్యూమ్‌ సేల్స్‌ మేన్‌' అని కూడా మార్చుకున్నారు.  ఈ రంగంలోకి ప్రవేశించడం తనకు తప్పలేదు అని తన ట్వీట్‌లో ఆయన పేర్కొనడం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం.






ధర రూ.8,400 
బర్ట్న్‌ హెయిర్‌ ధర 100 డాలర్లు లేదా 8,400 రూపాయలు. బుధవారం లాంచ్‌ లాంచ్‌ అయిన వెంటనే హాట్‌ కేకుల్లా అమ్ముడుబోయింది, అమ్ముడుబోతోంది. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 10,000 పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు సేల్ అయ్యాయని  సోషల్‌ మీడియా ద్వారా మస్క్‌ వెల్లడించారు. ది బోరింగ్ కంపెనీ ‍‌(The Boring Company) వెబ్‌సైట్ ద్వారా ‘బర్న్ట్‌ హెయిర్’ పెర్‌ఫ్యూమ్‌ కొనుగోలు చేయవచ్చు. డిజిటర్‌ కరెన్సీ అయిన డోజీకాయిన్స్‌తోనూ చెల్లింపులు చేయవచ్చు. మస్క్ బర్న్ట్ హెయిర్‌ను “ది ఎసెన్స్ ఆఫ్ రిపగ్నెంట్ డిజైర్” అని సదరు వెబ్‌సైట్‌లో పేర్కొనడం విశేషం.


ఓమ్ని జెండర్‌ ఫెర్‌ప్యూమ్‌ 
బర్న్ట్‌ హెయిర్ ఫెర్‌ప్యూమ్‌ ఒక ఓమ్నిజెండర్ ప్రొడక్ట్. అంటే, పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అందరూ దీనిని ఉపయోగించవచ్చట. మస్కే ఈ మాట చెప్పారు. అంతేకాదు, ఒక మిలియన్ బాటిల్స్ పెర్‌ఫ్యూమ్‌ అమ్ముడైతే, అప్పుడు వచ్చే వార్తా కథనాలు ఎలా ఉంటాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.


బుధవారం నుంచి ఈ పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్ల అమ్మకాలు మొదలు కాగానే, "బీ ద ఛేంజ్‌ యూ వాంట్‌ ఇన్‌ ది వరల్డ్‌" అంటూ మరో ట్వీట్‌ చేశారు.