Musk Meets Pranay Pathole: సోషల్‌ మీడియాలో సెలెబ్రిటీలను అనుసరించడం ఎవరైనా చేస్తారు! అదే సెలెబ్రిటీ మనల్ని అనుసరించేలా చేస్తేనే కదా అసలైన కిక్కు! పుణెకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇదే పనిచేశాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌తో ట్విటర్లో ఫ్రెండ్‌షిప్‌ చేశాడు. కొన్ని అంశాలపై అతడితో చర్చించాడు. ఇదే గ్రేట్‌ అనుకుంటే! ఈ మధ్యే టెక్సాస్‌లో నేరుగా మస్క్‌ను కలిసి సర్‌ప్రైజ్‌ చేశాడు.


ప్రణయ్‌ పఠోల్‌! 24 ఏళ్ల కుర్రాడు. పుణెలో ఉంటాడు. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. టెక్సాస్‌ యూనివర్సిటీలో మెషీన్‌ లెర్నింగ్‌లో మాస్టర్స్‌ చేస్తున్నట్టు లింక్‌డ్‌ ఇన్‌లో రాశాడు. 2018లో ఇంజినీరింగ్‌ చేస్తున్నప్పుడు ట్విటర్లో ఎలన్‌ మస్క్‌ను అనుసరించడం మొదలు పెట్టాడు. తరచూ కొన్ని విషయాలపై చర్చిస్తూ ఉండేవాడు. ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణించడం, గ్రహాంతర వాసులు, ఎలక్ట్రిక్‌ కార్లు, రాకెట్‌ సైన్స్‌ గురించి వీరిద్దరూ మాట్లాడుకొనేవారు.




హఠాత్తుగా టెక్సాస్‌లోని టెస్లా ఫ్యాక్టరీలో ఎలన్‌ మస్క్‌ను ప్రణయ్‌ కలిశాడు. తన ఐడల్‌ను కలిశానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నాడు. 'టెక్సాస్‌ గిగా ఫ్యాక్టరీలో మిమ్మల్ని (ఎలన్‌ మస్క్‌) కలవడం గొప్పగా అనిపిస్తోంది. ఇంత వినయంగా, అణకువగా ఉండే వ్యక్తిని నేనెప్పుడూ చూడలేదు. కోట్ల మందికి మీరు స్ఫూర్తిగా నిలిచారు' అని ప్రణయ్‌ ట్వీట్‌ చేశాడు.


ఇంజినీరింగ్‌ రెండో ఏడాది చదివేటప్పుడు టెస్లా కార్లలో ఆటోమేటిక్‌ విండో వైపర్ల గురించి తొలిసారి ప్రణయ్‌ ట్వీట్‌ చేశాడు. దాని గురించి కచ్చితంగా ఆలోచిస్తానని మస్క్‌ బదులిచ్చాడు. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య బంధం కొనసాగింది. ప్రణయ్‌కు 180K ఫాలోవర్లు పెరిగారు. ఈ మధ్యే టెస్లా క్యూరియాసిటీ రోవర్‌ తీసిన అంగారకుడి ఉపరితలం గురించి పఠోల్‌ ట్వీట్‌ చేశాడు. దానికి 'మార్స్‌కు జీవం తీసుకురావాలి. అంగారక గ్రహం చూడ్డానికి ఎంతో బాగుంది' అని మస్క్‌ బదులిచ్చాడు. ఈ పోస్టుకు 7.2 మిలియన్ల వ్యూస్‌, 26.7K రీట్వీట్లు లభించాయి.


ఆగస్టు 2న ఎలన్‌ మస్క్‌, ప్రణయ్‌ పుస్తకాల గురించి చర్చించుకున్నారు. 'ఎలన్‌ మస్క్‌, మీరు నిక్‌ బోస్ట్రన్‌ పేపర్‌ అస్ట్రానామికల్‌ వేస్ట్‌ చదివారా? విశ్వంలో విస్తరించడం ఆలస్యమయ్యే ప్రతి సెకను బతకాల్సిన వంద లక్షల మంది ప్రాణాలు పోతాయని చెబుతోంది ఇది' అని ప్రణయ్‌ ట్వీటాడు. 'అంచనా వేసిన సంఖ్య కాస్త అతిగా అనిపిస్తోంది. ఆయన లేవనెత్తిన అంశం మాత్రం సరైందే' అని మస్క్‌ రిప్లే ఇచ్చాడు.