El Nino - Stock Market: ఫెడ్ కఠిన వైఖరి, చైనా పునఃప్రారంభం కారణంగా విదేశీ పెట్టుబడిదార్లు మన మార్కెట్‌ నుంచి తరలి వెళ్లిపోతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా నిఫ్టీ గత రెండు నెలల్లో 4% పైగా పడిపోయింది. పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు కూడా బ్యాంక్ FDల పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి పడిన 'ఎల్ నినో' (El Nino), దలాల్ స్ట్రీట్ కష్టాలను మరింత పెంచుతోంది.


ఎల్‌ నినో అంటే ఏంటి?
ఎల్‌ నినో అనేది ఒక రకమైన వాతావరణ పరిస్థితి. దీనివల్ల వర్షపాతం బాగా తగ్గిపోతుంది, వ్యవసాయ రంగం కుదేలవుతుంది. పంటలు సరిగా పండవు. కరవు & ఆహార పదార్థాల ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతాయి. ఫైనల్‌గా, ప్రజలు ఆహార పదార్థాల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది, మిగిలిన ఖర్చులు తగ్గించుకుంటారు. ఇది అన్ని రంగాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. 


వేసవి నాటికి భారతదేశంలో ఎల్ నినో పరిస్థితి ఏర్పడితే, 2023లో మన దేశం అతి తక్కువ రుతుపవనాలను (లోటు వర్షపాతం) చూసే అవకాశం ఉంది. ఫలితంగా ఖరీఫ్ పంటకు ముప్పు ఏర్పడుతుంది, దిగుబడులు తగ్గుతాయి. ఎల్‌ నినో వల్ల మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు లేదా కుంభవృష్టి కురిసే అవకాశం కూడా ఉంది. ఇది కూడా వ్యవసాయ రంగానికి నష్టమే.


ఏయే రంగాలపై ఎక్కువ ప్రభావం?
గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకుంటున్న డిమాండ్‌కు ఎల్ నినో బ్రేక్‌ వేస్తుందని, ఆటో & FMCG రంగాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చని మార్కెట్‌ వర్గాలు భయపడుతున్నాయి.


ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) నిఫ్టీ FMCG ఇండెక్స్ 1.5% పెరగగా, ఆటో ఇండెక్స్ దాదాపు 1% పెరిగింది.


భారతదేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయం రంగమే వెన్నెముక. ఇది ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం పచ్చగా ఉంటేనే.. ద్వితీయ, తృతీయ రంగాలైన పారిశ్రామిక, సేవల రంగాలు బాగుంటాయి. ఈ కారణం వల్లే, వాతావరణ మార్పులకు స్టాక్‌ మార్కెట్‌ ప్రభావితం అవుతుంది.


"ఎల్ నినో వల్ల బలహీనమైన రుతుపవనాలతో పాటు భారతీయ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నాం. రబీ, ఖరీఫ్ పంటల ఉత్పత్తి పడిపోతే ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది, గ్రామీణ డిమాండ్‌లో వృద్ధి నెమ్మదిస్తుంది. చివరగా, అధిక ఉష్ణోగ్రతలు అధిక విద్యుత్ డిమాండ్‌కు దారితీస్తాయి. దీనివల్ల బొగ్గు దిగుమతులు పెరుగుతాయి. దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగి ప్రజల కష్టాలు పెరుగుతాయి" - అమ్నీష్ అగర్వాల్, బ్రోకింగ్‌ హౌస్‌ ప్రభుదాస్ లీల్లాధర్‌


మార్చి-మే నెలల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. కీలకమైన నైరుతి రుతుపవనాల సమయంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం 50-50గా ఉంది.


Q3 ఎర్నింగ్స్ సీజన్‌లో FMCG కంపెనీలు సంతోషంగా కనిపించాయి. ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టడంతో గ్రామీణ మార్కెట్లలో ఆశలు చిగురిస్తున్నాయని కొన్ని అగ్రశ్రేణి కంపెనీలు చెప్పాయి. అయితే, ఇప్పుడు భయపెడుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఆశల చివుళ్లు వాడిపోయే ప్రమాదం ఉంది.


భారతదేశంలో ఎన్‌ నినో పరిస్థితిపై మరింత స్పష్టమైన చిత్రం ఏప్రిల్-మే నెలల్లో కనిపిస్తుంది.


"ఒక సాధారణ కన్జ్యూమర్‌ కంపెనీ ఆదాయంలో దాదాపు 36% గ్రామీణ భారతదేశం నుంచే వస్తుంది. ఎల్‌నినో వల్ల లోటు వర్షపాతం ఏర్పడితే, రూరల్‌ FMCG డిమాండ్‌ పట్టాలు తప్పవచ్చు" - అబ్నీష్ రాయ్, నువామా రీసెర్చ్‌ 


వాహన రంగం విషయానికి వస్తే... ఫిబ్రవరి నెలలో వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలు బలంగా ఉన్నాయి. భారతదేశంలోని అతి పెద్ద కార్ మార్కర్ మారుతీ సుజుకి గ్రామీణ విక్రయాల వాటా ప్రస్తుతం 44.3%గా ఉంది. తమ గ్రామీణ విక్రయాలకు ఎల్ నినో ప్రమాదం తెస్తుందని ఈ కంపెనీ కూడా అంగీకరించింది.


"ఎల్‌ నినో పరిస్థితితో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల వాల్యూమ్స్‌ ప్రభావితం కావచ్చు. గత సంవత్సరం 'లో బేస్‌' కారణంగా, 2Ws (ద్విచక్ర వాహనాలు) Q4లో బలాన్ని పొందుతాయి. అయితే, ఎల్ నినో ప్రభావం గ్రామీణ విభాగాలపై ఎంత ఉంటుందో చూడాలి" LKP సెక్యూరిటీస్ 


దేశీయ బ్రోకరేజ్ ప్రభుదాస్ లీలాధర్‌, ఆటో రంగానికి "ఓవర్‌ వెయిట్‌" రేటింగ్‌ ఇచ్చినా, కన్జ్యూమర్‌ స్టాక్స్‌కు "అండర్‌వెయిట్‌" రేటింగ్‌ ఇచ్చింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.