Unacademy Lays Off: ఎడ్యూటెక్ స్టార్టప్ అన్‌అకాడమీ (UNacademy) ఉద్యోగుల గుండెలు గుభేల్‌మనిపించింది! ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా కొన్ని వారాలుగా 1000 మందిని ఉద్యోగాల్లోంచి తీసేసింది. ఇందులో రెగ్యులర్, కాంట్రాక్టు ఎడ్యుకేటర్లు ఉన్నట్టు తెలిసింది.
అన్‌అకాడమీ ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉంది. గత వారం ఈ కంపెనీ 600 మందిని ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవాలని చెప్పింది. వెంచర్ ఫండింగ్ తగ్గిపోవడం, ఆర్థిక వాతావరణం అనువుగా లేకపోవడంతో ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే డౌన్‌సైజింగ్ చేపట్టింది. గతేడాది ఆగస్టులో అన్‌అకాడమీ 3.4 బిలియన్ డాలర్ల విలువతో 440 మిలియన్ డాలర్లను సింగపూర్‌కు చెందిన టెమాసెక్ నుంచి సేకరించింది.
ఉద్యోగాల్లోంచి తీసేసిన 1000 మందిలో దాదాపుగా 300 మంది ఎడ్యుకేటర్లు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్లు సేల్స్, బిజినెస్, ఇతర విభాగాల్లో ఉన్నారు. అన్‌అకాడమీ టెస్టు ప్రిపరేషన్ ప్రొడక్టులో భాగమైన వారిని ఎక్కువగా తీసేసింది. లేఆఫ్‌లు ప్రకటించక ముందు కంపెనీలో దాదాపుగా 6000 మంది పనిచేస్తున్నారు. కాగా పనితీరును మదింపు చేసిన తర్వాతే కొందరిని తీసేశామని కంపెనీ అంటోంది. తమ పనితీరు, పారదర్శకత చాలా ఎక్కువని పేర్కొంది. ప్రస్తుతం బిజినెస్ చాలా వృద్ధి సాధిస్తోందని వెల్లడించింది.
ఉద్యోగులు మాత్రం మరోలా చెబుతున్నారు. తమకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వకుండానే వెళ్లిపోమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పనితీరు పట్ల కంపెనీ ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేదన్నారు. ప్రొబేషన్ పూర్తికాకుండానే జాయిన్ అయిన రెండు నెలలకే పంపించేశారని చెబుతున్నారు. కంపెనీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఛానెల్ 'స్లాక్' నుంచి తమను ఉన్నపళంగా తొలగించారని, తర్వాత ఈమెళ్లకు ఒక లింక్ పంపించి తీసేశారని వాపోతున్నారు. 'అక్కడ చాలా ప్రెజర్ ఉంటుంది. విషం చిమ్ముతూనే ఉంటారు. ప్రతిరోజు 12-14 గంటలు పని చేయించుకొనేవారు. లేదంటే వెళ్లిపోవాలని చెప్పేవారు. మా పనితీరు గురించి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. పైగా ఇవన్నీ మేనేజ్‌మెంట్ నిర్ణయాలని హెచ్‌ఆర్ చెప్పారు' అని ఉద్యోగులు అంటున్నారు.