Reliance Group chairman Anil Ambani summoned by ED | ముంబై: రిలయన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన వ్యాపార సంస్థలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు (Money laundering Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తొలి అరెస్టు చేసింది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, బిస్వాల్ ట్రేడ్‌లింక్ ప్రైవేట్ లిమిటెడ్ (బిటిపిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిస్వాల్‌ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని బిటిపిఎల్ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన మరుసటి రోజే ఈడీ పార్థసారథి బిస్వాల్‌ను అరెస్టు చేసింది.

ఆగస్టు 5న విచారణకు రావాలని అనిల్ అంబానీకి సమన్లు

 ఆగస్టు 5న విచారణకు హాజరుకావాలని రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు ​​జారీ చేసింది. ఆయన గ్రూప్ కంపెనీలు కోట్లాది రూపాయల బ్యాంకు రుణాల మోసానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని తమ ఆపీసులో విచారణకు రావాలని నోటీసులలో పేర్కొంది అని అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి. విదేశాలకు వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా 66 ఏళ్ల వ్యాపారవేత్త అనిల్ అంబానీపై లుక్ అవుట్ సర్క్యులర్ (Lookout Notice) కూడా జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసు ఇక్కడే నమోదైంది కనుక ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని అనిల్ అంబానీకి జారీ చేసిన సమన్లలో ఈడీ ఆదేశించింది. 

విచారణకు హాజరైన తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఈడీ నివేదించింది. అంబానీ గ్రూప్ కంపెనీల కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లకు కూడా త్వరలో సమన్లు ​​అందనున్నాయని పిటిఐ వార్తా సంస్థ వర్గాలను ఉటంకించింది.

మూడు రోజులపాటు ఈడీ సోదాలు

గత వారం అనిల్ అంబానీ వ్యాపార గ్రూప్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌లతో సహా 50 కంపెనీలు, 25 మంది వ్యక్తుల 35 కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన తర్వాత ఈ సమన్లు ​​జారీ చేసింది. జూలై 24న ప్రారంభమైన ఈడీ సోదాలు దాదాపు మూడు రోజుల పాటు కొనసాగాయి. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (R Infra)తో సహా బహుళ గ్రూప్ కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

సెబి నివేదిక ఆధారంగా, ఆర్ ఇన్‌ఫ్రా సిఎల్ఇ అనే కంపెనీ ద్వారా ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్లు (ICDs)గా మళ్లించినట్లు ఏజెన్సీ గుర్తించింది. వాటాదారులు, ఆడిట్ ప్యానెల్ నుంచి పర్మిషన్ లేకుండా ఉండటానికి సిఎల్ఇని తన సంబంధిత పార్టీగా ఆర్ ఇన్‌ఫ్రా వెల్లడించలేదని ఆరోపణలున్నాయి. మంగళవారం నాడు అనిల్ అంబానీ ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కానుండటంపై రిలయన్స్ సంస్థలతో పాటు ఇతర వ్యాపార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేవలం విచారణకు పరిమితం కానున్నారా, ఏమైనా భారీ అవకతవకలు గుర్తించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అనే చర్చలతో కంపెనీకి చెందిన షేర్లు శుక్రవారం మార్కెట్లో భారీగా పతనమయ్యాయి.