Donald Trump Net Worth: డొనాల్డ్‌ ట్రంప్‌ పూర్తి పేరు "డొనాల్డ్ జాన్‌ ట్రంప్" (DJT). ట్రంప్‌నకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. గోల్ఫ్ కోర్స్‌ల నుంచి హోటళ్ల వరకు రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ ఉన్నాయి. అమెరికాలోని అత్యంత ధనవంతుల ర్యాంకర్లలో అతను ఒకడు. దినదినాభివృద్ధి చెందిన ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్‌లో వాటా కారణంగా ఈ సంవత్సరం ట్రంప్‌ నికర విలువను రెండింతలకు పైగా పెరిగింది, 5.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఫోర్బ్స్ ప్రకారం, 2024 ప్రారంభంలో అతని సంపద 2.4 బిలియన్‌ డాలర్లు. ఇప్పుడు అది రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది.


షేర్ల నుంచి అధిక సంపద
DJT షేర్లలో తీవ్రమైన ఊగిసలాట ఉన్నప్పటికీ, ఈ సోషల్ నెట్‌వర్క్‌లో ట్రంప్‌నకు ఉన్న వాటా వల్ల, అతని మొత్తం నికర విలువను 5.5 బిలియన్ల డాలర్లకు చేరింది. దాదాపు 3.5 బిలియన్‌ డాలర్ల విలువైన DJT షేర్లే ట్రంప్‌ అతి పెద్ద ఆస్తిగా మారింది. వాస్తవానికి, అక్టోబర్ 29న షేర్లు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ట్రంప్‌ నికర విలువ 5.9 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఆ తర్వాత షేర్ల విలువ జారిపోయింది, ట్రంప్‌ సంపద విలువ తగ్గింది.


విశేషం ఏంటంటే... DJT షేర్లను విక్రయించనని ట్రంప్ ప్రమాణం చేశారు. కాబట్టి, అతని స్టాక్ మార్కెట్ సంపద ప్రస్తుతం గాల్లో లెక్క లాంటిది. అది చేతిలోకి రాదు.


ట్రంప్‌నకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
DJT స్టాక్‌లో బిలియన్ల కొద్దీ ఆస్తి ఉన్నప్పటికీ, ట్రంప్ అసలు సంపద రియల్ ఎస్టేట్ నుంచి వస్తోంది. న్యూయార్క్ నగరంలోని నివాస భవనాల నుంచి గోల్ఫ్ కోర్సులు, ప్రపంచవ్యాప్తంగా హోటళ్ల వరకు ట్రంప్‌ స్థిరాస్తి వ్యాపారం విస్తరించింది. భారదేశ స్థిరాస్తి రంగంలోనూ ట్రంప్‌ బ్రాండ్‌ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.


బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ప్రకారం, మాన్‌హాటన్‌లోని కార్యాలయ భవనం '1290 అవెన్యూ ఆఫ్ అమెరికాస్‌'లో ట్రంప్‌నకు $500 మిలియన్ల వాటా ఉంది. అతని అతి పెద్ద ఆస్తుల్లో ఇదొకటి. ట్రంప్‌నకు చెందిన 'నేషనల్ డోరల్ మయామి గోల్ఫ్ రిసార్ట్' విలువ సుమారు $300 మిలియన్లు.


క్రిప్టోకరెన్సీలు, నాన్-ఫంగబుల్ టోకెన్‌లు (NFTs) సహా డిజిటల్ ఆస్తుల నుంచి ట్రంప్ సంపాదిస్తారు. US ట్రెజరీలు, స్టాక్స్‌, ఇండెక్స్ ఫండ్లు, బాండ్లలోనూ ట్రంప్‌ పెట్టుబడులు ఉన్నాయి. అతని దగ్గర కనీసం $1,00,000 విలువైన బంగారం ఉందని అంచనా. అంతేకాదు.. బైబిళ్ల నుంచి స్నీకర్ల వరకు వివిధ రకాల వస్తువులపై తన పేరు వాడుకోవడానికి లైసెన్స్ ఇచ్చి, దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు.


ట్రంప్‌ నివాసం
డొనాల్డ్ ట్రంప్‌నకు చాలా విలాసవంతమైన బంగ్లాలు ఉన్నప్పటికీ, వాటిలో అత్యంత ప్రత్యేకమైనది ఫ్లోరిడాలో ఉన్న మార్-ఎ-లాగో బంగ్లా. ప్రస్తుతం, అందులోనే తన భార్యతో కలిసి నివసిస్తున్నారు.


అద్భుతమైన కార్‌ కలెక్షన్‌
ఫైనాన్షియల్ టైమ్స్‌ రిపోర్ట్‌ ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ దగ్గర రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్, ఫాంటమ్, మెర్సిడెస్-బెంజ్ ఎస్‌ఎల్‌ఆర్ మెక్‌లారెన్, లంబోర్ఘిని డయాబ్లో, టెస్లా రోడ్‌స్టర్, కాడిలాక్ అలంటే వంటి కార్లు ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారపు ఛాపర్ కూడా ఉంది.


కమలా హారిస్‌ ఆస్తుల విలువ
ఫోర్బ్స్ (Forbes) అంచనా ప్రకారం, ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్ (Kamala Harris) సంపద ఆమె భర్త డగ్లస్ ఎమ్‌హాఫ్‌తో (Douglas Emhoff) కలిపి సుమారు $8 మిలియన్లు డాలర్లు. దశాబ్దాల రాజకీయాలు, పుస్తకాల రాయల్టీలు, పెట్టుబడుల నుంచి కమలా హారిస్‌ సంపాదిస్తున్నారు. 


మరో ఆసక్తికర కథనం: పసిడిపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ