U.S. Jobs Data: సెప్టెంబర్ నెలకు, అమెరికన్ జాబ్ డేటా తగ్గింది. అంతకుముందు నెల అయిన ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఉద్యోగ నియామకాలు తగ్గాయి. అయితే అంకెల పరంగా చూస్తే మాత్రం గట్టిగానే కనిపిస్తోంది. సెప్టెంబర్ నెలలో, కొత్తగా 2,63,000 మందికి అమెరికాలో ఉద్యోగాలు (Nonfarm Payrolls) దొరికాయి. అమెరికన్ లేబర్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం ఈ నివేదికను విడుదల చేసింది.
సెప్టెంబర్‌లో జాబ్ డేటా 2,75,000గా ఉంటుందని డౌ జోన్స్ వేసిన అంచనా వేసింది. ఈ అంచనా తప్పడంతో అమెరికన్ స్టాక్ మార్కెట్లు గట్టిగా పడ్డాయి. డౌ జోన్స్ 2 శాతం పైగా, S&P 500 దాదాపు 3 శాతం, నాస్‌డాక్ దాదాపు 4 శాతం క్షీణించాయి.
ఈ ఏడాది ఆగస్టు నెలలో 3.15 లక్షల మందికి, జులైలో 5.37 లక్షల మందికి, జూన్‌లో 2.93 లక్షల మందికి, మే నెలలో 3.86 లక్షల మందికి, ఏప్రిల్‌లో 3.68 లక్షల మందికి, మార్చిలో 3.98 లక్షల మందికి, ఫిబ్రవరిలో 7.14 మందికి, జనవరిలో 5.04 లక్షల మందికి అమెరికాలో కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. నెలవారీ వృద్ధిపరంగా చూస్తే.. 2021 ఏప్రిల్ తర్వాత సెప్టెంబర్ వృద్ధి తక్కువ.
నిరుద్యోగిత రేటు 3.7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తే, 3.5 శాతానికి దిగి వచ్చింది. ఇది అర్ధ శతాబ్దపు కనిష్ఠ స్థాయి. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 62.3 శాతానికి తగ్గడం, శ్రామిక శక్తి పరిమాణం 57,000 తగ్గడంతో నిరుద్యోగిత రేటులో మెరుగుదల కనిపించింది.
ఫెడ్ రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్
సెప్టెంబర్‌లో ఉద్యోగ నియామకాలు సంఖ్యాపరంగా ఎక్కువగానే ఉండటం, అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో బలాన్ని సూచిస్తోంది. వడ్డీ రేట్లను మరింత పెంచినా ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలదు అన్నదానికి ఈ బలం ఒక సంకేతం. కాబట్టి, ద్రవ్యోల్బణంపై పోరాటాన్ని కొనసాగించేందుకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ (US FED) కీలక రేట్లను మరింత పెంచేందుకు అవకాశాలు ఉన్నాయని ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఈ సంవత్సరం ప్రారంభం నుంచి వడ్డీ రేట్లను పెంచుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో దాదాపు సున్నాగా ఉన్న పాలసీ రేటును ప్రస్తుత శ్రేణి 3-3.25%కి పెంచింది. మున్ముందు మరింత నొప్పి తప్పదంటూ గత నెలలోనే సిగ్నల్ కూడా ఇచ్చింది. సెప్టెంబర్ జాబ్స్ డేటా ఆ సిగ్నల్‌కు బలపరుస్తోంది.
బలపడిన డాలర్
వడ్డీ రేట్లు మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, శుక్రవారం ప్రధాన కరెన్సీలకు వ్యతిరేకంగా US డాలర్ బలపడింది. జపనీస్ యెన్‌తో పోలిస్తే, ప్రారంభ నష్టాలను తిప్పికొట్టి చివరకు 0.2% పెరిగి 145.42 యెన్ వద్ద డాలర్ నిలబడింది. గత నెలలో 24 సంవత్సరాల గరిష్ట స్థాయి 145.90 యెన్‌లను డాలర్ తాకడంతో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
డాలర్‌తో పోలిస్తే యూరో కూడా 0.6% తగ్గి $0.9735 వద్దకు చేరింది. మన రూపాయి కూడా జీవిత కాల కనిష్ట స్థాయిలో ఉంది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతున్నంత కాలం మన మార్కెట్ నుంచి ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FII) పెట్టుబడులు వెళ్లిపోతూనే ఉంటాయని గుర్తుంచుకోవాలి. తదనుగుణంగా మన ట్రేడింగ్ లేదా పొజిషన్లను ప్లాన్ చేసుకోవడం మంచిది.
ఇన్‌ఫ్లేషన్ డేటా
అమెరికాలో ద్రవ్యోల్బణం డేటా వచ్చే వారం వెల్లడవుతుంది. మార్కెట్ దీనిని నిశితంగా పరిశీలిస్తుంది. కాబట్టి, మనలాంటి చిన్న ఇన్వెస్టర్లు కూడా అమెరికన్ ఇన్‌ఫ్లేషన్ డేటా మీద ఒక కన్నేసి ఉంచడం తప్పనిసరి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.