DA News: ఈ ఏడాది మార్చి 8వ తేదీన హోలీ పండుగ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పండుగ మరింత ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. హోలీ పండుగకు కంటే ముందే కేంద్ర ఉద్యోగులు & పింఛనుదార్లకు (పెన్షనర్లు) డియర్‌నెస్ అలవెన్స్ (DA) లేదా డియర్‌నెస్ రిలీఫ్‌ను (DR) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయవచ్చు. హోలీ కానుకగా డీఏ పెంపుదల ఉంటుందన్న నమ్మకమైన సమాచారం బయటకు వచ్చింది.


కొన్ని జాతీయ మీడియా సంస్థల వార్తల ప్రకారం... ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ లేదా డియర్‌నెస్ రిలీఫ్‌ను 4 శాతం పెంచవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. దీనితో పాటు, కేంద్ర ప్రభుత్వం అందించే పింఛను మొత్తం కూడా పెరుగుతుంది. 


ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కరవు భత్యం (Dearness Allowance) 38 శాతంగా ఉంది. ఇప్పుడు, దీనిని మరో 4 శాతం పెంచితే, అది మూల వేతనంలో 38 శాతం నుంచి 42 శాతానికి చేరుతుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల స్థూల, నిరక వేతనం (Gross Pay & Net Pay) కూడా పెరుగుతుంది. 


డీఏ పెంపునకు ఒక ప్రామాణిక పద్ధతి ఉంది. ప్రతి నెలా లేబర్ బ్యూరో విడుదల చేసే "కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్" [Consumer Price Index for Industrial Workers - CPI(IW)] ఆధారంగా డీఏను లెక్కిస్తారు. కార్మిక శాఖకు చెందిన అనుబంధ విభాగమే ఈ లేబర్ బ్యూరో. 


2022 డిసెంబర్ నెలకు సంబంధించిన సీపీఐ ఐడబ్ల్యూ 2023 జనవరి 31న విడుదల అయ్యింది. దీని ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ 4.23 శాతం మేర పెరగాల్సి ఉంటుంది. ఆనవాయితీ ప్రకారం, పాయింట్ తర్వాత ఉన్న నంబర్లను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదు. అందువల్ల, పాయింట్‌ తర్వాత ఉన్న 23 నంబర్‌ను వదిలేసి, డీఏను నికరంగా 4 శాతం పెంచవచ్చు. తద్వారా, మొత్తం డియర్‌నెస్‌ అలవెన్స్‌ 42 శాతానికి చేరే అవకాశం ఉంది. 


జనవరి 1, 2023 నుంచి కొత్త DA వర్తింపు
ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి, జులై 1వ తేదీ నుంచి కొత్త డీఏ అమల్లోకి వస్తుంది. చివరిసారిగా 2022 సెప్టెంబర్ 28న DAను సవరించారు. దానిని ఆ ఏడాది జులై 1వ తేదీ నుంచి వర్తింపజేశారు. తాజా డీఏ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఫలితంగా, కోటి మందికి పైగా ఉద్యోగులు & పెన్షనర్లు లబ్ధి పొందుతారు. వాళ్లు ప్రస్తుతం అందుకుంటున్న డియర్‌నెస్‌ రిలీఫ్‌ 38 శాతం నుంచి 42 శాతానికి చేరుతుంది. 


జీతం ఎంత పెరుగుతుంది?
ఉద్యోగుల మూల వేతనం, పెన్షనర్ల భత్యం రూ. 18,000 ఉంటే, 38% DAగా రూ. రూ. 6840 అందుతోంది. ఇదే జీతం మీద DAను 42%కు పెంచిన తర్వాత డీఏ మొత్తం రూ. 7560 అవుతుంది. అంటే నెలవారీగా రూ. 720 పెంపు కనిపిస్తుంది.  ఈ విధంగా పెన్షనర్లు & ఉద్యోగుల జీతం పెరుగుతుంది.


సంవత్సరానికి రెండు సార్లు సవరణ
డియర్‌నెస్ అలవెన్స్‌ అంటే, పెరిగిన ధరల నుంచి రక్షణ కోసం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపశమనం లేదా పరిహారం. ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏను కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. డియర్‌నెస్ అలవెన్స్‌లో మొదటి పెంపు ఒక సంవత్సరంలో జనవరిలో, రెండో పెంపు జులైలో జరుగుతుంది. పెరిగిన డీఏ లేదా డీఆర్‌లు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తాయి. అంటే, జీతం పన్ను పరిధిలోకి వస్తే, డియర్‌నెస్ అలవెన్స్ కూడా పన్ను పరిధిలోకి వస్తుంది.