LPG Cylinder Price Reduced From April 2024: సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ఘట్టం ప్రారంభానికి ముందు, దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక కానుక ఇచ్చింది. ఈ రోజు (01 ఏప్రిల్ 2024‌) నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ప్రకటించాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం కలగడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నారు.


వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ రేటు తగ్గింపు
ప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) ఇచ్చిన సమాచారం ప్రకారం... నేటి నుంచి దేశంలోని వివిధ నగరాల్లో ఎల్‌పీజీ సిలిండర్ల ధర రూ.30.50 వరకు తగ్గింది. మళ్లీ గ్యాస్‌ ధరలను సవరించే వరకు ఈ తగ్గింపు ప్రయోజనం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అయితే, ఇది 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. 14 కిలోల దేశీయ గ్యాస్‌ సిలిండర్‌ రేటును OMCలు తగ్గించలేదు. 


దేశంలోని ప్రధాన నగరాల్లో 19 కిలోల LPG సిలిండర్‌ కొత్త ధరలు ఇవి:
తాజా కోత తర్వాత దిల్లీలో 19 కిలోల బ్లూ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price Today) రూ. 1,764.50 కు తగ్గింది. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్‌ బండ రూ. 1,879 కు అందుబాటులోకి వచ్చింది. ఇదే పెద్ద సిలిండర్ కోసం ముంబై ప్రజలు ఇప్పుడు రూ. 1,717.50 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో దీని ధర ఈ రోజు నుంచి రూ. 1,930 గా మారింది.


మొత్తం ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు (Elections 2024) ఈ నెలలో ప్రారంభమై జూన్‌ వరకు జరగనున్నాయి. ఈ నెలలో మొదటి దశ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల ధర తగ్గడం కీలకంగా మారింది. 


ప్రభుత్వ చమురు సంస్థలు, గత నెలలో (మార్చి) కమర్షియల్‌ ఎల్‌పీజీ రేట్లను రూ. 25.50 పెంచాయి. మార్చి నెలకు ముందు, ఫిబ్రవరిలోనూ 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ. 14 మేర పెంచాయి. ఈ ఏడాది ప్రారంభంలో, జనవరి నెలలో, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తూతూమంత్రంగా కేవలం రూపాయిన్నర తగ్గించాయి. 


గత నెలలో బహుమతి
గత నెల ప్రారంభంలో, మహిళా దినోత్సవం (8 మార్చి 2024) సందర్భంగా, ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ.100 తగ్గిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. దీనికి ఒకరోజు ముందు, మార్చి 07న, పీఎం ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.300 సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. 2025 మార్చి 31 వరకు ఇది వర్తిస్తుంది. 


పీఎం ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana -  PMUY) లబ్ధిదార్లకు పీఎంయూవై సబ్సిడీ రూ.300 + రూ.100 డిస్కౌంట్‌ కలిపి, మొత్తం రూ.400 తగ్గింది. దీంతో, పీఎం ఉజ్వల యోజన లబ్ధిదార్లకు, దిల్లీలో ఒక్కో సిలిండర్ రూ.503 కే అందుబాటులో ఉంది. దేశంలోని మిగిలిన నగరాల్లో దాదాపు ఇదే రేటుకు 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ లభిస్తోంది. రవాణా ఛార్జీల కారణంగా ఈ రేటు అతి స్వల్పంగా మారొచ్చు.


తెలుగు రాష్ట్రాల్లో దేశీయ గ్యాస్‌ సిలిండర్ ధరలు:


హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ‍‌(Domestic LPG Cylinder Price In Hyderabad) రూ. 855కి అందుబాటులో ఉంది.
విజయవాడలో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ‍‌(Domestic LPG Cylinder Price In Vijayawada) రూ. 855కి అందుబాటులో ఉంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో LPG సిలిండర్ ధరలు:


న్యూదిల్లీలో -------- రూ. 803 
ముంబైలో -------- రూ. 802.50
చెన్నైలో -------- రూ. 818.50
కోల్‌కతాలో -------- రూ. 829
నోయిడాలో -------- రూ. 800.50
గురుగావ్‌లో -------- రూ. 811.50
చండీగఢ్‌లో -------- రూ. 912.50
జైపుర్‌లో -------- రూ. 806.50
లక్‌నవూలో -------- రూ. 840.50
బెంగళూరులో --------  రూ. 805.50
పట్నాలో -------- రూ. 892.50


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి