LPG Prices in India: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, వంట గ్యాస్ ధరలు పెరుగుతున్న తీరు సామాన్యులను విపరీతంగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. చమురు కంపెనీలు తాజాగా మరోసారి వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్‌పై ధరను భారీగా పెంచాయి. ఏకంగా రూ.273.5 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌ లో 19 కిలోల కమర్షియల్‌ LPG Cylinder సిలిండర్‌ ధర రూ.2,460 కి చేరింది.


దేశ- రాజధాని ఢిల్లీలో అయితే, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.250 పెరిగింది. దీంతో అక్కడ ధర రూ.2,253కు చేరింది. అయితే ప్రస్తుతానికి గృహ అవసరాలకోసం వాడే 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. దాని ధరను కొద్ది రోజుల క్రితమే చమురు కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే. ఇటీవలే రూ.50 పెంచాయి. 






సిలిండర్ల ధరలో ఈ పెరుగుదల చూస్తే గత రెండు నెలల్లో ఇప్పటి వరకు రూ.346 పెరిగింది. చాలా కాలంగా పెట్రోల్-డీజిల్, LPG వినియోగదారులు అతి తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారు. గత మార్చి 22న నాన్ సబ్సిడీ డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరపై రూ.50 పెంచారు. 


వాణిజ్య సిలిండర్ ధరలు తాజాగా పెరిగిన రేటుతో ఇలా ఉన్నాయి. కోల్‌కతాలో పాత రేటు రూ.2,087కి బదులుగా తాజాగా రూ.2351 అయింది. ముంబయిలో రూ.1955 ఉండగా, రూ.2205కి ఎగబాకింది. చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ.2138కి బదులుగా ఇక రూ.2406 వెచ్చించాల్సి ఉంటుంది. వాణిజ్య LPG సిలిండర్ల ధరల పెరుగుదలతో పాటు, వాయు ఇంధన ధరలు (Air Fuel) కూడా పెరిగాయి. ఏప్రిల్ 1న జెట్ ఇంధనం అంటే ఏటీఎఫ్ ధర 2 శాతం పెరిగి కిలో లీటర్ ధర 1,12,925 కు చేరింది. గతంలో కిలోలీటర్‌ రూ.1,10,666గా ఉంది. అదే సమయంలో, కొత్త రేట్లు 15 ఏప్రిల్ 2022 నుండి వర్తించనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.


పెట్రోలు ధరలూ అంతే.. 
మార్చి 22 నుంచి గత పదిరోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. మొత్తంగా లీటర్‌ పెట్రో‌ల్‌పై రూ.7.22, లీటర్‌ డీజి‌ల్‌పై రూ.6.96 చొప్పున ధరలు పెరి‌గాయి. దీంతో హైద‌రా‌బా‌ద్‌లో ప్రస్తుతం పెట్రోల్‌ ధర రూ.115.42, డీజిల్‌ రూ.101.58గా ఉంది.