Dr Reddy's Labs: తెలుగు కంపెనీ డా.రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (Dr Reddy's Labs) సహా మన దేశానికి చెందిన మూడు సంస్థలు విశిష్ట ఘనతను సాధించాయి.
హైదరాబాద్ బాచుపల్లిలో ఉన్న డా.రెడ్డీస్ యూనిట్‌ను ‘గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్’ (Global Lighthouse Network) కింద గ్లోబల్ ఎకనమిక్ ఫోరం (WEF) గుర్తించింది. ఫార్మా మేజర్ సిప్లాకు (Cipla) ఇండోర్‌లో ఉన్న ఫ్లాంట్‌కు, శ్రీ సిటీలో మోండెలెజ్ (Mondelez) ఫెసిలిటీకి కూడా ఈ గౌరవం దక్కింది.
మొత్తం 11 ఫ్యాక్టరీలు
మన దేశం నుంచి ఈ మూడు కంపెనీల ఫ్లాంట్లతో పాటు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11 ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ సైట్లను గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లోకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాడ్ చేసింది.
కృత్రిమ మేధస్సు, 3D ప్రింటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికతలను అమలు చేయడంలో ముందంజలో ఉన్న 100 ఉత్పత్తిదారుల బృందమే గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్. లైట్‌హౌస్ మెంబర్‌షిప్ దక్కడం అంతర్జాతీ స్థాయిలో విశిష్ట గౌరవాన్ని అందుకోవడమే.
పర్యావరణ అనుకూల పద్థతులు పాటిస్తున్న ప్రస్తుత నలుగురు లైట్‌హౌస్ మెంబర్లకు సస్టైనబిలిటీ లైట్‌హౌస్ (Sustainability Lighthouse) పేరిట అదనపు హోదా ఇచ్చినట్లు WEF తెలిపింది.
యూనిలీవర్ కూడా
ఈ నాలుగింటిలో, యూనిలీవర్‌కు (Unilever) భారతదేశంలో ఉన్న దపడ ఫెసిలిటీ (Dapada facility) కూడా ఉంది.
ప్రపంచ మాంద్యం భయాలు, ఇంధన ధరల పెరుగుదల, సరఫరా గొలుసు అంతరాయాల మధ్య కూడా పోటీతత్వాన్ని ఎలా కొనసాగించవచ్చో, కొత్త ఉద్యోగాలను ఎలా సృష్టించవచ్చో లైట్‌హౌస్ ఫ్యాక్టరీలు నిరూపిస్తున్నాయని WEF తెలిపింది. ఈ యూనిట్లలో ఆయా కంపెనీల యాజమాన్యాలు అమలు చేసిన నూతన విధానాలు, వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యయాలు గణనీయంగా తగ్గి, ఉత్పాదకత బాగా పెరిగినట్లు WEF పేర్కొంది. ఈ ఫ్యాక్టరీల్లో పాటిస్తున్న పద్ధతులను వ్యాపారవేత్తలు, ప్రభుత్వ పెద్దలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించింది. కొత్త ఉపాధిని సృష్టిస్తూనే, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూనే వ్యాపార లక్ష్యాలను ఎలా సాధించాలో ఇలాంటి సంస్థలను చూసి నేర్చుకోవచ్చని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ఈ సంస్థలు మరింత ముందుకు తీసుకువెళ్తాయని అభిప్రాయపడింది.
డా.రెడ్డీస్ షేరు ధర
నిన్న (మంగళవారం) రూ.4,282.75 వద్ద ముగిసిన డా.రెడ్డీస్ షేరు ధర ఇవాళ (బుధవారం) రూ.4,300 దగ్గర ఓపెన్ అయింది. ఉదయం 9.50 గంటల సమయానికి 0.12 శాతం నష్టంతో రూ.4,277.65 వద్ద ఉంది.
సిప్లా షేరు ధర
నిన్న (మంగళవారం) రూ.1,110.10వద్ద ముగిసిన సిప్లా షేరు ధర ఇవాళ (బుధవారం) రూ.1,111.60 దగ్గర ఓపెన్ అయింది. ఉదయం 9.50 గంటల సమయానికి 0.42 శాతం లాభంతో రూ.1,114.80 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.