Chicken Price News: మాంసాహార ప్రియులకు గుడ్‌న్యూస్‌! కోడికూర, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. గడిచిన 15 రోజుల్లో వేర్వేరు రాష్ట్రాల్లో ఫార్మ్‌ గేట్‌ చికెన్‌ ధరలు విపరీతంగా పతనం అయ్యాయి. మహారాష్ట్రలో ఫార్మ్‌ రేట్లు కిలోకు రూ.115 నుంచి రూ.60కి తగ్గగా ఝార్ఖండ్‌లో రూ.50కి తగ్గాయి.


హిందువులు పరమ పవిత్రంగా భావించే శ్రావణ మాసం మరికొన్ని రోజుల్లో మొదలవుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో చాలామంది కోడికూర తినడం మానేశారు. వాతావరణం చల్లగా ఉండటంతో కోళ్ల బరువు సైతం పెరుగుతోంది. ఎడతెగని వర్షాలతో త్వరగా కోళ్లను అమ్ముకోవాలని రైతులు భావిస్తున్నారు. ఇవన్నీ చికెన్‌ ధరలు తగ్గడానికి కారణాలే.


'15 రోజులుగా ఫార్మ్‌గేట్‌ చికెన్‌ ధరలు పతనమయ్యాయి. ఉత్పత్తి ఖర్చుతో పోలిస్తే కిలోకు రూ.115 నుంచి రూ.60కి తగ్గింది. శ్రావణమాసం మొదలవుతుండటంతో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో ఊహించిన దానికన్నా ఎక్కువే తగ్గాయి' అని పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసిసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కన్వీనర్‌ వసంత్‌ కుమార్‌ శెట్టి అన్నారు. శ్రావణమాసం వల్ల ఉత్తర భారత దేశంలో వినియోగం బాగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. జూన్‌లో అధిక ధరల వల్లా డిమాండ్‌ పడిపోయిందని వెల్లడించారు.


సాధారణంగా శ్రావణ మాసం మొదలైనప్పుడు కోడి కూరకు డిమాండ్‌ తగ్గుతుంది. వినియోగం పడిపోతుంది. అయితే ఈ సారి ఊహించిందానికన్నా పతనం ఎక్కువగా ఉందని అంటున్నారు. దేశవ్యాప్తంగా వర్షాలు పడుతుండటం, వాతావరణం బాగాలేకపోవడమే ఇందుకు కారణం. చాలా నగరాల్లో కోడిగుడ్ల ధరలు 30-35 శాతం వరకు తగ్గాయి.


వరదల ప్రభావం


తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పౌల్ట్రీ యజమానులకు తమ ఫారంలకు వెళ్లి మెయింటెన్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవి అయితే మునిగిపోయే పరిస్థితి నెలకొంది. వర్షాలు(Rains) కాస్త తగ్గాక తిరిగి కోళ్లకు దాణా వేయడం వాటి సంరక్షణ చర్యలు తీసుకోవడానికి విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. తగ్గాయి అనుకున్న వర్షాలు మళ్లీ మొదలు కావడంతో ఇక పౌల్ట్రీ నిర్వాహకులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వచ్చేది శ్రావణ మాసం కావడంతో మెజారిటీ ప్రజలు నాన్ వెజ్(Non Veg) కు దూరంగా ఉంటారు. దీంతో తమకు నష్టాలు తప్పవని భావించిన పౌల్ట్రీ నిర్వాహకులు అతి తక్కువ ధరలకే చికెన్ షాపులకు(Chickent Shop) కోళ్లను అమ్మడం మొదలు పెట్టారు. 


రూ.100 కే కిలో చికెన్ 


అప్పటివరకు అటు దాణాతో బాటు కూలీలకు,  నిర్వహణకు లక్షలు ఖర్చు పెట్టిన కూడా చివరకు కనీస పెట్టుబడి రాని పరిస్థితి నెలకొంది. ఇక లీజులపై తీసుకున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మరోవైపు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి చికెన్ షాపు యజమానులు సైతం తక్కువ ధరకే అమ్మాలని నిర్ణయించుకున్నారు. దీంతో మొన్నటివరకూ రెండు వందల ఎనభై రూపాయలు నుంచి దాదాపు 300 రూపాయల వరకు పలికిన చికెన్ ఒక్కసారిగా సగం కంటే తక్కువ ధరకే పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 100 రూపాయలకే చికెన్ అమ్ముతూ ఉండటంతో జనాలు ఎగబడి కొన్నారు.