Byju's Crisis: డబ్బుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌, ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతోంది. కంపెనీ వాటాదార్లు, వారి వాటాలకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని బెంగళూరులోని 'నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్' (NCLT) బెంచ్‌ ఇటీవల బైజూస్‌ను ఆదేశించింది. దీంతో, రెండో రైట్స్ ఇష్యూ ‍‌(Byju's Rights Issue) తీసుకురావాలన్న బైజూస్‌ ప్లాన్‌కు కళ్లెం పడింది. ఇప్పుడు, NCLT నిర్ణయానికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టును ఈ ఎడ్‌టెక్‌ సంస్థ ఆశ్రయించింది. బైజూస్‌ పిటిషన్ ఈ రోజు (జూన్ 24) విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనికి ముందు, ఈ నెల 18, 21 తేదీల్లో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.


హైకోర్టుకు వెళ్లాలని బైజూస్‌ నిర్ణయం


సాధారణంగా, NCLT ఇచ్చిన ఆదేశాలను దాని కంటే ఉన్నత స్థాయి బెంచ్‌ అయిన 'నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్'లో (NCLAT) సవాల్‌ చేస్తుంటారు. అయితే, NCLATకి కాకుండా హైకోర్టుకు వెళ్లాలని బైజూస్‌ నిర్ణయించింది. తమ ప్రాథమిక హక్కులను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తుంటారు. బైజూస్‌ రెండో రైట్స్‌ ఇష్యూను ప్రారంభించేందుకు బెంగళూరు NCLT ఈ నెల 12న అనుమతిని నిరాకరించింది. ప్రధాన కేసులో నిర్ణయం వెలువడే వరకు అలాంటి చర్యలు తీసుకోవద్దని బైజూస్‌ను ఆదేశించింది. 


ఫస్ట్ రైట్స్ ఇష్యూ డబ్బులపైనా నిషేధం
బైజూస్‌ ఇప్పటికే ఒక రైట్స్ ఇష్యూను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి, కంపెనీ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కు (Byju Raveendran) - కొందరు వాటాదార్లకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ కేసులో ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు... బైజూస్ మరో దఫా షేర్లను జారీ చేయకూడదు, తొలి రైట్స్‌ ఇష్యూ నుంచి సేకరించిన 200 మిలియన్‌ డాలర్లను ఉపయోగించకూడదు. ఈ కేసు వచ్చే నెల 4వ తేదీన విచారణకు వస్తుంది. 


వాస్తవానికి, బైజూస్‌ రెండో రైట్స్‌ ఇష్యూ 2024 మే 13న ప్రారంభమైంది. జూన్ 13తో ముగుస్తుందని భావించారు. అయితే, దీనిపై స్టే విధిస్తూ జూన్‌ 12 బెంగళూరు జూన్‌ 12న తీర్పు చెప్పింది. రెండో రైట్స్‌ ఇష్యూ నుంచి సమీకరించిన నిధులను ఉపయోగించుకోవడానికి బైజూస్‌కు అనుమతి లేదు. రెండో రైట్స్‌ ఇష్యూ నుంచి వచ్చిన డబ్బును ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి.


ఉద్యోగులకు ఇప్పటికీ సకాలంలో జీతాలు లేవు
న్యాయ పోరాటంలో బిజీగా ఉన్న ఎడ్‌టెక్‌ సంస్థ, చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటోంది. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేకపోతోంది. న్యాయపరమైన ఖర్చులు పెరిగాయి. మరోవైపు బైజూస్‌ వ్యాపారం కూడా దెబ్బతింది. కంపెనీ నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోలను తొలగించారు. ఫస్ట్ రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బు కళ్ల ముందే ఉన్నా ఉపయోగించుకోవడానికి వీల్లేని పరిస్థితి. బైజూస్‌లో పెట్టుబడి పెట్టిన ప్రోసస్, జనరల్ అట్లాంటిక్, సోఫినా, పీక్ సంస్థలు.. మేనేజ్‌మెంట్‌ సరిగా లేదని ఆరోపిస్తూ రైట్స్‌ ఇష్యూకు అడ్డుపడ్డాయి.


మరో ఆసక్తిర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి