World's Most Expensive Ice Cream: ఒక కప్పు ఐస్ క్రీం ధర ఎంత ఉంటుంది? 10 రూపాయలు లేదా 50 రూపాయలు లేదా 100 రూపాయలు. బాగా రిచ్‌ మైండ్‌సెట్‌తో ఆలోచిస్తే, 10 వేల రూపాయల వరకు కూడా లెక్క వేయవచ్చు. కానీ, ఒక కప్పు ఐస్‌ క్రీమ్‌ రేటు ఒక కొత్త కారు ధరకు సమానంగా ఉంటుందని ఎవరైనా చెబితే, మీరు నమ్మకపోవచ్చు. కానీ అది ముమ్మాటికీ నిజం. అలాంటి హిమక్రీము ఒకటి ఉంది, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకుంది.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుగిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్‌ రికార్డ్‌ జపాన్‌కు చెందిన ఐస్ క్రీమ్ బ్రాండ్ సెల్లాటో (cellato) పేరిట ఉంది. సెల్లాటో కంపెనీ, ఒక ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్‌ను పరిచయం చేసింది. ప్రపంచంలో అత్యంత అరుదైన పదార్థాలను ఆ హిమక్రీము తయారీలో ఉపయోగించిందట. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. సెల్లాటో బ్రాండ్‌ ఐస్‌క్రీం ధర ఆకాశాన్నంటడానికి కారణం అదే.

ఒక్క చుక్క కూడా వదలొద్దు, దీని ధర ఎక్కువఇది చదివాక, ఆ హిమక్రీము రుచిని ఆస్వాదించాలని మీరు భావిస్తే, అందుకు కేవలం ఒక్క సర్వ్‌ కోసం 8,80,000 జపనీస్ యెన్‌లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ విలువను అమెరికన్‌ డాలర్లలో చెప్పుకుంటే 6,380 డాలర్లు, ఇండియన్‌ రూపాయిల్లో చెప్పుకుంటే దాదాపు రూ. 5.30 లక్షలు అవుతుంది. ఆ డబ్బును ఒక బ్రాండ్‌ న్యూ కార్‌ కోసం ఖర్చు పెడితే, మారుతి సుజుకి ఆల్టో కొత్త మోడల్‌ వచ్చి ఇంటి ముందు నిల్చుంటుంది.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, సెల్లాటో ఐస్ క్రీం విపరీతమైన ధరకు కారణం దాని తయారీలో ఉపయోగించే పదార్థాలే. ఇటలీలోని ఆల్బాలో పెరిగిన తెల్లటి ట్రఫుల్స్‌ను (white truffles) దీనిని తయారు చేయడానికి ఉపయోగించారు. దీని కిలో ధర 2 మిలియన్ జపనీస్ యెన్‌లు. అంటే, కిలో సుమారు 14,500 అమెరికన్‌ డాలర్లు లేదా దాదాపు 12 లక్షల రూపాయలు. ఇది కాకుండా, సెల్లాటో ఐస్ క్రీమ్‌ తయారీలో పార్మిజియానో ​రెజియానో మరియు సెక్ లీక్స్ వంటి అరుదైన ఆహార పదార్థాలను కూడా ఉపయోగిస్తారు. 

అత్యంత ఖరీదైన ఐస్ క్రీం పేరు ఇదేతాము ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ని తయారు చేయడానికి ప్రయత్నించలేదని, ఐరోపా & జపాన్‌కు చెందిన సంప్రదాయ & అరుదైన ఆహార పదార్థాలను ఒకే ఐస్‌ క్రీమ్‌లో కలపడానికి ప్రయత్నించానని సెల్లాటో కంపెనీ వెల్లడించింది. ఇందుకోసం ఒసాకా నగరంలోని రివీ (RiVi) అనే రెస్టారెంట్ హెడ్ చెఫ్ తడయోషి యమదా (Tadashodi Yamada) సాయాన్ని ఆ కంపెనీ తీసుకుంది. సెల్లాటో, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఐస్‌క్రీమ్‌కు బైకుయా (Byakuya) అని పేరు పెట్టింది. జపనీస్‌లో ఈ పేరుకు తెల్లని రాత్రి (white night) అని అర్ధం.

ఈ ఐస్ క్రీమ్‌ పైన తినదగిన బంగారు ఆకు, రెండు రకాల చీజ్‌లు, సాకేకాసు అనే పేస్ట్ లాంటి పదార్ధాన్ని ఉంచుతారు. దీనిని పర్‌ఫెక్ట్‌గా తయారు చేయడానికి తమకు ఏడాదిన్నర సమయం పట్టిందని సెల్లాటో ప్రతినిధి చెప్పారు. చాలా ట్రయల్స్‌ వేసి, లోపాలను సవరించి, ఫైనల్‌గా సరైన రుచిని సాధించామని వెల్లడించారు.