Telangana Budget Allocation To Agriculture: ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2,91,159 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను (Telangana Budget 2024-25) డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వ్యవసాయ, సాగునీటి పారుదల రంగాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవ'సాయమే' ప్రాధాన్యంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పలు కీలక ప్రకటనలు చేశారు. వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.72.659 కోట్లు.. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లు కేటాయించారు. అలాగే ఉద్యానవనం రూ.737 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,980 కోట్లు ప్రతిపాదించారు.
'రైతులకు రూ.500 బోనస్'
రాష్ట్రంలో అన్నదాతలకు మేలు చేకూర్చేలా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. సన్నరకం వరిసాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిందని.. అవి పండించిన రైతులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగి అన్నదాతలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. 'రూ.2 లక్షల రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తాం. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు అవసరమైన సాయం చేస్తాం. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగానే వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తున్నాం.' అని భట్టి పేర్కొన్నారు.
రైతు కూలీలకు రూ.12 వేలు..
రాష్ట్రంలో భూమి లేని గ్రామీణులు ఎక్కువగా రైతు కూలీలుగా జీవనం సాగిస్తున్నారని.. అలాంటి వారు పని లేని సమయంలో ఇబ్బందులు పడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు కూలీల జీవనంలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఏడాది నుంచే ఈ ఆర్థిక సాయాన్ని వారికి అందిస్తామని స్పష్టం చేశారు. 'ఇప్పటివరకూ రూ.లక్ష వరకూ రుణం ఉన్న 11.34 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరోబతున్నాం.' అని భట్టి పేర్కొన్నారు.