కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ... బడ్జెట్‌ 2022ను కొత్త అవకాశాలతో నిండి ఉందని కితాబు ఇచ్చారు. 


ఈ బడ్జెట్ మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరింత వృద్ధి ,మరిన్ని ఉద్యోగాలకు అవకాశం ఇవ్వబోతోంది. 


దేశంలో తొలిసారిగా పర్వతమాల వంటి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. దీని వల్ల హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము అండ్‌ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి. పర్వతప్రాంతాల్లో ఆధునిక ట్రాన్స్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 






వందేళ్ల భయంకరమైన ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకునేందుకు సానుకూల దృక్పథాన్ని ఇస్తోందీ బడ్జెట్‌ అన్నారు ప్రధానమంత్రి. సామాన్యుడికి చాలా గొప్ప అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. 






ఈ బడ్జెట్‌లో పేదల సంక్షేమం కోసం ప్రధాన ప్రాధాన్యత ఇచ్చాం. పేదలకు పక్కా ఇళ్లు, నల్లా నీళ్లు, మరుగుదొడ్లు, గ్యాస్ కెనక్షన్ ఇవ్వడానికి ఈ బడ్జెట్‌లో తగిన ప్రయారిటీ ఇచ్చాం. - నరేంద్రమోదీ, ప్రధానమంత్రి 


గంగా ప్రక్షాళన, రైతుల సంక్షేమం కోసం ముఖ్యమైన చర్య తీసుకున్నాం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా తీరం వెంబడి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. - నరేంద్రమోదీ, ప్రధానమంత్రి






క్రెడిట్ గ్యారెంటీలో రికార్డు పెంపుదలతోపాటు ఇతర పథకాలు కూడా ప్రకటించామన్నారు ప్రధాని. డిఫెన్స్ క్యాపిటల్ బడ్జెట్‌లో 68శాతం దేశీయ పరిశ్రమలకు కేటాయించడం వల్ల ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ప్రయోజనం కలగనుందని పేర్కొన్నారు. 


పీపుల్‌ ఫ్రెండ్లీ అండ్‌ ప్రగతిశీలక బడ్జెట్ సభ ముందుకు తీసుకొచ్చిన ఆర్థికమంత్రి సీతారామన్‌, ఆర్థికమంత్రిత్వ శాఖ బృందానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.