Budget session 2026: గత 5 ఏళ్లలో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి? కేంద్ర మంత్రి లెక్కలకు మైండ్ బ్లాక్
Union Budget 2026 | ఇద్దరు ఎంపీలు ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్ని లెక్కలు బయటపెట్టారు.

న్యూఢిల్లీ: లోక్‌సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా, ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై ఇటీవల పెద్ద ప్రశ్నలు తలెత్తాయి. బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మహమ్మద్ జావేద్, రాజస్థాన్‌కు చెందిన ఎంపీ భజన్ లాల్ జాతవ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రభుత్వ పాఠశాలలపై ప్రశ్నించారు, 'గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మూసివేశారు. లేదా రద్దు చేశారు ? రాష్ట్రాల వారీగా, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి? ఈ పాఠశాలలను మూసివేయడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. ఆ ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం వల్ల ఎంతమంది పిల్లలు చదువు మానేశారని లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు.
ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం వల్ల పేద, గ్రామీణ ప్రాంతాల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని, వారిపై చెడు ప్రభావం పడుతోందని ఇద్దరు ఎంపీలు ఎంపీ డాక్టర్ మహమ్మద్ జావేద్, ఎంపీ భజన్ లాల్ జాతవ్ అన్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వాలని, ఈ దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించాలని వారు కోరారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి వివరణ
కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విద్య భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉందన్నారు. అంటే పాఠశాలలను తెరవడం, మూసివేయడం లేదా వాటిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన పరిధిలో ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇందులో నిర్ణయం తీసుకోదని తెలిపారు. ఉచిత, నిర్బంధ బాలల విద్య హక్కు చట్టం 2009 (RTE చట్టం) ప్రకారం, ప్రతి చిన్నారికి వారి ఇంటి సమీపంలో ప్రాథమిక విద్య (1 నుండి 5 తరగతి వరకు) అందించడం అవసరమని ఆయన వివరించారు. RTE సెక్షన్ 6 ప్రకారం, అన్ని రాష్ట్రాలు తమ పరిసరాల్లోని పాఠశాలల దూరం, ప్రమాణాలను నిర్ణయించాయి. సెక్షన్ 8 ప్రకారం, ప్రతి బిడ్డకు ఉచిత, నిర్బంధ విద్యను అందించడం, పాఠశాలను కలిగి ఉండటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన గణాంకాలు
ప్రభుత్వ పాఠశాలలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, ఈ దిశగా చాలా పని జరిగిందని విద్యా మంత్రి అన్నారు. ఆయన UDISE+ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) గణాంకాలను ఉదహరించారు. UDISE+ అనేది పాఠశాల విద్య గణాంకాలను సేకరించే వ్యవస్థ. దీని ప్రకారం దేశంలో పాఠశాలలకు సౌకర్యాలు మెరుగవుతున్నాయి. దీనిని గ్రాస్ యాక్సెస్ రేషియో (GAR)తో కొలుస్తారు. GAR అంటే ఒక ప్రాంతంలో నిర్ణీత ప్రమాణాల ప్రకారం పాఠశాలలు అందుబాటులో ఉన్న గ్రామాలు లేదా నివాసాల శాతం.
పాఠశాలల గణాంకాలు ఇవే
- ప్రాథమిక స్థాయి (1-5 తరగతులు): 2018-19లో 97.15% ఉండగా, 2024-25 నాటికి 97.83%కి పెరిగింది.
- అప్పర్ ప్రైమరీ స్థాయి (6-8 తరగతులు): 2018-19లో 96.49 శాతం ఉండగా, 2024-25లో 96.57%కి పెరిగింది.
- సెకండరీ స్థాయి (9-10 తరగతులు): 2018-19లో 88.24 శాతం ఉండగా, 2024-25 నాటికి 95.35 శాతానికి పెరిగింది.
- హయ్యర్ సెకండరీ స్థాయి (11-12 తరగతులు): 2018-19లో 65.05 శాతం ఉండగా, 2024-25 నాటికి 94.97%కి పెరిగింది.
ఈ గణాంకాలు వివిధ స్థాయిల్లో పాఠశాలలకు నిరంతరం మద్దతు లభిస్తోందని, సౌకర్యాలు మెరుగవుతున్నాయని చూపిస్తున్నాయి. అదే సమయంలో, డ్రాపౌట్ రేటు (విద్యార్థులు పాఠశాల మానేసే రేటు) కూడా తగ్గింది.
పిల్లల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు
RTE చట్టం నిబంధనలను అనుసరించి మాత్రమే ఏదైనా పాఠశాలను మూసివేయవచ్చు లేదా విలీనం చేయవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఏదైనా పాఠశాలను మూసివేస్తే, పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా, వారిని సమీపంలోని ఇతర పాఠశాలకు పంపేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా యోజన కింద రాష్ట్రాలకు సహాయం చేస్తుంది, తద్వారా పాఠశాలలు మెరుగవుతాయి. టీచర్లు అందుబాటులో ఉండి, పిల్లలు పాఠశాలలను మానేయకుండా ఉంటారని పేర్కొన్నారు.























