ఈ ఏడాది విడుదల చేసే ఆర్థిక సర్వే నివేదిక ఒకే వాల్యూమ్‌గా ఉంటుందని సమాచారం. వచ్చే ఆర్థిక ఏడాదికి వృద్ధిరేటును 9 శాతంగా ఈ నివేదిక అంచనా వేసినట్టు తెలుస్తోంది. జనవరి 31న ఆర్థిక సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేయనుంది.
సాధారణంగా ఆర్థిక సర్వే నివేదిక ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) నేతృత్వంలో రూపొందిస్తారు. ఆర్థిక మంత్రి ఆమోదం తర్వాత బడ్జెట్‌కు ముందు రోజు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ప్రధాన ఆర్థిక సలహదారులు లేకపోవడంతో ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్, ఇతర అధికారులు నివేదికను రూపొందిస్తున్నారు.
మూడేళ్ల పదవీకాలం ముగియడంతో కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గతేడాది వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త సీఈఏగా డాక్టర్ అనంత నాగేశ్వరన్‌ను శుక్రవారం నియమించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సీఈఏ పదవి ఖాళీగానే ఉండటం గమనార్హం. అప్పటి సీనియర్ ఎకనామిక్ అడ్వైజర్ ఐలా పట్నాయక్ నేతృత్వంలో రూపొందించిన ఆర్థిక సర్వేను దివంగత అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు.
Also Read: Budget 2022 Traditions: ఈ సారి బడ్జెట్ హల్వా లేదండోయ్! మారుతున్న సంప్రదాయాలు!!
What To Expect In Economic Survey 2022?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ 9.2 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తుందని ఆర్ధిక సర్వే అంచనా వేయనుందని సమాచారం. ఆర్‌బీఐ అంచనా వేసిన 9.5 శాతం కన్నా ఇది కాస్త తక్కువే. 2020-21లో వరుస లాక్‌డౌన్లతో ఎకానమీ 7.3 శాతం వరకు కుంచించుకుపోయింది. ఈ సారి అలాంటి ఆంక్షలు, లాక్‌డౌన్లు లేకపోవడంతో ప్రభావం తక్కువగా ఉండనుంది.
వచ్చే సంవత్సరానికి వృద్ధిరేటును 9 శాతంగా సర్వే అంచనా వేస్తోంది. 2022 మార్చితో ముగిసే ఆర్థిక ఏడాదికి 2020-21 సర్వే ఏకంగా 11 శాతం వృద్ధిరేటును అంచనా వేయడం గమనార్హం. ఆయా రేటింగ్ సంస్థలు వృద్ధిరేటును 8-10 మధ్య ఇస్తుండటం గమనార్హం.