Telangana Union Budget 2023 : ఎన్నికలు ఉన్నా తెలంగాణపై బడ్జెట్ లో వరాలేమీ కురిపించలేదు. కానీ కర్ణాటకకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నిధులు కూడా పెద్ద ఎత్తున కేటాయిస్తుందని అనుకున్నారు. కానీ బడ్దెట్ లో మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. కొన్ని కేంద్ర సంస్థలకు నిధులు కేటయించారు తప్ప.. ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు.
తెలంగాణకు బడ్జెట్‌లో ఏమేమి కేటాయింపులు లభించాయంటే ?
బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిన నిధులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించారు. సింగరేణికి రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్ - 300 కోట్లు, భారజల కర్మాగారాలకు - రూ. 1,473 కోట్లు కేటాయించారు. మొత్తం రెండు కర్మాగారాలకు నిధులు కేటాయించగా ఒకటి ఖమ్మం జిల్లా మణుగూరులో ఉంది. కేటాయిచిన నిధుల్లో సగం ఈ కర్మాగానికి లభించవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు చేశారు. రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు - రూ. 37 కోట్లు కేటాయించారు. వీటిలో సగం తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి లభించవచ్చు. దేశ దేశంలో ఉన్న అన్ని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు - రూ. 6,835 కోట్లు కేటాయించారు. ఈ 22 ఎయిమ్స్ ఆస్పత్రిల్లో ఒకటి తెలంగాణ, మరొకటి ఏపీలో ఉంది. వీటికి కొంత నిధులు లభించే అవకాశం ఉంది. సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియాలకు - రూ. 357 కోట్లు కేటాయించారు.
కర్ణాటకకు ప్రత్యేక నిధుల కేటాయింపు !
త్వరలోనే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో, ఆ రాష్ట్రానికి బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. కర్ణాటకలో వెనుకబడిన, కరవు ప్రాంతాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయాన్ని అందిచనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతోపాటు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5,300 కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. 29.4 టీఎంసీల సామర్థ్యంతో 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీటిని అందించేందుకు అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. కరవు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని కర్ణాటక ఇప్పటికే పేర్కొంది. అయితే జాతీయ ప్రాజెక్టు అయిన ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు పైసా కూడా కేటాయించలేదు. అలాగే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చాలా కాలంగా కోరుతున్నా కేంద్రం పైసా కూడా కేటాయించలేదు.
బీజేపీ నేతలకు ఇబ్బందే !
తెలంగాణను బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అభివృద్ధి పథంలో ఉన్న రాష్ట్రానికి కేటాయింపులు చేసి..దేశ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి కేటీఆర్ పదే పదే కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎన్నికలు ఉన్న కర్ణాటక రాష్ట్రానికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించి.. ఎన్నికలు ఉన్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం ఏమిటని బీజేపీ నేతలపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై బీజేపీ నేతలు ఎదురు దాడి చేయడం మినహా.. సమర్థించుకునే అవకాశాలు దాదాపుగా లేనట్లే.