Budget 2025: విమాన సర్వీసులను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్(Udan) పథకాన్ని మరింత  సవరణలతో  తీసుకొస్తున్నట్లు బడ్జెట్‌ (Budget)ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ తెలిపారు.120 కొత్తప్రదేశాలకు విమాన సర్వీసులు అందించడంతోపాటు 4 కోట్ల మంది కొత్త ప్రయాణికులను  చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఆమె ప్రకటించారు. ఇప్పటి వరకు విమాన కనెక్టివిటీ లేని కొండ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల్లో ఉడాన్ పథకం కింద చిన్నచిన్న విమానాశ్రయాలు, హెలిప్యాడ్‌లు  నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. దీనివల్ల వివిధ ప్రాంతాల మధ్య ఎయిర్ కనెక్టివిటీ పెరగడంతోపాటు సుఖవంతమైన ప్రయాణం చేయవచ్చని వివరించారు.

ఇటీవల విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సైతం అరకు(Araku), పాడేరు (Paderu)ప్రాంతాల్లో చిన్న విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదనలు  పంపినట్లు తెలిపారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో పర్యాటరంగం అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు. అరకు,లంబసింగితోపాటు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే కచ్చితంగా సౌకర్యవంతమైన ప్రయాణమార్గాలు ఉండాలని తెలిపారు. ఇదేవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఆయన సూచనల మేరకే కొండప్రాంతాల్లో  ఉడాన్ పథకం కింద కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చింది. ఇప్పటి వరకు అరకు,పాడేరు అందాలను తిలకించాలంటే విశాఖ వరకు విమానంలో వచ్చినా....అక్కడి నుంచి కచ్చితంగా  రోడ్డుమార్గంలోనే  వెళ్లాల్సిఉంది. ఇప్పుడు  అరకు లేదా పాడేరులో  విమానాశ్రయం కానీ హెలీపాడ్‌ ఏర్పాటు చేస్తే...నేరుగా అక్కడికే  వెళ్లవచ్చు. పర్యాటకం పరంగా ఇది చాలా పెద్దమార్పులు   తీసుకొస్తుందని  అంచనా వేస్తున్నారు.