Budget 2023:


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మరికొన్ని గంటల్లో బడ్జెట్ FY23-24ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో, మార్కెట్‌ కీలకంగా దృష్టి పెట్టే కొన్ని రంగాల గురించి వివిధ బ్రోకరేజ్ సంస్థలు తమ అభిప్రాయాలు పంచుకున్నాయి. బ్రోకరేజ్‌ల ప్రకారం... BFSI, మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, పవర్ సహా 6 సెక్టార్లు లైమ్‌లైట్‌లో ఉంటాయి.


1. BFSI (Banking, Financial Services and Insurance)
"SMEలు, MSMEల రుణాల కోసం ప్రభుత్వ మద్దతు కొనసాగిస్తుందని మేం ఆశిస్తున్నాం. సరసమైన ధరలకు 'హౌసింగ్ ఫర్ ఆల్' దృష్ట్యా, గృహ రుణాలపై ప్రభుత్వం పన్ను ప్రయోజనాలను పెంచే అవకాశం ఉంది. ఆర్థిక వృద్ధికి మరింతగా తోడ్పడేలా బ్యాంకులు & NBFCలతో ఫిన్‌టెక్‌ల లావాదేవీలు పెంచడానికి ప్రభుత్వం ఎక్కువ సహాయాన్ని అందించే అవకాశం ఉంది-" - Axis Securities


2. మౌలిక సదుపాయాలు & బిల్డింగ్‌ మెటీరియల్స్ (Infrastructure & Building Materials)
 "రోడ్లు & నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యకలాపాలపై ఫోకస్‌ కొనసాగుతుంది. సిమెంట్, టైల్స్ వంటి మౌలిక సదుపాయాల కంపెనీలు, ఇతర బిల్డింగ్‌ మెటీరియల్స్ విభాగాలకు ఊతమిస్తుంది, అవి బలమైన పనితీరుతో ముందుకు సాగడానికి వీలు కల్పిస్తుంది. రియల్ ఎస్టేట్ మరొక కీలక రంగం. దీనికి పుష్ అవసరం. అందువల్ల సరసమైన గృహాల విభాగంలో మరిన్ని ప్రభుత్వ పథకాలు రావచ్చు" - Axis Securities


3. వాహన రంగం (Automotive)
"గ్రీన్ మొబిలిటీ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయాల జోరు కొనసాగిస్తుందని మేం ఆశిస్తున్నాము. ఇది ఆటో రంగానికి మద్దతు ఇస్తుంది. యావద్దేశం విద్యుత్‌ వాహనాలకు వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ ప్లాట్‌ఫామ్‌లను మరింతగా అభివృద్ధి చేయడానికి, మెరుగుపరచడానికి OEMలు భారీ పెట్టుబడులు పెట్టవచ్చని భావిస్తున్నాం. ఈ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడి ఉంది. అందువల్ల, ఖర్చు చేయగల శక్తిని గ్రామీణ కుటుంబాల్లో  పెంచడం, మౌలిక సదుపాయాల పథకాలు బడ్జెట్‌లో కీలక హైలైట్‌గా ఉంటాయి" - William O'Neil


4. విద్యుత్‌ రంగం (Power)
 "మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి, విద్యుత్‌ నిల్వ వ్యవస్థల్లో (ESS) పునరుత్పాదక ఇంధనం వాటా పెరుగుతున్న నేపథ్యంలో, గ్రిడ్ స్థిరత్వాన్ని పెంపొందించడం ఈ బడ్జెట్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, గ్రిడ్ స్థాయి బ్యాటరీ నిల్వ సౌకర్యాల తయారీని ప్రోత్సహించడానికి కొన్ని PLI పథకాలను విద్యుత్‌ పరిశ్రమ ఆశిస్తోంది. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడానికి బడ్జెట్‌లో అధిక కేటాయింపులను మార్కెట్‌ ఆశిస్తోంది" - William O'Neil


5. ఉక్కు రంగం (Steel)
 "పెరుగుతున్న మూలధన వ్యయమే (క్యాపెక్స్) ఉక్కు పరిశ్రమ డిమాండ్‌కు డ్రైవర్. గత మూడు సంవత్సరాలుగా, ప్రభుత్వ క్యాపెక్స్ 30% CAGR వద్ద పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇదే ఊపును కొనసాగించాలి, మొత్తం మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచాలని మేం కోరుకుంటున్నాం. ప్రస్తుత ప్రపంచ మందగమనం ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం అందించే ప్రోత్సాహం ఈ పరిశ్రమకు ధైర్యాన్ని ఇస్తుంది. ఉక్కు పరిశ్రమ PLI స్కీమ్‌కు బడ్జెట్ నుంచి ఎక్కువ కేటాయింపులను కూడా మేం ఆశిస్తున్నాం" -  William O'Neil


6. వ్యవసాయం & రసాయన రంగం (Agri & Chemical)
"2023లో జరగబోయే కొన్ని రాష్ట్ర ఎన్నికలతో పాటు గ్రామీణ భారతదేశంపై ఫోకస్‌తో, వ్యవసాయ సబ్సిడీలకు కేటాయింపుల పెంపును ఈ బడ్జెట్‌ నుంచి ఆశిస్తున్నాం. ప్రస్తుత రబీ సీజన్‌ కోసం అధిక సబ్సిడీలను ప్రభుత్వం అందించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార సరఫరా పరిస్థితి దిగజారుతున్నందున, భారతదేశంలో వ్యవసాయ సబ్సిడీలకు కేటాయింపులు కొనసాగుతాయని ఆశిస్తున్నాం. వ్యవసాయ ఉత్పాదకత, పంటల రక్షణ పథకాలను పెంచడంతో పాటు, వ్యవసాయ రసాయనాలు & ఎరువుల కంపెనీలకు సహాయపడేలా బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం మద్దతునిస్తుందని భావిస్తున్నాం" - Axis Securities