ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లెరీ FSSAI నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, వారికి నోటీసులు జారీ అయ్యాయని జరుగుతున్న ప్రచారంపై Bisleri స్పందించింది. క్వాలిటీ టెస్టులు ఫెయిల్ అయ్యాయన్న వార్తలపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాము ఏ తప్పు చేయలేదని, ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం దాదాపు 14 నెలల క్రితం నాటిదని కంపెనీ స్పష్టం చేసింది. బిస్లెరీ వాటర్ శాంపిల్ పరీక్షల్లో రెండుసార్లు విఫలం కావడంతో, ప్రభుత్వ సంస్థ FSSAI దీనిపై కేసు నమోదు చేసేందుకు అనుమతించింది.  

Continues below advertisement

తాజాగా సోమవారం బిస్లెరీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసు 14 నెలల కిందటి నాటిదని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ 30న FSSAI బృందం గోవా ప్లాంట్‌ నుంచి మొత్తం 6 శాంపిల్స్ సేకరించిందని, వాటిలో 5 నమూనాలు అన్ని నాణ్యతా ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. కేవలం ఆరో నమూనా ప్రాథమిక పరీక్షలో మాత్రమే బ్రోమేట్ (Bromate) స్థాయి లీటరుకు 12 మైక్రోగ్రాములుగా గుర్తించారు. ఇది లీటరుకు 10 మైక్రోగ్రాముల నిర్దేశిత పరిమితి కంటే కొద్దిగా ఎక్కువని బిస్లెరీ వివరించింది.

కంపెనీ తన వివరణలో ఏం చెప్పిందంటే.. 

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 2025లో అప్పీల్ చేసిన తర్వాత శాంపిల్ రిఫరల్ ల్యాబ్‌కు పంపగా, అందులో బ్రోమేట్ నిర్దేశిత పరిమితిలోనే ఉన్నట్లు తేలింది. కానీ పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు నివేదికలో వచ్చింది. ఈ రెండు నివేదికలలో వైరుధ్యాలను గమనించిన బిస్లెరీ, FSSAI గుర్తింపు పొందిన ఒక ఇండిపెండెంట్ ల్యాబ్‌లో అదే బ్యాచ్‌ను మళ్లీ పరీక్షించగా, అందులో నీరు అన్ని భద్రతా ప్రమాణాలకు తగ్గట్లుగా ఉన్నాయని, పూర్తి సురక్షితమని తేలింది. 

2 ల్యాబ్ నివేదికలలో వ్యాత్యాసాన్ని గమనించిన తర్వాత, కంపెనీ FSSAI గుర్తింపు పొందిన ఒక బయటి ల్యాబ్‌కు గోవా ఫ్యాక్టరీలో తయారైన అదే తేదీ అదే లాట్‌కు చెందిన నీటి నమూనాను మళ్లీ పరీక్ష కోసం పంపింది. అందులో నీరు ప్రతి శాంపిల్ ప్రమాణంలోనూ పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. బిస్లెరీ కంపెనీ స్పందిస్తూ, తాగునీటి భద్రతే మా మొదటి ప్రాధాన్యత.. నాణ్యతపై మేం ఎల్లప్పుడూ కఠినమైన నిఘా ఉంచుతామని.. తగిన నియంత్రణ ప్రక్రియ ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి FSSAI తో మా సహకారం కొనసాగుతుందని పేర్కొంది.

అసలు ఏం జరిగింది?

గోవా ప్లాంట్ వ్యవహారంలో దాదాపు 9 నెలల పాటు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత, 22 నవంబర్ 2026 FSSAI ఒక ప్రకటన చేసింది. 2 వేర్వేరు ల్యాబ్ పరీక్షలలో నమూనా విఫలమైనందున బిస్లెరీపై కోర్టులో కేసు నమోదు చేసేందుకు తమ తరఫున అనుమతి మంజూరు చేసినట్లు తెలిపింది.