మనం బయటకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు సురక్షితం అని భావించి కొనుగోలు చేసే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్లలో బిస్లెరీ ఒకటి. కానీ బిస్లెరీ ఇంటర్నేషనల్‌కు చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సురక్షితం కాదని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI కీలక ప్రకటన చేసింది. బిస్లెరీ వాటర్ లో నిర్ణీత పరిమితికి మించి బ్రోమేట్ ఉన్నట్లు నాణ్యతా పరీక్షల్లో గుర్తించారు. దీంతో ఆ బిస్లెరీ ప్రొడక్ట్ నమూనాను నిబంధనలు పాటించని, త్రాగడానికి సురక్షితం ప్రొడక్ట్ గా ప్రకటించారు.

Continues below advertisement

Bisleri కంపెనీ అప్పీల్ చేసిన తర్వాత మరోసారి రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీలో పరీక్షించారు. అక్కడ కూడా బ్రోమేట్ పరిమితికి మించినట్లు గుర్తించడంతో పాటు పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనే రసాయనాలు సైతం ఉన్నాయని గుర్తించినట్లు FSSAI వెల్లడించింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం కింద విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. 

బిస్లెరీతో పాటు మరో నాలుగు సంస్థలపై చర్యలు

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిస్లెరీతో పాటు టిట్-బిట్, వసంత్ మసాలా, ఫుడ్స్ ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు, పరిమితికి మించిన లోహాలు ఉన్నాయని గుర్తించారు. మిమన్సా ఇండస్ట్రీస్‌కు చెందిన వాల్‌నట్స్, ఆశా కన్ఫెక్షనరీకి చెందిన చాక్లెట్ కుకీస్‌పైనా నాణ్యత, భద్రతకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. మరో 2 సంస్థల లైసెన్సులను కూడా అధికారులు సస్పెండ్ చేశారు.

ఆదివారం సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌లో, కంపెనీ నుంచి సేకరించిన నమూనా నిర్దేశిత బ్రోమేట్ పరిమితులకు మించి ఉందని, ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం ఇది సురక్షితం కాదని ప్రకటించినట్లు ఫుడ్ రెగ్యులేటర్ తెలిపింది. ఈ నమూనాను మినరల్ వాటర్ కాకుండా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌గా పేర్కొన్నారు. ప్రాథమిక నివేదికలను బిస్లెరీ కంపెనీ సవాలు చేసిన తర్వాత దీనిని తదుపరి పరీక్షల కోసం పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ బ్రోమేట్ పరిమితికి మించి ఉందని, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనే రసాయనాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 

ఆహార వ్యాపారాలపై FSSAI తనిఖీలు ముమ్మరం

ఆహార వ్యాపార నిర్వాహకులు, ఈ-కామర్స్ కంపెనీలపై FSSAI చేపట్టిన విస్తృత తనిఖీల నేపథ్యంలో బిస్లెరీ (Bisleri) పై ఈ చర్య తీసుకుంది. తమ తనిఖీలలో భాగంగా ఎనర్జీ డ్రింక్స్,  మద్య పానీయాల తయారీదారులపై కూడా రెగ్యులేటర్ చర్యలు తీసుకుంది.