BharatPe CEO Resigns: ప్రారంభమైన నాటి నుంచి ఏదోక వివాదంతో వార్తల్లో హెడ్‌లైన్‌గా మారుతున్న భారత్‌పే (BharatPe), మరోమారు వార్తల్లోకి ఎక్కింది. భారత్‌పే సీఈవో సుహైల్ సమీర్ తన పదవికి రాజీనామా చేశారు. సమీర్‌ జనవరి 7 నుంచి CEO కుర్చీ దిగిపోయి, అదే రోజు నుంచి వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరిస్తారని BharatPe ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నలిన్ నేగీని (CFO Nalin Negi) కంపెనీ తాత్కాలిక CEOగా నియమించారు.


కంపెనీ వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు భాగస్వాములందరి అంగీకారంతో తాత్కాలిక సీఈవోగా నలిన్ నేగికి బాధ్యతలు అప్పగించినట్లు అధికారిక ప్రకటనలో భారత్‌పే పేర్కొంది.


కంపెనీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌తో (Ashneer Grover) సమీర్‌ సుహైల్‌కు గతంలో వివాదం ఉంది. అష్నీర్ గ్రోవర్‌ ప్రస్తుతం కంపెనీలో లేనప్పటికీ, వివాదం నేపథ్యంలో, సుహైల్ సమీర్ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.


ఫిన్‌టెక్‌ విభాగంలో భారత్‌పేను భారతదేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిపినందుకు, అనేక సవాళ్లను అధిగమించినందుకు సుహైల్ సమీర్‌కు బోర్డు తరపున భారత్‌పే చైర్మన్ రజనీష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. భారత్‌పేను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే నాయకుడిని వెదకడానికి ఇప్పుడు సమయం, వనరులను వెచ్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొత్త CEO కోసం భారత్‌పే బోర్డు అన్వేషణ కూడా మొదలు పెట్టింది.


వరుస వివాదాల్లో కంపెనీ
భారత్‌పే వయస్సు కేవలం నాలుగు సంవత్సరాలు. 2022 ప్రారంభమైంది. ఆది నుంచీ వివాదాల్లో చిక్కుకుంది. Nykaa IPO నిధులను తిరిగి పొందడంలో తాను & తన భార్య మాధురీ జైన్ గ్రోవర్ విఫలం కావడంతో, కోటక్‌ గ్రూప్‌ ఉద్యోగిని అనుచిత పదజాలం ఉపయోగించి అష్నీర్ గ్రోవర్‌ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి, ఆ సంఘటన తీవ్ర వివాదాస్పదమైంది. దీని తరువాత, నిధుల దుర్వినియోగం ఆరోపణల మీద అష్నీర్ గ్రోవర్‌ను, ఆయన భార్య మాధురి జైన్ గ్రోవర్‌ను కంపెనీ నుంచి బయటకు పంపేశారు.


కంపెనీని విడిచిపెట్టిన సీనియర్‌ అధికారులు
అష్నీర్ గ్రోవర్‌ దంపతులను కంపెనీ నుంచి బయటకు పంపిన కొన్ని రోజులకే, మరో సహ వ్యవస్థాపకుడు భవీక్‌ కొలాడియా సైతం నిష్క్రమించారు. ఆ తర్వాత కూడా కొందరు ఉన్నత స్థాయి అధికారులు సైతం కంపెనీని గుడ్‌ బై చెప్పారు. మొత్తంగా చూస్తే, BharatPe నుంచి నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వేర్వేరు కారణాల వల్ల 2022 ప్రారంభం నుంచి కంపెనీని విడిచిపెట్టారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విజయ్ అగర్వాల్, లోన్లు & వినియోగదారు ఉత్పత్తుల విభాగం చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రజత్ జైన్, కన్స్యూమర్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ పోస్ట్‌పే చీఫ్ నేహుల్ మల్హోత్రా ఈ లిస్ట్‌లో ఉన్నారు. గీతాన్షు సింగ్లా కూడా పదవి నుంచి తప్పుకున్నారు.


అష్నీర్‌తో వివాదం ఏంటి?
కొన్ని విషయాల మీద 2022 ఫిబ్రవరిలో అష్నీర్ గ్రోవర్, సుహైల్ సమీర్‌ మధ్య వివాదం జరిగింది. సుహైల్ సమీర్‌ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ BharatPe సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కంపెనీ బోర్డుకు లేఖ రాశారు. అయితే, సుహైల్ సమీర్‌ను తొలగించేందుకు బోర్డు నిరాకరించింది. ఆ తర్వాత, గ్రోవర్‌ మీద వచ్చిన ఆరోపణలపై అతన్ని సెలవుపై పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రోవర్‌ భారత్‌పేను విడిచిపెట్టారు.