Bernard Arnault Company: ట్విట్టర్‌ సీఈవో ఎలాన్ మస్క్‌ను (Elon Musk) దాటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి కిరీటం గెలుచుకున్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) పేరు మీరు వినే ఉంటారు. అయితే, ఆయన చేసే వ్యాపారం, ఆయన కంపెనీ గురించి మీకు తెలియకపోవచ్చు. ప్రపంచ కుబేరుడి కంపెనీ రూపొందించే ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో చాలా ప్రజాదరణ ఉంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. సంపన్నులను దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీ లగ్జరీ వస్తువులను తయారు చేస్తుంది. అది.. ఫ్రెంచ్ ఫ్యాషన్ కంపెనీ 'లూయిస్‌ విటన్‌ మోయెట్‌ హెన్నెస్సీ' ‍(LVMH). ఐరోపాలో అతి పెద్ద సంస్థ ఇది. 'లూయిస్‌ విటన్‌ మోయెట్‌ హెన్నెస్సీ'గా కంటే 'LVMH'గానే ఈ కంపెనీ సుపరిచితం.


యూరప్‌లో మొట్టమొదటి కంపెనీ             
బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ LVMH.. లూయిస్ విట్టన్ ‍‌(Louis Vuitton), డియోర్ (Dior) వంటి లగ్జరీ బ్రాండ్‌లను ఉత్పత్తి చేస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, LVMH విలాసవంతమైన ఉత్పత్తులు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. దీని వల్ల కంపెనీ అనూహ్యమైన లబ్ది పొందుతోంది, ఆదాయం భారీగా పెరిగింది. దీంతో, ఈ కంపెనీ విలువ తొలిసారిగా  500 బిలియన్‌ డాలర్లు దాటింది. ఐరోపాలో, 500 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువైన మొట్టమొదటి కంపెనీ ఇదే. LVMH లగ్జరీ ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, యూరో విలువ బలోపేతం కావడం ఈ కంపెనీ విలువ వృద్ధికి సాయపడింది.


బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల విలువ            
LVMH తాజాగా మరో రికార్డ్‌ కూడా సాధించింది. రెండు వారాల క్రితమే, ప్రపంచంలోని 10 అత్యంత విలువైన కంపెనీల జాబితాలో చోటు సంపాదించింది. కంపెనీ విలువలో విపరీతమైన పెరుగుదల కారణంగా, కంపెనీ ఓనర్‌ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి హోదాలో కొనసాగుతున్నారు. బెర్నార్డ్ ఆస్తుల నికర విలువ ‍‌(Bernard Arnault Networth) నిరంతరం పెరుగుతోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆర్నాల్ట్ ప్రస్తుత నికర విలువ దాదాపు 212 బిలియన్‌ డాలర్లు.


పారిస్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత, LVMH స్టాక్ 0.3 శాతం పెరిగి కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో కంపెనీ విలువ 500 బిలియన్ డాలర్లు దాటింది. ఫ్రాన్స్, యూరప్ స్టాక్ మార్కెట్‌లలో, అమెరికన్ స్టాక్ మార్కెట్‌లలో అగ్ర టెక్ కంపెనీల్లో ఒకటిగా LVMH వెలిగిపోతోంది.


డాలర్‌ బలహీనపడడం కూడా కలిసొచ్చింది          
LVMH కూడా లగ్జరీ ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదలతో పాటు డాలర్‌తో పోలిస్తే యూరో బలపడటం వల్ల కూడా ఈ కంపెనీ లాభపడుతోంది. యూరోపియన్ యూనియన్ కరెన్సీ అయిన యూరో, డాలర్‌తో పోలిస్తే, ఈ నెలలో దశాబ్ద కాలంలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, US సెంట్రల్ బ్యాంక్ (UD FED) వడ్డీ రేట్ల తగ్గింపు భయాల కారణంగా డాలర్ బలహీనపడుతోంది.