Arun Ice Creams sets Guinness World Record: ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ అరుణ్ ఐస్‌క్రీమ్స్ హైదరాబాద్ వేదికగా అరుదైన అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకుంది. నగరంలోని ఒకే వేదికపై 5,113 మంది పిల్లలను సమీకరించి, ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ సోషల్ పార్టీని నిర్వహించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకుంది. చిన్నపిల్లల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ కార్యక్రమం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ చారిత్రాత్మక రికార్డు కోసం ఎంపిక చేసిన 5,100 మందికి పైగా బాలబాలికలు ఏకకాలంలో 30 నిమిషాల పాటు నిరంతరాయంగా ఐస్‌క్రీమ్ ఆస్వాదించారు. రియల్ మిల్క్ , క్రీమ్‌తో తయారైన బ్లాక్‌కరెంట్, స్ట్రాబెర్రీ బార్లు, కారామెల్ సాండ్‌విచ్ వంటి వైవిధ్యమైన ఫ్లేవర్లను పిల్లలకు అందించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల సమక్షంలో నిబంధనల ప్రకారం సాగిన ఈ విందు, అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డుకు నాంది పలికింది.
గతంలో ఈ రికార్డ్ ఇటలీ పేరిట ఉండేది. 2019లో ఇటలీలోని సలెర్నో నగరంలో యూనిలీవర్ సంస్థ 962 మందితో నిర్వహించిన ఐస్‌క్రీమ్ పార్టీయే ఇప్పటివరకు అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. తాజాగా అరుణ్ ఐస్‌క్రీమ్స్ ఆ సంఖ్యను ఐదు రెట్లు అధికంగా 5,113 మందితో అధిగమించి, ఇటలీ రికార్డును తుడిచిపెట్టేసింది. నాణ్యతతో కూడిన ఆనందాన్ని పంచడమే తమ లక్ష్యమని, ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని హాట్సన్ అగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్ చైర్మన్ ఆర్.జి. చంద్ర మోగన్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ భారీ ఈవెంట్ నిర్వహణ కోసం అరుణ్ ఐస్‌క్రీమ్స్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వేలాది మంది పిల్లలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణంలో ఈ సామాజిక విందును పూర్తి చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతీయ బ్రాండ్ ఇటువంటి మైలురాయిని అందుకోవడం పట్ల టెక్ నగరం హైదరాబాద్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐస్‌క్రీమ్ ప్రియులకు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
