Apple IPhones Manufacturing In India: ఆపిల్ ఐఫోన్‌ల తయారీలో భారతదేశ వాటా ఏటికేడు పెరుగుతోంది, ఆపిల్‌కు గ్లోబల్ హబ్‌గా రూపాంతరం చెందేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆపిల్ ఇంక్ (Apple Inc.), గత 12 నెలల్లో భారతదేశంలో 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను తయారు చేసింది. ఇది, అంతకుముందు సంవత్సరం కంటే దాదాపు 60 శాతం ఎక్కువ. సమాచారం ప్రకారం, ప్రస్తుతం, మొత్తం ఐఫోన్ల తయారీలో 20 శాతం ఈ దక్షిణాసియా దేశంలోనే (భారత్) తయారవుతున్నాయి. అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజల చేతుల్లో ఉన్న ప్రతి ఐదు ఐఫోన్లలో ఒకటి భారత్‌లో అసెంబుల్ అయినదే, "మేడ్ ఇన్ ఇండియా" లేబుల్‌తో ఉన్నదే.
చైనా నుంచి భారత్‌కు షిఫ్ట్ అవుతున్న ఆపిల్‌ఈ గణాంకాలను బట్టి, ఆపిల్ & ఆపిల్ సరఫరాదారులు ఇప్పుడు చైనా నుంచి భారతదేశానికి తరలి వస్తున్నారని తెలుస్తోంది. పెరుగుతున్న వాణిజ్య యుద్ధ ముప్పు మధ్య, ఆపిల్ తన తయారీ యూనిట్‌ను చైనా వెలుపల ఏర్పాటు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. కొవిడ్ సమయంలో, "చైనా ప్లస్ వ్యూహం" (China Plus Strategy) అనుసరించిన గ్లోబ కంపెనీల్లో ఆపిల్ కూడా ఉంది. ఇప్పుడు, యూఎస్-చైనా మధ్య వాణిజ్య యుద్ధం (US-China trade war) విషయంలోనూ ఆ వ్యూహం పని చేస్తోంది. ఎందుకంటే, చైనాపై అమెరికా ప్రతీకార సుంకం (Reciprocal tariff) 145 శాతం అమల్లో ఉంది. ఇదే సుంకం భారత్ మీద 26 శాతంగా ఉంది, దీనికి కూడా ఇప్పుడు 90 రోజుల విరామం ఉంది, ప్రస్తుతం 10 బేస్‌లైన్ టారిఫ్ మాత్రమే అమలవుతోంది. ట్రంప్ టారిఫ్ (Trump Tariff) విధానం కారణంగా, భారతదేశం నుంచి అమెరికాకు ఐఫోన్ల రవాణా పెరిగింది. మనకు ఉన్న సమచారం ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల పెంపు ప్రకటనకు ముందే, భారత్‌లోని తన గిడ్డంగులను ఆపిల్ దాదాపుగా ఖాళీ చేసింది. నిల్వ కేంద్రాల్లో ఉన్న మొత్తం ఉత్పత్తులను యూఎస్‌కు చేరవేసింది. కేవలం మూడు రోజుల్లోనే (మార్చిలో).. ఐఫోన్లు, ఐపాడ్‌లు సహా ఇతర ఆపిల్ ప్రొడక్ట్స్‌తో నింపిన ఐదు రవాణా విమానాలను ఆపిల్ అమెరికాకు పంపిందని సమాచారం.
1.5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఐఫోన్లు ఎగుమతిభారతదేశంలో తయారయ్యే చాలా ఐఫోన్‌లను దక్షిణ భారతదేశంలోని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేస్తారు. భారతదేశంలో ఆపిల్ ప్రధాన సరఫరాదారులు ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్. 2025 మార్చి వరకు ఆపిల్ దక్షిణ భారతదేశం నుంచి 1.5 లక్షల కోట్ల రూపాయల (17.4 బిలియన్ డాలర్లు) విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసిందని, భారతదేశంలో మొత్తం ఉత్పత్తి పెరిగిందని కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి ఏప్రిల్ 8న తెలిపారు.
ఆపిల్, ఇప్పుడు టైటానియం ప్రో మోడళ్లు సహా తన మొత్తం ఐఫోన్‌లను భారతదేశంలో అసెంబుల్ చేస్తోంది. భారతదేశంలో ఆపిల్ ఐఫోన్‌లను తయారు చేసే ఫాక్స్‌కాన్, డిక్సన్ టెక్నాలజీస్ కేంద్ర ప్రభుత్వ PLI (ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్) స్కీమ్ కింద సబ్సిడీలు పొందాయి. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి & విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో ఈ పథకాన్ని అమలు చేస్తోంది.