America Is Indias Top Trading Partner In FY25: గత ఆర్థిక సంవత్సరం 2024-25లో అమెరికా భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. వాస్తవానికి, భారతదేశానికి అతి పెద్ద ట్రేడింగ్‌ పార్ట్‌నర్‌గా US నిలవడం ఇది వరుసగా నాలుగో సంవత్సరం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ (India-US bilateral trade value) 131.84 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని భారత ప్రభుత్వ డేటా చూపించింది. భారత్‌కు రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వాముల లిస్ట్‌లో, మన పొరుగు దేశం చైనా రెండో స్థానంలో ‍‌(China is India's second largest trading partner) ఉంది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో (FY25), చైనాతో భారతదేశ వాణిజ్య లోటు 99.2 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.   

అమెరికాతో వాణిజ్య మిగులు2024-25 ఆర్థిక సంవత్సరంలో, అమెరికాకు భారతదేశం ఎగుమతులు 11.6 శాతం పెరిగి 86.51 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి, 2023-24లో ఈ విలువ 77.52 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అదే సమయంలో, అమెరికా నుంచి మన దిగుమతులు 2024-25లో 7.44 శాతం పెరిగి 45.33 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి, ఇది 2023-24లో 42.2 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఆ ఆర్థిక సంవత్సరంలో అమెరికాతో భారతదేశ వాణిజ్య మిగులు (India's trade surplus with US) 41.18 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది, ఇది 2023-24లో 35.32 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

చైనాతో వాణిజ్య లోటుచైనాకు భారతదేశం ఎగుమతులు 2023-24లో 16.66 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఒక్క ఏడాది వ్యవధిలోనే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14.5 శాతం తగ్గి 14.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 2023-24లో 101.73 బిలియన్‌ డాలర్ల నుంచి 2024-25లో 11.52 శాతం పెరిగి 113.45 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. ఈ ఎగుమతి-దిగుమతుల విలువ ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో, చైనాతో భారతదేశ వాణిజ్య లోటు ‍‌(India's trade deficit with China) దాదాపు 17 శాతం పెరిగి 99.2 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది, ఇది 2023-24లో 85.07 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2024-25లో 127.7 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో  (India-China bilateral trade value) చైనా భారతదేశం రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, 2023-24లో ఇది 118.4 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.        

మూడో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2013-14 నుంచి 2017-18 వరకు & 2020-21లో కూడా చైనా భారతదేశానికి అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా ఉంది. చైనాకు ముందు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates - UAE) ‍‌భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. 2021-22 నుంచి అమెరికాతో వాణిజ్యం పెరిగింది. దీంతో.. చైనా, UAEని వెనక్కు నెట్టిన అమెరికా, భారతదేశానికి అతి పెద్ద ట్రేడ్‌ పార్ట్‌నర్‌గా ఉద్భవించింది. గత ఆర్థిక సంవత్సరంలో, UAE 100.5 బిలియన్‌ డాలర్లతో భారతదేశానికి మూడో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా  ‍‌(UAE is India's second largest trading partner) అవతరించింది.