Ambani-Adani Update: మన దేశంలో నంబర్‌ 1, నంబర్‌ 2 సంపన్నులయిన ముకేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ మధ్య వ్యాపారపరంగా గట్టి పోటీ ఉంది. ఒక్క గ్రీన్‌ ఎనర్జీ విషయంలో తప్ప, ఒకరి దందాలో మరొకరు వేలు పెట్టకుండా ఇప్పటివరకు బిజినెస్‌ చేసిన ఈ ఇద్దరు దిగ్గజాలు, తొలిసారిగా ఒక ప్రాజెక్ట్‌ కోసం చేతులు కలిపారు. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్  (Reliance Industries), గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్‌తో (Adani Power) మొట్టమొదటిసారిగా ఒప్పందం కుదుర్చుకుంది. 


మార్కెట్‌ను ఆశ్చర్యపరిచిన గుజరాతీలు
అదానీ పవర్ లిమిటెడ్ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ అయిన మహాన్ ఎనర్జెన్‌ లిమిటెడ్‌లో (Mahan Energen Ltd) 26 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) కొనుగోలు చేసి, మార్కెట్‌ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. మహాన్ ఎనర్జెన్‌ లిమిటెడ్‌లో ఒక్కొక్కటి రూ.10 ముఖ విలువ కలిగిన 5 కోట్ల ఈక్విటీ షేర్లను (మొత్తం పెట్టుబడి రూ.50 కోట్లు) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలు చేసింది. మహాన్ ఎనర్జెన్‌ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే 500 మెగావాట్ల విద్యుత్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉపయోగించుకుంటుంది. ఇందుకోసం 20 ఏళ్ల పాటు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (PPA) కుదుర్చుకుంది.


దలాల్‌ స్ట్రీట్‌లో చీమ చిటుక్కుమన్నా కనిపెట్టే నేషనల్‌ మీడియా కూడా ఈ అగ్రిమెంట్‌ వాసనను పసిగట్టలేకపోయింది. రెండు కంపెనీల మధ్య అత్యంత గోప్యంగా సాగిన చర్చలు, కుదిరిన ఒప్పందం వ్యవహారమంతా వాటా కొనుగోలు తర్వాతే బయటకు వచ్చింది. అది కూడా ఈ రెండు కంపెనీలు అధికారికంగా ప్రకటించిన తర్వాతే వెల్లడైంది. 


గుజరాత్‌కు చెందిన ఈ ఇద్దరు బిలియనీర్ పారిశ్రామికవేత్తల మధ్య పొత్తు కుదరడం ఇదే తొలిసారి. ఆసియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి, రెండు స్థానాల కోసం పారిశ్రామికవేత్తలిద్దరు కొన్నేళ్లుగా పోటీ పడుతున్నారు. ముకేష్ అంబానీ చమురు & గ్యాస్, రిటైల్, టెలికాం వ్యాపారాలు చేస్తుంటే.. గౌతమ్‌ అదానీ ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు, మైనింగ్ వంటి వ్యాపారాలు చేస్తున్నారు. 


ఒక్క గ్రీన్ ఎనర్జీ బజినెస్‌లోనే ఈ రెండు గ్రూపులు ప్రత్యర్థులుగా మారాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ నాలుగు గిగాఫ్యాక్టరీలను నిర్మిస్తుండగా... 2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారుగా అవతరించాలని అదానీ గ్రూప్ ఆకాంక్షిస్తోంది. ఇందుకోసం మూడు గిగాఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేస్తోంది.


మరో విశేషం ఏంటంటే... ఈ ఇద్దరికీ 5G స్పెక్ట్రమ్ లైసెన్స్‌ ఉంది. అయితే, అంబానీ తరహాలో పబ్లిక్‌ నెట్‌వర్క్‌ కోసం అదానీ దానిని వినియోగించలేదు. అందుకే ఈ విషయంలో ఎలాంటి పోటీ లేదు.


2022లో, అంబానీతో సంబంధం ఉన్న ఒక కంపెనీ NDTVలో తన వాటాను అదానీ గ్రూప్‌నకు విక్రయించింది. ఆ తర్వాత NDTVని కొనుగోలు చేయడం అదానీకి సులభమైంది. 


ఈ నెల ప్రారంభంలో, ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు జామ్‌నగర్‌లో జరిగితే, ఆ కార్యక్రమానికి గౌతమ్ అదానీ హాజరయ్యారు.


మరో ఆసక్తికర కథనం: రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!