Adani Stocks MSCI: గత రెండు ట్రేడింగ్ సెషన్లలో కొంత కోలుకున్న అదానీ స్టాక్స్‌ ఇన్వెస్టర్లకు మళ్లీ పాతాళం చూపించాయి. ఈ గ్రూప్‌ సెక్యూరిటీలపై (స్టాక్స్‌) ఫ్రీ ఫ్లోట్ రివ్యూ నిర్వహిస్తామని ఇండెక్స్ ప్రొవైడర్ MSCI చెప్పడంతో అదానీ స్టాక్స్ ఇవాళ (గురువారం, 09 ఫిబ్రవరి 2023) మరోసారి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.


అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్‌ స్టాక్ ప్యాక్‌లో... ఫ్లాగ్‌షిప్ ఎంటిటీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) వరస్ట్‌ పెర్ఫార్మర్‌గా నిలిచింది. 15% పతనమై, రూ. 1,834.9 వద్ద లోయర్ సర్క్యూట్ పరిమితిలో లాక్ అయింది. అదానీ పోర్ట్స్ (Adani Ports), అంబుజా సిమెంట్స్ (Ambuja Cements), అదానీ పవర్ (Adani Power), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) కౌంటర్లు తలో 5% చొప్పున నష్టపోయాయి.


మరోవైపు, ఈ గ్రూప్‌లో అదానీ విల్మార్ (Adani Wilmar) మాత్రమే లాభాల్లో ట్రేడవుతోంది. ఇవాళ ఉదయం 10.50 గంటల సమయానికి ఇది బీఎస్‌ఇలో 4.42% పెరిగి రూ. 437.95 వద్ద కదులుతోంది.


అనిశ్చితితో కొనసాగుతున్న కంపెనీలను తమ విధానాల ప్రకారం ఫ్రీ ఫ్లోట్‌లో ఉంచబోమని MSCI ప్రకటించడంతో ఇవాళ అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.


ఈ 10 అదానీ స్టాక్స్‌లో, అదానీ విల్మార్ & NDTV తప్ప మిగిలిన కంపెనీలన్నీ MSCI ఇండెక్స్‌లో భాగంగా ఉన్నాయి.


ఏంటీ MSCI ఇండెక్స్‌?
MSCI, ఈ రాత్రి తన ఇండెక్స్ రివ్యూ చేసి, ఫ్రీ ఫ్లోట్ మార్పుచేర్పులు అమలు చేస్తుంది, స్టాక్స్‌ వెయిటేజీలు మారుస్తుంది. MSCI ఇండెక్స్‌ను ఫాలో అయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదార్లు లేదా పెట్టుబడి కంపెనీలు, తన ఇండెక్స్‌లోని షేర్ల వెయిటేజీ ప్రకారం పెట్టుబడులు పెడుతుంటారు. ఈ ఇండెక్స్‌లో ఉన్న ఒక స్టాక్‌ వెయిటేజీ పెరిగితే, దానికి అనుగుణంగా ఆ స్టాక్‌లో విదేశీ కొనుగోళ్లు పెరుగుతాయి. వెయిటేజీ తగ్గితే విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి. MSCI ఇండెక్స్‌ నుంచి ఒక స్టాక్‌ను తీసేస్తే, ఇండెక్స్‌ను ఫాలో అయ్యే ఇన్వెస్టర్లు ఆ స్టాక్‌ నుంచి తమ పెట్టుబడుల మొత్తాన్ని వెనక్కు తీసుకుంటారు. అంటే, తమ వద్ద ఉన్న ఆ షేర్లను అమ్మేస్తారు. దానివల్ల ఆ స్టాక్‌ మీద అమ్మకాల ఒత్తిడి పెరుగుతుంది.


MSCI ప్రకటన తర్వాత హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ‍‌(Hindenburg Research) మళ్లీ స్టోరీలోకి వచ్చింది. స్టాక్‌ క్రయవిక్రయాల్లో అదానీ గ్రూప్‌ అక్రమాలకు పాల్పడిందంటూ తాము ఇచ్చిన నివేదికను MSCI ప్రకటన బలపరుస్తోందని వెల్లడించింది.


2023 జనవరి 24న, ఈ షార్ట్ సెల్లర్స్ ‍‌(Hindenburg Research) రిపోర్ట్ విడుదలైన తర్వాత, వరుసగా 9 ట్రేడింగ్‌ రోజుల్లో అదానీ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సగానికి పడిపోయింది. గత రెండు రోజులు అదానీ గ్రూప్‌ స్టాక్స్ కాస్త కోలుకున్నాయి.  MSCI ప్రకటనతో ఈ బుల్లిష్ సెంటిమెంట్‌ కూడా బద్ధలైంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.