Adani Shares: అదానీ గ్రూప్‌లో కంపెనీలు అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (Adani Transmission Ltd), అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్‌ను (Adani Total Gas Ltd) MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ నుంచి తీసేస్తున్నట్లు MSCI ప్రకటించడంతో, ఇవాళ (శుక్రవారం, 12 మే 2023) ట్రేడింగ్ ప్రారంభంలోనే ఆ స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు NSE ఓపెనింగ్ ట్రేడింగ్‌లో రూ. 871.40 వద్ద ట్రేడయ్యాయి, గురువారం నాటి ముగింపు ధరతో పోలిస్తే రూ. 45.85 లేదా 5% తగ్గాయి. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు రూ. 812.30 వద్ద ట్రేడయ్యాయి, గురువారం నాటి ముగింపు ధరతో పోలిస్తే రూ. 42.75 లేదా 5% పడిపోయాయి.
2023 మే నెల రివ్యూలో భాగంగా MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో జరిగిన మార్పుల వల్ల ఈ రెండు స్టాక్స్ నిష్క్రమిస్తున్నాయి. మే 31, 2023 నుంచి ఈ సర్దుబాటు అమల్లోకి వస్తుంది.
అమ్మకానికి అదానీ కంపెనీల షేర్లు
MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ (MSCI Global Standard Index) నుంచి అదానీ ట్రాన్స్‌మిషన్. అదానీ టోటల్ గ్యాస్ నిష్క్రమించడం వల్ల, వాటిలో ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ ఫండ్స్ పెట్టుబడులు బయటకు వెళ్లిపోతాయి. అంటే, FPIలు ఈ కంపెనీల షేర్లను అమ్మేస్తాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ విషయంలో $201 మిలియన్లు, అదానీ టోటల్ గ్యాస్ విషయంలో $186 మిలియన్ల విలువైన పెట్టుబడులు బయటకు వెళ్లే అవకాశం ఉందని అంచనా. ఈ లెక్కన, ఒక్కో కౌంటర్ నుంచి 18 మిలియన్ షేర్లు ఇండెక్స్ నుంచి ఆఫ్‌లోడ్ అవుతాయి.
ప్రస్తుతం, MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ స్టాక్స్ వరుసగా 0.34, 0.31 వెయిటేజీతో ఉన్నాయి. 01 జూన్ 2023 నుంచి ఈ బరువులో కొంతమేర తగ్గుతుంది.
బరువు పెంచుకున్న జొమాటో
మరోవైపు, MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో, ఫుడ్ డెలివెరీ కంపెనీ జొమాటో (Zomato) బరువు మరో 10 bps పెరిగి 0.30కి చేరుకుంటుంది. ఫలితంగా ఈ కౌంటర్‌లోకి $59 మిలియన్ల అదనపు ప్రవాహాలు వస్తాయి. అంటే, విదేశీ పెట్టుబడిదార్లు మరో 77 మిలియన్ షేర్లను కొనే అవకాశం ఉంది. ఈ స్టాక్‌లో సగటు వాల్యూమ్ 0.9 రెట్లు పెరుగుతుందని అంచనా. జొమాటో షేర్లు ఇవాళ ఓపెనింగ్ సెషన్‌లో లాభపడ్డాయి, గురువారం సెషన్‌లోని ఆధిక్యాన్ని కొనసాగించాయి.
ఎంట్రీ & ఎగ్జిట్ స్టాక్స్
MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ నుంచి ఇండస్ టవర్స్ లిమిటెడ్ బయటకు వెళ్లిపోతుండగా... మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), సోనా BLW ప్రెసిషన్స్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ వంటి స్టాక్స్‌లో కొత్తగా లోపలకు వస్తున్నాయి.
ఇండెక్స్‌లో ఇప్పటికే ఉండి, వాటి వెయిటేజీ ఇంకా పెంచుకుంటున్న స్టాక్స్‌లో... మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, కోటక్ మహీంద్ర బ్యాంక్ లిమిటెడ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సిప్లా, NTPC ఉన్నాయి. పెరిగిన బరువుకు తగ్గట్లుగా వీటిలోకి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతాయి.
మరోవైపు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, ICICI బ్యాంక్ లిమిటెడ్ బరువులు తగ్గుతాయి. ఇండెక్స్‌లోనే కొనసాగుతాయి. తగ్గిన వెయిటేజీకి తగ్గట్లుగా వీటి నుంచి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ బయటకు వెళ్లిపోతాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.