Adani Group To Invest in North-East: గ్రీన్ ఎనర్జీ, రోడ్లు, హైవేలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాలు లక్ష్యంగా చేసుకుని, రాబోయే 10 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన 'రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్'లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ ప్రకటన చేశారు.
"గత దశాబ్దంలో, ఈశాన్యంలోని కొండలు, లోయలలో, భారతదేశ వృద్ధి కథలో ఒక కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. వైవిధ్యం, స్థితిస్థాపకత, వాడుకోని వనరుల్లో పాతుకుపోయిన కథ. ఈ ప్రాంతం ఇప్పుడు మన సాంస్కృతిక గర్వం, ఆర్థిక వాగ్దానం, వ్యూహాత్మక దిశకు మూలంగా ఉంది. రాబోయే 10 సంవత్సరాల్లో అదానీ గ్రూప్ ఈశాన్య ప్రాంతంలో అదనంగా 50,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని నేను ప్రకటిస్తున్నాను" అని అదానీ అన్నారు. ఇప్పటికే అదానీ సంస్థలు అసోంలో యాభైవేల కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతున్నట్టు మొన్న ఆ రాష్ట్రంలో జరిగిన బిజినెస్ సమ్మిట్‌లో ప్రకటించింది. ఇప్పుడు దానికి యాడ్ ఆన్‌గా మరో యాభై వేల కోట్ల రూపాయలు పెట్టబడులు పెట్టనుంది. మొత్తంగా ఈశాన్య రాష్ట్రాల్లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొంది.
"స్మార్ట్-మీటర్లు, హైడ్రో, పంప్డ్ స్టోరేజ్, పవర్ ట్రాన్స్‌మిషన్, రోడ్లు, హైవేలు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, అలాగే నైపుణ్యం, వృత్తి శిక్షణా కేంద్రాల ద్వారా సామర్థ్య పెంపుదలతో సహా గ్రీన్ ఎనర్జీపై దృష్టి ఉంటుంది. కానీ మౌలిక సదుపాయాల కంటే, మేము ప్రజల్లో ఉండే పెట్టుబడి పెడతాము. ప్రతి పని కూడా స్థానిక ఉద్యోగాలు, స్థానిక వ్యవస్థాపకత, సోషల్ ఎంగేజ్మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తుంది, ”అని ఆయన అన్నారు.
"ఈశాన్య రాష్ట్రంల్లో కనిపిస్తున్న వృద్ధి వెనుకాల ఒక నాయకుడు ఉన్నాడు. సరిహద్దులు లేవు... పని ప్రారంభాన్ని మాత్రమే గుర్తించిన ఆ లీడర్ దార్శనికత కనిపిస్తుంది. యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్, యాక్ట్ ఫస్ట్ అంటూ ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన నినాదం ఈశాన్యానికి మేల్కొలుపు. అని అభిప్రాయపడ్డారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి చేసిన కృషిని అదానీ ప్రస్తావించారు."అరవై ఐదు సార్ల పర్యటనలు. 2014 నుంచి ₹6.2 లక్షల కోట్ల పెట్టుబడి. రోడ్ నెట్‌వర్క్‌ను 16,000 కి.మీ.కు రెట్టింపు. విమానాశ్రయాల సంఖ్యను 18కి రెట్టింపు." అని తెలిపారు.
"ఇది కేవలం ప్రభుత్వ విధానం కాదు. ఇది మీ పెద్ద ఆలోచన తార్కాణం. ఇది మీ నమ్మకానికి ప్రతిరూపం. సబ్‌కా సాత్ - సబ్‌కా వికాస్ పట్ల మీ దృఢ సంకల్పానికి ఇది ముఖ్య లక్షణం!" అని మోదీకి కితాబు ఇచ్చారు.
"ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా నడుస్తాము. ముఖ్యమంత్రులారా, మేము మీ ప్రజలతో కలిసి నడుస్తాం. మేము మీ లక్ష్యాన్ని నిజం చేస్తాం. ఈశాన్య ప్రాంత ప్రజల కలలు సాకారం చేస్తాం. గౌరవం నిలబడెతాం. మీ తలరాతలను మారుస్తాం." అని అదానీ హామీ ఇచ్చారు.