Adani Telecom : భారత్‌లో 5 జీ సర్వీసులు అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న దిగ్గజాలకు తోడు కొత్తగా అదానీ కూడా టెలికాం రంగంలోకి ఎంటరయ్యేందుకు 5జీనే ఆధారంగా చేసుకుంటోంది. 5 జీ టెలికాం స్పెక్ట్రమ్ కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రేసులో రిలయన్స్ జియోకి చెందిన ముఖేష్ అంబానీ, ఎయిర్‌టెల్ అధినేత భారతి మిట్టల్‌కు పోటీ ఇవ్వాలనే యోచనలో అదానీ గ్రూపు ఉన్నట్టు వ్యాపార ప్రపంచంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
5 జీ స్పెక్ట్రం వేలం రేసులో అదానీ గ్రూప్ ?
ఐదో తరం లేదా అల్ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి 5జీ టెలికాం సేవలను అందించగల సామర్థ్యం ఉన్న సంస్థల నుంచి జూలై 26న నిర్వహించే స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి దరఖాస్తులు శుక్రవారంతో ముగిశాయి. నాలుగు అప్లికేషన్లు వచ్చినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీటిలో మూడు ఇప్పటికే టెలికాం రంగంలో ఉన్న జియో, ఎయిర్‌టెల్, వొడాపోన్-ఐడియావి కాగా, నాలుగోది అదానీ గ్రూప్ కు సంబంధించిన కంపెనీ ్ని తెలుస్తోంది. ఇదే సమయంలో అదానీ గ్రూపు ఇటీవలనే నేషనల్ లాంగ్ డిస్టెన్స్(NLD), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్(ILD) లైసెన్స్‌లు పొందినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే టెలికాం లైసెన్స్‌లు పొందిన అదానీ !
5 జీ స్పెక్ట్రమ్ తో ‘ప్రైవేట్ క్యాప్టివ్ నెట్ వర్క్’ ను అదానీ గ్రూప్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని కంపెనీలకు ప్రైవేటు క్యాప్టివ్ నెట్ వర్క్ లను తయారుచేసి అందించే సేవలకు శ్రీకారం చుట్టే చాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ టెలికాం సేవల రంగంలోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టాలని అదానీ భావిస్తే.. యూనిఫైడ్ లైసెన్సును తీసుకుంటారని చెబుతున్నారు. దేశవ్యాప్త యూనిఫైడ్ లైసెన్సు కోసం కేంద్ర ప్రభుత్వానికి రూ.15 కోట్ల లైసెన్సింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 మెగా హెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ను కేంద్ర ప్రభుత్వం వేలం వేయనుంది.
పన్నెండో తేదీన క్లారిటీ
5 జీ స్పెక్ట్రమ్ ను పొందే కంపెనీలు దాన్ని 20 ఏళ్లపాటు వినియోగించుకునే హక్కులను సొంతం చేసుకుంటాయి. 5జీ స్పెక్ట్రమ్ ను వేలంలో ఎంత మొత్తానికైతే కంపెనీలు దక్కించుకుంటాయో.. ఆ మొత్తాన్ని 20 ఈఎంఐలలో, 20 ఏళ్ల పాటు చెల్లించే వెసులుబాటును కల్పిస్తారు. ప్రతి ఏడాది తొలి త్రైమాసికంలోగా కేంద్ర ప్రభుత్వానికి ఈఎంఐ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్ల పాటు స్పెక్ట్రమ్ ను వినియోగించే ఆసక్తి లేని కంపెనీలు దాన్ని.. పదేళ్ల తర్వాత బకాయి ఈఎంఐలతో పాటు ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు. 5 జీ స్పెక్ట్రమ్ కోసం దరఖాస్తు చేసిన కంపెనీల పేర్లు తెలియాలంటే జులై 12 వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజున బిడ్డింగ్ సమర్పించిన కంపెనీల వివరాలను వెల్లడించనున్నారు.