Adani Group stocks: రుణాల ముందస్తు చెల్లింపు ప్రణాళికలో భాగంగా, మొత్తం 2.65 బిలియన్ డాలర్ల (రూ. 21,700 కోట్లకు పైగా) రుణాన్ని మార్చి 31కి ముందే అదానీ గ్రూప్‌ చెల్లించడంతో, ఆ ఉత్సాహం ఇవాళ (సోమవారం, 13 మార్చి 2023) అదానీ గ్రూప్‌ షేర్లలో కనిపిస్తోంది. అదానీ స్టాక్స్‌ ఈ రోజు 5% వరకు ర్యాలీ చేశాయి.


ఉదయం 10.45 గంటల సమయానికి... అదానీ ఫ్లాగ్‌షిప్ ఎంటిటీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ‍‌(Adani Enterprises) 1.98% లాభంతో రూ. 1,934 వద్ద ట్రేడవుతోంది. దీని కంటే ముందు, ట్రేడింగ్‌ ప్రారంభంలో 3.6% పెరిగి రూ. 1,985 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది.


అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అదానీ పవర్ (Adani Power) 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లిమిట్స్‌లో లాక్ అయ్యాయి. 


కొన్ని పైకి - కొన్ని కిందకు
గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్‌ కంపెనీలు ఈరోజు గ్రీన్ జోన్‌లో ప్రారంభమైనా.. ఆ తర్వాత కొన్ని నష్టాల్లో జారుకున్నాయి. ఉదయం 10.45 గంటల సమయానికి... అదానీ పోర్ట్స్‌ & స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ ‍‌(Adani Ports and Special Economic Zone), అంబుజా సిమెంట్స్‌ (Ambuja Cements), ACC, NDTV షేర్లు ఎర్ర రంగు పులుముకున్నాయి. ఇదే సమయానికి అదానీ విల్మార్‌ (Adani Wilmar) తటస్థంగా ఉంది.


$2.15 బిలియన్ల రుణం ముందస్తు చెల్లింపుతో పాటు, అంబుజా కొనుగోలు కోసం తీసుకున్న రుణంలో $500 మిలియన్లను కూడా అదానీ గ్రూప్‌ ప్రమోటర్లు ప్రీపెయిడ్ చేసారు. మొత్తం 2.65 బిలియన్ డాలర్ల రుణం తీర్చేసినట్లు ప్రకటించిన అదానీ గ్రూప్‌, దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. "ఈక్విటీ కాంట్రిబ్యూషన్‌ పెంచడానికి ప్రమోటర్ల నిబద్ధతకు అనుగుణంగా అప్పు తీర్చడం జరిగింది. అంబుజా, ACC మొత్తం కొనుగోలు విలువ $6.6 బిలియన్లలో $2.6 బిలియన్లను ఇప్పుడు ప్రమోటర్లు ఇన్‌ఫ్యూజ్‌ చేసారు" వెల్లడించింది.


గ్లోబల్‌ సిమెంట్‌ మేజర్‌ హోల్సిమ్‌ గ్రూప్‌నకు భారతదేశంలో ఉన్న సిమెంట్ వ్యాపారాలు అంబుజా సిమెంట్స్, ACCని గత సంవత్సరం 10.5 బిలియన్‌ డాలర్లకు అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. గ్రూప్‌ ద్వారా జరిగిన అతి పెద్ద కొనుగోలు ఇది.


అంబుజా సిమెంట్స్‌లో 4.5% వాటా లేదా రూ. 3,000 కోట్లను సెకండరీ మార్కెట్‌ ద్వారా విక్రయించాలని అదానీ కుటుంబం యోచిస్తున్నట్లు గత వారం వార్తలు వచ్చాయి.


హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిలీజ్‌ చేసిన బ్లాస్టింగ్‌ నివేదిక తర్వాత, నెల రోజుల పాటు అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ బెంబేలెత్తాయి. వాటి మార్కెట్‌ విలువలో సగానికి పైగా మొత్తాన్ని కేవలం నెల రోజుల వ్యవధిలోనే కోల్పోయాయి. ఆ తర్వాత, గత వారం, గ్రూప్‌లోని 4 కంపెనీల్లో అమెరికాకు చెందిన GQG పార్ట్‌నర్స్‌ వాటాలు కొన్నది. ఇందుకోసం అదానీ గ్రూప్‌నకు రూ. 15,446 కోట్లు చెల్లించింది. ఈ డీల్‌ తర్వాతే అదానీ గ్రూప్‌ తన అప్పుల్ని ముందస్తుగా చెల్లించింది. అయితే, GQG పార్ట్‌నర్స్‌ ఇచ్చిన డబ్బునే అప్పుల తిరిగి చెల్లింపులకు ఉపయోగించిందా, లేక వేరే మార్గంలో డబ్బు తీసుకొచ్చిందా అన్న విషయాన్ని అదానీ గ్రూప్‌ ఇప్పటి వరకు వెల్లడించలేదు. GQG పార్ట్‌నర్స్‌ నుంచి వచ్చిన డబ్బునే రుణాల ముందస్తు చెల్లింపుల కోసం ఈ గ్రూప్‌ ఉపయోగించిందని మార్కెట్‌ భావిస్తోంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.