Adani Group Shares: ASM ఫ్రేమ్‌వర్క్ నుంచి మూడు అదానీ స్టాక్స్‌ను బయటకు తీసుకొచ్చిన తర్వాతి రోజే, మరో గుడ్‌న్యూస్‌ కూడా మార్కెట్‌లోకి వచ్చింది. దీర్ఘకాలిక ASM ఫ్రేమ్‌వర్క్ రెండో దశ నుంచి మరో రెండు స్టాక్స్‌ను విముక్తి లభించింది. ఇది సోమవారం, అంటే మార్చి 20, 2023న అమలులోకి వస్తుంది.


అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), NDTV స్టాక్స్‌ స్టాక్‌ ఎక్సేంజీల దీర్ఘకాలిక అదనపు నిఘా (ASM) ఫ్రేమ్‌వర్క్‌లోని మొదటి దశకు (స్టేజ్- I) తరలించనున్నట్లు NSE & BSE శుక్రవారం (17 మార్చి 20223) ప్రకటించాయి. 


దీనికి ఒక రోజు క్రితం, గురువారం (16 మార్చి 20223) నాడు, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ‍‌(Adani Enterprises), అదానీ పవర్ (Adani Power), అదానీ విల్మార్‌ను ‍‌(Adani Wilmar) స్వల్పకాలిక ASM ఫ్రేమ్‌వర్క్‌ నుంచి మినహాయించాయి.


ఇప్పుడు NDTV, అదానీ గ్రీన్ ఎనర్జీ పరిస్థితేంటి?
దీర్ఘకాలిక ASM ఫ్రేమ్‌వర్క్ రెండో దశ నుంచి మొదటి దశకు NDTV, అదానీ గ్రీన్ ఎనర్జీని ఎక్సేంజీలు మార్చినా, వాటిపై నిఘా పూర్తి తొలగిపోలేదు. మొదటి దశలో ఉంచడం అంటే ఈ స్టాక్స్‌ 5 శాతం లేదా అంతకంటే తక్కువ ప్రైస్‌ సర్క్యూట్‌లో కొనసాగుతాయి. అంటే, పెరిగినా & తగ్గినా 5% సర్క్యూట్‌కు పరిమితం అవుతాయి. అంతేకాదు, వీటిలో ట్రేడ్‌ చేయాలంటే ట్రేడర్లు 100 శాతం మార్జిన్‌ తెచ్చుకోవాల్సిందే. 


ఒక స్టాక్‌ ట్రేడింగ్‌లో ఎక్కువ అస్థిరతకు అవకాశం లేకుండా, చిన్న స్థాయి ట్రేడర్లు ఎక్కువ నష్టపోకుండా చూడడానికి ఆయా స్టాక్స్‌ను స్టాక్‌ ఎక్సేంజీలు దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక ASM ఫ్రేమ్‌వర్క్ కింద ఉంచుతాయి, వాటిపై నిఘా పెడతాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ‍‌(Hindenburg Research) నివేదిక తర్వాత అధిక అస్థిరత కారణంగా అదానీ గ్రూప్ స్టాక్స్‌ను స్టాక్‌ ఎక్సేంజీలు ASM ఫ్రేమ్‌వర్క్ కింద ఉంచాయి.


అదనపు నిఘాలో మరో రెండు షేర్లు
అదానీ పోర్ట్స్ & సెజ్‌, అంబుజా సిమెంట్స్‌ స్టాక్స్‌లోనూ అస్థిరతను నియంత్రించడానికి వాటిని స్వల్పకాలిక అదనపు పర్యవేక్షణ విధానం కిందకు స్టాక్‌ ఎక్సేంజీలు గత నెలలో తీసుకొచ్చాయి.


అదానీ గ్రూప్ స్టాక్స్‌లో శుక్రవారం ముగింపు
శుక్రవారం, BSEలో, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు 5 శాతం పెరిగి రూ. 1024.85 వద్ద, అదానీ విల్మార్ 1.52 శాతం పెరిగి రూ. 427.35 వద్ద ముగిశాయి. అదానీ పవర్ రూ. 199.95 వద్ద ముగియగా, అంబుజా సిమెంట్ రూ. 378.25 వద్ద స్థిరపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 1.88 శాతం పెరిగి రూ. 1,877.15 వద్ద ఆగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు 4.99 శాతం పెరిగి రూ. 816.80 వద్ద ముగిసింది. NDTV 1.63 శాతం పడిపోయి రూ. 205.70 వద్ద ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.