Adani Enterprises Q4 Results: అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాల్లో అద్భుతం చేసింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ లాభం 137.5 శాతం పెరిగింది. ఆ త్రైమాసికంలో రూ. 722.48 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ. 304.32 కోట్లుగా ఉంది. విమానాశ్రయాలు, హైవే వ్యాపారాలు ఆరోగ్యకరంగా పెరగడం వల్ల భారీ లాభం సాధ్యమైందని ఈ కంపెనీ వెల్లడించింది.
త్రైమాసికంలో వ్యాపార వృద్ధి
కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 24,865.52 కోట్లతో పోలిస్తే, 2023 మార్చి త్రైమాసికంలో 26.06 శాతం వృద్ధితో రూ. 31,346.05 కోట్లకు చేరుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 7 విమానాశ్రయాల ద్వారా 2.14 కోట్ల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. ఏడాది క్రితం కంటే ఇది 74 శాతం అధికం. సరకు రవాణాలోనూ 14 శాతం వృద్ధి కనిపించింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ చేస్తున్న బొగ్గు ట్రేడింగ్ వ్యాపారం 42 శాతం పెరిగింది. ఈ ఏడాది విపరీతమైన వేడిగాలులు వీస్తాయని అంచనా వేసినందున విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దీంతో విద్యుత్ ప్లాంట్లు బొగ్గు నిల్వలను పెంచడం ప్రారంభించాయి. ఈ ప్రయోజనం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు అందింది. కొత్త ఇంధన వ్యాపారం 15 శాతం వృద్ధి చెందింది, గనుల సేవల వ్యాపారం 7 శాతం పెరిగింది.
మొత్తం ఆర్థిక సంవత్సరంలో...
మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 207.4 శాతం జంప్‌తో రూ. 2421.6 కోట్లకు చేరింది. 2021-22లో ఇది రూ. 787.7 కోట్లుగా ఉంది. FY22తో పోలిస్తే FY23లో ఆదాయం 96 శాతం పెరిగి రూ. 1,38,715 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో, ఈ కంపెనీ నిర్వహిస్తున్న 7 విమానాశ్రయాల ద్వారా 7.48 కోట్ల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు.
2023 మార్చి నాటికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ నెత్తిన రూ. 38,320 కోట్ల అప్పులు ఉన్నాయి. 2022 మార్చి చివరి నాటికి ఉన్న రూ. 41,024 కోట్ల కంటే ఇవి తగ్గాయి.
120% డివిడెండ్
అదానీ ఎంటర్‌ప్రైజెస్ వాటాదార్లకు డివిడెండ్ కూడా ప్రకటించింది. ఒక రూపాయి ముఖ విలువున్న ఒక్కో ఈక్విటీ షేర్‌కు 120 శాతం లేదా రూ. 1.20 డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది.
మరో ఐదేళ్ల వరకు ఛైర్మన్
అదానీ ఎంటర్‌ప్రైజెస్ మళ్లీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని మరో ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమిస్తూ కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపింది.
గురువారం మార్కెట్ ముగిసే సమయానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర 3.93% లాభంతో రూ. 1911 వద్ద ముగిసింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు గత త్రైమాసికం ఒక పీడకలలాంటింది. నాలుగో త్రైమాసికంలో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 20,000 కోట్ల FPOని వాయిదా వేసింది. అదానీ గ్రూప్ షేర్లు అతి భారీగా పతనం అయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ రూ. 4190 స్థాయి నుంచి రూ. 1017కి పడిపోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.