6 reasons why silver prices crashed by Rs 21000: వెండి ధరలు ఒక్కరోజులోనే కిలోకు సుమారు రూ. 21,000 మేర భారీగా పతనమవ్వడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేసింది. ఈ విదంగా పతనమవడానికి ప్రధానంగా ఆరు కారణాలు చెప్పుకోవచ్చు. 

Continues below advertisement

1. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు సంకేతాలు 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై సానుకూల సంకేతాలు రావడం వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చలు విజయవంతమయ్యాయన్న వార్తలతో మార్కెట్‌లో భయం తగ్గింది. యుద్ధం వంటి అనిశ్చిత సమయాల్లో ఇన్వెస్టర్లు వెండిని సురక్షితమైన పెట్టుబడిగా  చూస్తారు, కానీ పరిస్థితులు చక్కబడుతున్నాయని తెలియగానే అమ్మకాలకు మొగ్గు చూపారు.

Continues below advertisement

2. లాభాల స్వీకరణ

2025 ప్రారంభం నుండి వెండి అద్భుతమైన లాభాలను అందించింది. కిలో ధర రూ. 2.54 లక్షల వద్ద రికార్డు స్థాయిని తాకినప్పుడు, ఇన్వెస్టర్లు తమ లాభాలను నగదు రూపంలోకి మార్చుకోవాలని భావించారు. ఒకేసారి పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడం వల్ల ధర ఒక్కసారిగా కిందికి పడిపోయింది.

 3. టెక్నికల్ కరెక్షన్ 

ఏదైనా వస్తువు ధర అతి తక్కువ కాలంలో విపరీతంగా పెరిగినప్పుడు దానిని  ఓవర్ హీటెడ్  మార్కెట్ అంటారు. వెండి ధర దాని సగటు ధర  కంటే చాలా ఎక్కువ స్థాయికి చేరింది. ఇలాంటి సమయాల్లో కరెక్షన్ రావడం సహజం. ఈ సాంకేతిక కారణాల వల్ల ధరలు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకునే క్రమంలో భారీ పతనం చోటుచేసుకుంది.

 4. డాలర్ ఇండెక్స్ బలపడటం 

అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ బలోపేతం కావడం వల్ల వెండి ధరలపై ఒత్తిడి పెరిగింది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు, ఇతర కరెన్సీలు వాడే వారికి వెండి కొనడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. దీనివల్ల అంతర్జాతీయంగా వెండికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి.

 5. ఎక్స్ఛేంజ్ మార్జిన్ పెంపు  

చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్  వెండి ట్రేడింగ్‌పై మార్జిన్ మనీని పెంచింది. అంటే, వెండిలో వ్యాపారం చేసే ట్రేడర్లు ఇప్పుడు ఎక్కువ నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదనపు నగదును చెల్లించలేక చాలా మంది ట్రేడర్లు తమ వద్ద ఉన్న వెండి కాంట్రాక్టులను వదిలేశారు, ఇది పతనానికి మరో ప్రధాన కారణమైంది.

 6. ఆల్గో ట్రేడింగ్ , స్టాప్-లాస్ ట్రిగ్గర్స్ 

ప్రస్తుత మార్కెట్లు ఎక్కువగా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ద్వారా నడుస్తున్నాయి. ధర ఒక నిర్దిష్ట స్థాయి కంటే కిందకు పడిపోగానే, ఆటోమేటిక్‌గా అమ్మకాలు జరిగిపోయేలా  స్టాప్-లాస్  ఆర్డర్లు పెడతారు. వెండి ధర రూ. 21,000 పడిపోయే క్రమంలో వరుసగా స్టాప్-లాస్ ఆర్డర్లు ట్రిగ్గర్ అవ్వడం వల్ల అమ్మకాల వేగం పెరిగి, ధరలు ఊహించని రీతిలో క్షీణించాయి. మరి వెండి ధరలు పడిపోతూనే ఉంటాయా...పెరుగుతాయా అన్నది .. రాబోయే రోజుల్లో మార్కెట్ స్పందనను బట్టి అర్థం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.