5G Plans Price: మొబైల్‌ యూజర్లకు అలర్ట్‌! అతి త్వరలోనే టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉందని టెలికాం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.1.5 లక్షల విలువైన 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలు పూర్తవ్వడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.


'5జీ స్పెక్ట్రమ్‌ను దక్కించుకొనేందుకు టెలికాం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. అందుకే 5జీ సేవలకు ఎక్కువ ధర వసూలు చేస్తాయి. కొత్త తరం 5జీకి కస్టమర్లను ఎక్కువ ఆకర్షితులను చేసేందుకు 4జీ టారిఫ్‌లనూ పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే 2019 డిసెంబర్‌, 2021 నవంబర్‌లో టెలికాం కంపెనీలు రెండు సార్లు భారీగా టారిఫ్‌లను పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక ఏడాది రెండో అర్ధభాగంలో 4జీ టారిఫ్‌లను పెంచుతారని అంచనా' అని క్రిసిల్‌ రేటింగ్స్ సీనియర్‌ డైరెక్టర్‌ మనీశ్‌ గుప్తా అన్నారు.


టెలికాం కంపెనీలు 51,236 MHz స్పెక్ట్రమ్‌ను రూ.1.5 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ జియో రూ.88,078 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్నాయి.


సర్వీస్‌ ప్రొవైడర్లు మొత్తం సబ్‌స్క్రైబర్లపై టారిఫ్‌ను కనీసం 4 శాతం పెంచుతాయని నొమురా గ్లోబల్‌ మార్కెట్స్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. అంటే రోజుకు 1.5జీబీ కన్నా ఎక్కువ డేటా ఉండే 4జీ ప్లాన్లపై పెంపు తప్పదని పేర్కొంది. 2021లో స్పెక్ట్రమ్‌ కొనుగోలుపై ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ యూసేజీ ఛార్జీలను రద్దు చేసింది. దీనివల్ల కంపెనీలు వార్షికంగా రూ.7,500 కోట్ల మేర ఆదా చేసుకున్నాయని నొమురా వెల్లడించింది.


'చారిత్రకంగా చూస్తే భారత టెలికాం కంపెనీలు 4జీ ప్లాన్లపై ప్రీమియం వసూలు చేయడం ఆపేశాయి. 2జీ/3జీ కన్నా ఎక్కువ డేటా వేగం అందిస్తున్నా ప్రీమియం తీసుకోలేదు. అయితే 4జీతో పోలిస్తే 5జీకి టెలికాం కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేసే అవకాశం ఉంది. అందుకే వీటిపై సమీప భవిష్యత్తులో పర్యవేక్షణ ఉండనుంది. ఏఆర్‌పీయూ తర్వాతి ఏడాది నుంచి ప్రీమియం వసూలు చేయొచ్చు' అని నొమురా తెలిపింది.


'5జీ స్పెక్ట్రమ్‌ వేలం విజయవంతంగా ముగిసింది. రూ.1,50,173 కోట్లు ప్రభుత్వానికి సమకూరాయి. 72,098 MHz స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి పెట్టాం. అందులో 51,236 MHz అమ్ముడైంది' అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోమవారం అన్నారు.


రిలయన్స్‌ జియో 24,740 MHz స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసి అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచింది. 19,867 MHzతో భారతీ ఎయిర్‌టెల్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. వొడాఫోన్ ఐడియా 2668 MHz స్పెక్ట్రమ్‌ను దక్కించుకోగా అదానీ డేటా నెట్‌వర్క్‌ 26 GHz బ్యాండులో 400 MHz 5 జీ వాయు తరంగాలను దక్కించుకున్నాయి.


రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz రేడియో తరంగాలను బిడ్డింగ్‌ వేశారు. స్వల్ప (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మధ్య (3300 MHz), అధిక (26 GHz) తరంగ బ్యాండ్లకు వేలం నిర్వహించారు.