Yamaha XSR 155 Comparison: భారత మార్కెట్‌లో రెట్రో స్టైల్‌ మోటార్‌సైకిళ్లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సెగ్మెంట్‌లో ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్న రెండు బైక్స్‌ - యమహా XSR 155, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350. ఇంజిన్‌ సామర్థ్యం, రైడింగ్‌ స్వభావం భిన్నంగా ఉన్నా, ధర దగ్గరగా ఉండటం వల్ల ఒకదాన్ని చూసేవాళ్లు మరొకదాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తున్నారు.

పెర్ఫార్మెన్స్‌ - రేవ్‌ హ్యాపీ Vs టార్క్‌ రిచ్‌

యమహా XSR 155లో 155cc సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 10,000rpm వద్ద 18.4hp శక్తి, 7,500rpm వద్ద 14.2Nm టార్క్‌ ఇస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్‌ రేవ్‌ చేయడాన్ని ఇష్టపడుతుంది. VVA టెక్నాలజీ వల్ల 7,000rpm దాటాక ఇంజిన్‌ మరింత ఉత్సాహంగా స్పందిస్తుంది.

హంటర్‌ 350లో 349cc ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 6,100rpm వద్ద 20hp, 4,000rpm వద్ద 27Nm టార్క్‌ ఇస్తుంది. కాగితంపై చూస్తే ఈ పవర్‌ తేడా తక్కువగా కనిపించినా, రైడింగ్‌లో మాత్రం స్పష్టమైన వ్యత్యాసం తెలుస్తుంది. XSR 155 బైక్‌ 0-100km వేగాన్ని సుమారు 11.6 సెకన్లలో చేరితే, హంటర్‌ 350కు దాదాపు 15 సెకన్లు పడుతుంది.

నగరంలో ట్రాఫిక్‌లో హంటర్‌ 350 టార్క్‌ బలం వల్ల తక్కువ గేర్‌ మార్పులతో సులభంగా నడుస్తుంది. XSR 155 మాత్రం వేగం కావాలంటే గేర్‌ తగ్గించాల్సి వస్తుంది.

రైడ్‌ కంఫర్ట్‌ - చురుకైన సిటీ బైక్‌ Vs స్థిరమైన రోడ్‌స్టర్‌

కర్బ్‌ వెయిట్‌ విషయానికి వస్తే XSR 155 కేవలం 137 కిలోలు మాత్రమే. హంటర్‌ 350 బరువు 181 కిలోలు. ఈ తేడా నగరంలో స్పష్టంగా తెలుస్తుంది. ట్రాఫిక్‌లో XSR చాలా చురుకుగా ఫీలింగ్‌ ఇస్తుంది.

హంటర్‌ 350 సీట్‌ హైట్‌ 790mm మాత్రమే ఉండటం వల్ల 5 అడుగులు 5 అంగుళాల లోపు ఎత్తు ఉన్నవాళ్లకు మరింత అనుకూలంగా ఉంటుంది. XSR 155 సీట్‌ హైట్‌ 810mm. హంటర్‌లో కూర్చునే భంగిమ నిటారుగా, రిలాక్స్‌గా ఉంటుంది.

గత ఏడాది హంటర్‌ 350 సస్పెన్షన్‌ను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అప్‌డేట్‌ చేసింది. ఇప్పుడు గుంతలు, స్పీడ్‌ బ్రేకర్లు చాలా సాఫీగా దాటుతుంది. XSR 155లో రియర్‌ సస్పెన్షన్‌ కొంచెం స్టిఫ్‌గా ఉండటం వల్ల చెడు రోడ్లపై ఎక్కువసేపు నడిపితే లోయర్‌ బ్యాక్‌పై ఒత్తిడి పడుతుంది.

ఫీచర్లు - ఆధునిక టెక్‌ Vs సరళమైన వినియోగం

XSR 155లో పూర్తిగా డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, VVA టెక్నాలజీ, USD ఫ్రంట్‌ ఫోర్క్స్‌, LED లైటింగ్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి.

హంటర్‌ 350లో సెమీ డిజిటల్‌ క్లస్టర్‌ ఉంటుంది. టాకోమీటర్‌ లేకపోయినా, హయ్యర్‌ వేరియంట్లలో ట్రిప్పర్‌ నావిగేషన్‌ పాడ్‌ అందుబాటులో ఉంటుంది. డ్యుయల్‌ ఛానల్‌ ABS, స్లిపర్‌ క్లచ్‌ ఉన్నాయి.

ధర

యమహా XSR 155 ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు రూ.1.50 లక్షలు. హంటర్‌ 350 టాప్‌ వేరియంట్‌ ధర రూ.1.67 లక్షలు. 

తక్కువ ధర, తక్కువ బరువు, మెరుగైన వేగం కారణంగా XSR 155 ఎక్కువ విలువ ఇస్తుంది. అయితే కంఫర్ట్‌, రిలాక్స్‌ రైడింగ్‌, టార్క్‌ ఫీలింగ్‌ కోరుకునేవాళ్లకు హంటర్‌ 350 కూడా ఆకర్షణీయమైన ఎంపిక. యువ రైడర్లు స్పోర్టీ రెట్రో స్టైల్‌ కోరుకుంటే XSR 155 సరైనది. స్మూత్‌గా, సౌకర్యంగా ప్రయాణం చేయాలనుకునేవాళ్లకు హంటర్‌ 350 మంచి తోడుగా ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.