Yamaha XSR 155 Performance: భారత మార్కెట్‌లో నియో రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్ ట్రెండ్‌ను బాగా ఉపయోగించుకుంటూ, యమహా తీసుకొచ్చిన బైక్ XSR 155. బయటకు చూస్తే పాత కాలం స్టైల్ గుర్తొచ్చేలా కనిపించినా, లోపల మాత్రం ఇది పూర్తిగా ఆధునిక టెక్నాలజీతో రూపొందింది. యమహా R15, MT 15 తరహాలో ఒకే చాసిస్, ఒకే ఇంజిన్‌ను పంచుకునే ఈ బైక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే...
యమహా XSR 155 యాక్సిలరేషన్
ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన పెర్ఫార్మెన్స్ టెస్ట్ సమయంలో రోడ్డు పరిస్థితులు పూర్తిగా పొడిగా ఉన్నాయి. మంచి లాంచ్ కోసం ట్రాక్షన్ కంట్రోల్‌ను ఆఫ్ చేసి పరీక్షించారు. ఫలితాల్లో ఈ బైక్ నిజంగా ఆకట్టుకుంది.
XSR 155 0 నుంచి 60 కి.మీ. వేగాన్ని 4.29 సెకన్లలో, 0 నుంచి 80 కి.మీ. వేగాన్ని 7.02 సెకన్లలో, 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని 11.66 సెకన్లలో చేరుకుంది. ఈ సెగ్మెంట్‌లో ఇది చాలా మంచి సంఖ్యలు. ముఖ్యంగా మిడ్ రేంజ్‌లో బైక్ బలంగా లాగుతుంది. రెడ్‌లైన్ వరకు రేవ్ చేస్తే వచ్చే ఎగ్జాస్ట్ సౌండ్ రైడింగ్‌ను మరింత ఎంగేజింగ్‌గా చేస్తుంది. క్లచ్ యాక్షన్ లైట్‌గా ఉండటం, గేర్‌బాక్స్ స్మూత్‌గా పని చేయడం వల్ల సిటీతో పాటు హైవేలో కూడా బైక్ సులభంగా నడుస్తుంది.
రోల్ ఆన్ యాక్సిలరేషన్
ఈ బైక్‌లో ఉన్న 155 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 10,000 ఆర్‌పీఎం వద్ద 18.4 హెచ్‌పీ పవర్, 7,500 ఆర్‌పీఎం వద్ద 14.2 ఎన్ఎం టార్క్ ఇస్తుంది.
రోల్ ఆన్ టెస్టుల్లో రెండో గేర్‌లో 3.00 సెకన్లు, మూడో గేర్‌లో 5.73 సెకన్లు, నాలుగో గేర్‌లో 5.70 సెకన్లు పట్టింది. కేవలం 137 కిలోల కర్బ్ వెయిట్ ఉండటంతో ఈ బైక్ R15, MT 15తో పోలిస్తే తేలికగా అనిపిస్తుంది. అదే దీనికి మంచి పికప్‌కు కారణం.
బ్రేకింగ్ పనితీరు
బైక్ ఆపే సమయంలో స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ విషయంలో XSR 155 నమ్మకాన్ని కలిగిస్తుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, డ్యూయల్ ఛానల్ ABS అందిస్తున్నారు. మా బ్రేకింగ్ టెస్ట్‌లో బైక్ తక్కువ దూరంలోనే కంట్రోల్‌లో ఆగింది. టైర్ల నుంచి వచ్చే గ్రిప్ సరిపడగా ఉంది. లీవర్‌ను గట్టిగా నొక్కినా ABS జోక్యం ఎక్కువగా అనిపించదు. మొత్తం మీద బ్రేకింగ్ పనితీరు సంతృప్తికరంగా ఉంది.
స్పెసిఫికేషన్స్, ధర
యమహా, XSR 155 లో కూడా MT 15, R15 ఇచ్చే శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్‌నే నియో రెట్రో స్టైల్‌లో అందిస్తోంది. 155 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్‌బాక్స్, 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 137 కిలోల బరువు దీని ముఖ్య లక్షణాలు.
ఈ బైక్ ధర రూ.1,49,990 (ఎక్స్-షోరూమ్ ధర). MT 15, R15 కంటే ఇది కొంచెం చౌక. TFT స్క్రీన్ లేకపోయినా, ట్రాక్షన్ కంట్రోల్ స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. అదనంగా, బైక్‌ను వ్యక్తిగతంగా మార్చుకునేందుకు రెండు కస్టమ్ కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్టైల్‌తో పాటు స్పోర్టీ పెర్ఫార్మెన్స్ కోరుకునే యువ రైడర్లకు యమహా XSR 155 మంచి ఎంపికగా నిలుస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.