Yamaha RayZR 125 Price And Features Telugu: యమహా కంపెనీ, తన RayZR 125 Fi హైబ్రిడ్‌ స్కూటర్‌ను కొత్త ఫీచర్లు & కొత్త రంగులతో అప్‌డేట్‌ చేసింది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ నాలుగు వేరియంట్లలో లభిస్తోంది, అవి - Drum, Disc, Street Rally LCD &Street Rally TFT. బేస్‌ వేరియంట్‌ Drum నుంచి టాప్‌ వేరియంట్‌ Street Rally TFT వరకు ధరలో రూ.20,560 తేడా ఉంది. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? పై వేరియంట్‌కు వెళ్తే అదనంగా ఏం లభిస్తుంది? తెలుసుకుందాం.

Continues below advertisement

ముందుగా అన్ని వేరియంట్లలోనూ ఒకే ఇంజిన్‌ ఉంటుంది. 125cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ 8.2hp శక్తిని, 10.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌ పేరులో ఉన్నట్లుగానే అన్ని వేరియంట్లలోనూ యమహా మైల్డ్‌ హైబ్రిడ్‌ వ్యవస్థ ఉంటుంది. ఇది అవసరమైన సమయంలో టార్క్‌ను స్వల్పంగా పెంచుతుంది.

అన్ని వేరియంట్లలో స్టార్టర్‌ మోటార్‌ జనరేటర్‌ ఉంటుంది. దీంతో ఇంజిన్‌ నిశ్శబ్దంగా స్టార్ట్‌ అవుతుంది. స్టాప్‌-స్టార్ట్‌ సిస్టమ్‌ కూడా ఉంటుంది. యూనిఫైడ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది. ముందు భాగంలో వేరియంట్‌ను బట్టి డ్రమ్‌ లేదా డిస్క్‌ బ్రేక్‌ ఉంటుంది. అన్ని వేరియంట్లలో వెనుక డ్రమ్‌ బ్రేక్‌ ఉంటుంది.

Continues below advertisement

అలాగే టైర్లు & రిమ్‌ల సైజులు కూడా ఒకేలా ఉంటాయి. సీటు ఎత్తుతో పాటు స్కూటర్‌ కొలతల్లోనూ ఎలాంటి మార్పు లేదు. సీటు కింద 21 లీటర్ల స్టోరేజీ స్థలం ఉంటుంది. అదనపు ఫీచర్లు ఉన్నప్పటికీ అన్ని వేరియంట్ల బరువు 99 కిలోలుగానే ఉంటుంది.

Drum డ్రమ్‌ వేరియంట్‌ ఈ సిరీస్‌లో బేస్‌ మోడల్‌. ఇందులో ముందు భాగంలో 130 mm డ్రమ్‌ బ్రేక్‌ ఉంటుంది. LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ద్వారా వేగం, ఇంధన స్థాయి వంటి ప్రాథమిక వివరాలు తెలుసుకోవచ్చు. అయితే కనెక్టివిటీ ఫీచర్లు ఉండవు. ఈ వేరియంట్‌ మెటాలిక్‌ బ్లాక్‌ రంగులో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ.79,880.

ఇది కూడా చదవండి: KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?

Discడ్రమ్‌ వేరియంట్‌ తర్వాత డిస్క్‌ వేరియంట్‌ వస్తుంది. ఇందులో 190 mm ముందు డిస్క్‌ బ్రేక్‌ ఉంటుంది. యమహా Y-కనెక్ట్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ బ్యాటరీ స్థాయి, కాల్స్‌, ఈమెయిల్స్‌, SMS అలర్ట్‌లు వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఇంధన వినియోగం, సర్వీస్‌ సూచనలు & చివరిగా స్కూటర్‌ను పార్క్‌ చేసిన ప్రదేశం వంటి సమాచారాన్ని కూడా యాప్‌ ద్వారా చూడవచ్చు. దీని ధర రూ.87,680. బేస్‌ వేరియంట్‌తో పోలిస్తే రూ.7,800 ఎక్కువ.

Street Rally LCDస్ట్రీట్‌ ర్యాలీ LCD వేరియంట్‌ మరో మెట్టు పైకి తీసుకెళ్తుంది. మెకానికల్‌గా ఇది సాధారణ RayZRతో సమానంగానే ఉంటుంది. అయితే హ్యాండ్‌ గార్డులు & ముందు ఏప్రాన్‌కు అదనపు సైడ్‌ రీన్‌ఫోర్స్‌మెంట్లు ఉంటాయి. కొత్త రంగులు & డీకల్స్‌తో స్పోర్టీ లుక్‌ లభిస్తుంది. దీని ధర రూ.93,930.

ఇది కూడా చదవండి: RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు

Street Rally TFTఅన్నింటికంటే పైస్థానంలో స్ట్రీట్‌ ర్యాలీ టీఎఫ్‌టీ వేరియంట్‌ ఉంటుంది. ఇందులో TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ లభిస్తుంది. వై-కనెక్ట్‌తో పాటు టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌ & మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు వస్తాయి. యమహా స్కూటర్‌ ఆన్సర్‌ బ్యాక్‌ ఫీచర్‌ కూడా ఉంటుంది. రద్దీగా ఉండే పార్కింగ్‌ ప్రాంతంలో స్కూటర్‌ను సులభంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఈ టాప్‌ వేరియంట్‌ మ్యాట్‌ టైటాన్‌ & మ్యాట్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. మ్యాట్‌ టైటాన్‌ రంగు ఈ వేరియంట్‌కు ప్రత్యేకం. దీని ధర రూ.1,00,440. అంటే RayZR 125 ఫై హైబ్రిడ్‌ ధర తొలిసారిగా లక్ష రూపాయల మార్క్‌ను దాటింది.

కేవలం ధరను మాత్రమే చూడకుండా, మీకు అవసరమైన ఫీచర్లను బట్టి ఒక వేరియంట్‌ను ఎంచుకోవడం మంచిది. కనెక్టివిటీ అవసరం లేని వారికి డ్రమ్‌ వేరియంట్‌ సరిపోతుంది. డిస్క్‌ బ్రేక్‌ & కనెక్టివిటీ కావాలంటే డిస్క్‌ వేరియంట్‌ ఉపయోగకరంగా ఉంటుంది. స్పోర్టీ డిజైన్‌ కోసం స్ట్రీట్‌ ర్యాలీ వేరియంట్లు ఆకట్టుకుంటాయి. నావిగేషన్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి అదనపు ఫీచర్లు కావాలనుకునే వారికి టాప్‌ వేరియంట్‌ సరైన ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.