Yamaha EC-06 vs River Indie: ఇటీవల భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టిన Yamaha EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మంచి చర్చను రేపుతోంది. ఈ స్కూటర్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై కాకుండా, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్ కంపెనీ River రూపొందించిన River Indie స్కూటర్‌ ఫ్లాట్‌ఫామ్‌ మీదే ఆధారపడి తయారైంది. యమహా - రివర్ కలిసి ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారి కాదు. అయినా, EC-06 అనేది కేవలం బ్యాడ్జ్ మార్పుతో వచ్చిన స్కూటర్ కాదు. డిజైన్‌ నుంచి ఫీచర్ల వరకు కొన్ని కీలక మార్పులు ఉన్నాయి. మరి, River Indie కంటే ₹22,000 అదనపు ధరకు Yamaha EC-06 నిజంగా విలువైనదేనా?.

డిజైన్‌లో తేడాలు

River Indie డిజైన్‌ను చూస్తే వెంటనే అర్థమయ్యేది ఒకటే - ఇది పూర్తిగా ప్రాక్టికాలిటీ మీద దృష్టి పెట్టిన స్కూటర్‌. ప్యానియర్ స్టేస్‌, లగేజ్‌ను కట్టుకునే హుక్స్‌, బలమైన బాడీ - ఇవన్నీ రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవి.దానికి భిన్నంగా Yamaha EC-06 మాత్రం క్లీన్‌గా, యువతను ఆకట్టుకునే స్టైల్‌లో ఉంది. ఇండీకి ఉన్న ట్విన్ హెడ్‌ల్యాంప్స్‌ను తొలగించి, EC-06లో నిలువుగా అమర్చిన హెడ్‌ల్యాంప్స్‌ ఇచ్చారు. టెయిల్‌ల్యాంప్‌ డిజైన్‌ కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే - ఇండికేటర్లు. ఇండీలో అవి కింద భాగంలో ఉండటంతో డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. EC-06లో మాత్రం హెడ్‌ల్యాంప్‌ పైనే ఉంచారు.

స్టోరేజ్‌ సామర్థ్యం

స్టోరేజ్ విషయానికి వస్తే River Indie స్పష్టంగా ముందంజలో ఉంటుంది. ఇండీకి 43 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్‌తో పాటు, ముందు భాగంలో 12 లీటర్ల కవర్డ్ స్టోరేజ్ కూడా ఉంది. ఇది మార్కెట్‌లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఎక్కువే.Yamaha EC-06లో మాత్రం స్టోరేజ్ చాలా తగ్గింది. దీనిలో కేవలం 24.5 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. ముందు భాగంలోని స్టోరేజ్ స్థానంలో చార్జింగ్ పోర్ట్‌, కీ స్లాట్‌ను అమర్చారు. ఈ మార్పుల వల్ల స్కూటర్ బరువు 3 కిలోలు తగ్గింది. EC-06 బరువు 132 కిలోలు మాత్రమే ఉంటుంది.

రేంజ్‌, టాప్‌ స్పీడ్‌

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొంత మిక్స్‌డ్ పిక్చర్ కనిపిస్తుంది. River Indie గరిష్టంగా 90 kmph టాప్‌ స్పీడ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కానీ Yamaha EC-06 టాప్‌ స్పీడ్ మాత్రం 79 kmphకి పరిమితం. అయితే, రేంజ్‌లో మాత్రం EC-06కు స్వల్ప ఆధిక్యం ఉంది. ఇది 169 కిలోమీటర్ల IDC రేంజ్ ఇస్తే, ఇండీ 163 కిలోమీటర్లు మాత్రమే ఇస్తుంది.

చార్జింగ్

చార్జింగ్ టైమ్‌లో ఈ రెండు స్కూటర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. 480W చార్జర్‌తో 0 నుంచి 80 శాతం చార్జింగ్‌కు సుమారు 8 గంటలు పడుతుంది. అయితే ఇండీకి అదనంగా 750W ఫాస్ట్ చార్జర్ ఆప్షన్ ఉంది. దీని ద్వారా అదే చార్జింగ్‌ను కేవలం 5 గంటల్లో పూర్తి చేయవచ్చు. ఈ ఫీచర్ EC-06లో లేదు.

ధర, లభ్యత

Yamaha EC-06 ధరను కంపెనీ ₹1.68 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించింది. ప్రస్తుతం ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో మాత్రమే అందుబాటులో ఉంది. 

River Indie ధరతో పోలిస్తే EC-06 సుమారు ₹22,000 ఎక్కువ. ఈ అదనపు ధరకు Yamaha బ్యాడ్జ్‌, క్లీనర్ డిజైన్‌, స్వల్పంగా ఎక్కువ రేంజ్ లభిస్తున్నాయి. అయితే ప్రాక్టికాలిటీ, స్టోరేజ్‌, టాప్‌ స్పీడ్ విషయంలో ఇండీనే మెరుగ్గా కనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే - EC-06 పూర్తిగా రివర్ హోస్కోటే ప్లాంట్‌లోనే తయారవుతుంది.

మీకు రోజువారీ వినియోగం, ఎక్కువ స్టోరేజ్‌, బలమైన నిర్మాణం కావాలంటే River Indie సరైన ఎంపిక. స్టైల్‌, Yamaha బ్రాండ్ వాల్యూ, క్లీన్ లుక్‌ కావాలంటే Yamaha EC-06 వైపు చూడొచ్చు. ధరలో తేడా చిన్నదే అయినా, అవసరాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.