Yamaha Aerox S Launched: యమహా మోటార్ ఇండియా కొత్త ఏరోక్స్ ఎస్ వేరియంట్‌ను కీ లెస్ ఇగ్నిషన్, మరిన్ని ఫీచర్లతో మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,50,000గా నిర్ణయించారు. అంటే ఇది స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ. 3300 ఎక్కువన్న మాట. ఇందులో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. సిల్వర్, రేసింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
స్మార్ట్ కీ ఎలా పని చేస్తుంది?
స్మార్ట్ కీపై బటన్‌ను నొక్కడం ద్వారా ఫ్లాషింగ్ ఇండికేటర్‌ను ట్రిగ్గర్ చేసి, ప్రత్యేకమైన సౌండ్‌ను జనరేట్ చేయడం ద్వారా మీరు స్కూటర్‌ను సులభంగా గుర్తించవచ్చు. సాంప్రదాయ స్లాట్‌కు బదులుగా, స్కూటర్‌ను ఆన్/ఆఫ్ చేయడం లేదా ఫ్యూయల్ క్యాప్‌ను ఓపెన్ చేయడం వంటి వివిధ పనులకు కీ నాబ్‌ను ఉపయోగించవచ్చు.
యమహా ఏరోక్స్ స్పెసిఫికేషన్స్
కొత్త యమహా ఏరోక్స్ ఎస్ వేరియంట్‌లో ఇమ్మొబిలైజర్ ఫీచర్‌ను అమర్చారు. ఇది స్మార్ట్ కీ రేంజ్ వెలుపల ఉన్నప్పుడు వాహనం స్వయంచాలకంగా లాక్ అయ్యేలా చేస్తుంది. ఇందులో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు. స్కూటర్‌లో ఎల్ఈడీ లైటింగ్, ఛార్జింగ్ సాకెట్, స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ఉన్నాయి. ఇది 14 అంగుళాల ముందు, వెనుక చక్రాలను కలిగి ఉంది. ఏరోక్స్ ఎస్ 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, 126 కిలోల కర్బ్ వెయిట్‌ని కలిగి ఉంది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
ఇంజిన్, గేర్‌బాక్స్ ఇలా...
సాధారణ వేరియంట్ తరహాలోనే కొత్త యమహా ఏరోక్స్ ఎస్ 155 సీసీ సింగిల్ సిలిండర్ వీవీఏ ఇంజిన్‌తో మార్కెట్లోకి వచ్చింది ఇది 8,000 ఆర్పీఎం వద్ద 15 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 6500 ఆర్పీఎం వద్ద 13.9 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
కంపెనీ ఏం చెప్పింది?
యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఇషిన్ చిహానా మాట్లాడుతూ, ‘ఆరోక్స్ 155 లాంచ్ అయినప్పటి నుంచి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆకట్టుకునే పనితీరు, అసాధారణ డిజైన్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. భారతీయ నగరాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు, సమర్ధవంతమైన రవాణా పరిష్కారాల అవసరం పెరిగింది. పెరుగుతున్న యమహా రైడర్ల డిమాండ్లను పరిష్కరించడమే కాకుండా కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తాం.’ అన్నారు.
మరోవైపు యమహా ఇటీవలే మనదేశంలో అప్‌డేట్ చేసిన ఫాసిన్, రే జెడ్‌ఆర్‌లను భారత దేశ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఫాసినో ఎస్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (డిస్క్) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.91,030గా కంపెనీ నిర్ణయించింది. రే జెఆర్‌ను మాత్రం రే జెడ్‌ఆర్ 125, రే జెడ్‌ఆర్ స్ట్రీట్ ర్యాలీ అనే రెండు వేరియంట్‌ల్లో మార్కెట్లో విడుదల చేశారు. వీటిలో రే జెడ్‌ఆర్ ధర రూ.89,530గా, స్ట్రీట్ ర్యాలీ ధర రూ.93,530గా నిర్ణయించారు.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది