Driving Tips For Winter Fog: శీతాకాలంలో తెల్లవారుజామున రోడ్లపై పొగమంచు కమ్ముకుంటుంది. ఇలాంటి సమయంలో కారు నడపడం సవాలుతో కూడుకున్న పని. మనకు బాగా తెలిసిన రహదారిపై ప్రయాణిస్తున్నా.. ముందున్న వాహనం కూడా సరిగా కనిపించకపోవచ్చు. ముఖ్యంగా హైవేలపై వాహనాలు అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, లేన్ మార్చడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పొగమంచులో విజిబిలిటీ పెంచుకోవాలని కొందరు హైబీమ్ హెడ్‌లైట్లు, హజార్డ్ లైట్లు ఆన్ చేస్తుంటారు. కానీ ఈ పద్ధతులు మరింత ఇబ్బంది కలిగించవచ్చు. మరి.. ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు ఎలాంటి లైట్లు ఉపయోగించాలి? విండ్‌స్క్రీన్‌పై ఆవిరి పేరుకుపోతే ఏం చేయాలి? ప్రయాణానికి ముందు ఎలాంటి తనిఖీలు చేయాలి?.

Continues below advertisement

కారు నడుస్తున్నప్పుడు హజార్డ్ లైట్లు వాడొచ్చా?

పొగమంచులో కారు నడుపుతున్నప్పుడు హజార్డ్ లైట్లు అస్సలు ఆన్ చేయకూడదు. వాహనం ఆగిపోయినప్పుడు లేదా బ్రేక్‌డౌన్ అయినప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించాలి. కారు కదులుతున్నప్పుడు హజార్డ్ లైట్లు ఆన్‌ చేస్తే.. వెనుక వచ్చే డ్రైవర్లు మీ కారు కదులుతోందా? నిలిచిపోయిందా? అని గందరగోళం పడతారు. అంతేకాదు, మీరు లేన్ మార్చేటప్పుడు లేదా మలుపు తీసుకునేటప్పుడు ఇండికేటర్లను ఉపయోగించలేకపోవచ్చు. ఇది మరింత ప్రమాదకరం.

Continues below advertisement

పొగమంచు మరీ ఎక్కువగా ఉండి ముందుకు వెళ్లడం కష్టమైతే.. ట్రాఫిక్‌కు దూరంగా ఉన్న సురక్షితమైన ప్రదేశంలో కారును ఆపాలి. ఆ తర్వాత హజార్డ్ లైట్లు ఆన్ చేసి వెనుక వచ్చే వాహనాలను అప్రమత్తం చేయాలి.

పొగమంచులో ఏ హెడ్‌లైట్లు ఉపయోగించాలి?

పొగమంచులో హైబీమ్ లైట్లు ఉపయోగించడం సరైన పద్ధతి కాదు. వాటి కాంతి గాలిలోని చిన్న నీటి బిందువులపై పడి తిరిగి ప్రతిబింబిస్తుంది. దీంతో డ్రైవర్‌కు ఎదురుగా తెల్లటి వెలుగు కనిపించి రహదారి మరింత అస్పష్టంగా కనిపించవచ్చు. విజిబిలిటీ తగ్గడం ప్రారంభమైనప్పుడే లోబీమ్ హెడ్‌లైట్లు ఆన్ చేయాలి. ఇవి రోడ్డును వెలిగించడంతో పాటు హైబీమ్‌తో పోలిస్తే తక్కువ గ్లేర్‌ను కలిగిస్తాయి.

ముందు భాగంలో ఉండే ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ రోడ్డుకు దగ్గరగా కాంతిని ప్రసరింపజేస్తాయి. విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు వీటిని ఉపయోగించవచ్చు. వెనుక ఫాగ్ ల్యాంప్స్ దట్టమైన పొగమంచులో వెనుక వచ్చే వాహనాలకు మీ కారును గుర్తించడంలో సహాయపడతాయి. విజిబిలిటీ మెరుగుపడిన తర్వాత వీటిని ఆఫ్ చేయాలి. లేదంటే వెనుక వచ్చే డ్రైవర్లకు వాటి ప్రకాశవంతమైన కాంతి ఇబ్బంది కలిగించవచ్చు.

ఇది కూడా చదవండి: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక

విండ్‌స్క్రీన్‌పై ఆవిరి పేరుకుపోతే ఏం చేయాలి?

చల్లటి ఉదయాల్లో కారు లోపలి భాగంలో ఉండే తేమతో కూడిన వెచ్చని గాలి చల్లటి విండ్‌స్క్రీన్‌ను తాకినప్పుడు అద్దంపై ఆవిరి ఏర్పడుతుంది. చేతితో తుడిచినా కొంతసేపటికే మళ్లీ ఆవిరి పేరుకుపోవచ్చు. దీనికి కొన్ని సులభమైన పరిష్కారాలు ఉన్నాయి.

1. ఫ్రంట్ డీఫాగర్ ఆన్ చేయండి: విండ్‌స్క్రీన్ వైపు గాలి వెళ్లేలా డీఫాగర్‌ను ఉపయోగించండి. అద్దం లోపలి భాగంలో పేరుకున్న తేమ తొలగించడానికి ఇది సహాయపడుతుంది.

2. ఏసీ ఉపయోగించండి: చలికాలంలోనూ ఏసీని ఆన్ చేయవచ్చు. ఇది క్యాబిన్‌లోని గాలిలో తేమను తగ్గించి అద్దంపై ఆవిరి త్వరగా తొలగేలా చేస్తుంది. ఉష్ణోగ్రతను మరీ తక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు.

3. ఫ్రెష్ ఎయిర్ మోడ్ ఎంచుకోండి: ఎక్కువసేపు రీసర్క్యులేషన్ మోడ్‌లో ఉంచకూడదు. అలా చేస్తే క్యాబిన్‌లోని తేమతో కూడిన గాలే తిరుగుతూ ఉంటుంది. బయట గాలి లోపలికి వచ్చేలా ఫ్రెష్ ఎయిర్ మోడ్‌ను ఎంచుకోండి.

4. వైపర్లను ఉపయోగించండి: విండ్‌స్క్రీన్ బయట నీటి చుక్కలు లేదా తేమ పేరుకుంటే వైపర్లతో తొలగించండి. అవసరమైనప్పుడు అద్దంపై దుమ్ము, మురికి తొలగించేందుకు వాషర్ ఫ్లూయిడ్ కూడా ఉపయోగపడుతుంది.

5. ప్రయాణానికి ముందు అద్దాలను శుభ్రం చేయండి: విండ్‌స్క్రీన్‌పై దుమ్ము, వేలిముద్రలు, జిడ్డు మరకలు ఉంటే ఎదురుగా వచ్చే లైట్ల కాంతి వల్ల గ్లేర్ పెరుగుతుంది. అందుకే అద్దం లోపలి, బయటి భాగాలను శుభ్రం చేయాలి. వెనుక అద్దం, సైడ్ మిర్రర్లను కూడా మర్చిపోవద్దు.

ఇది కూడా చదవండి: డాష్‌క్యామ్ అమరిస్తే కారు వారంటీ రద్దవుతుందా? రూ.లక్షల నష్టం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

ఫాగ్ డ్రైవింగ్‌కు ముందు కారులో ఏం చెక్ చేయాలి?

తెల్లవారుజామున ప్రయాణం ప్రారంభించే ముందు ఈ అంశాలను ఒకసారి పరిశీలించండి.

తనిఖీ చేయాల్సినవిఎందుకు ముఖ్యం?
హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంప్స్సరిగ్గా పనిచేస్తున్నాయో, శుభ్రంగా ఉన్నాయో చూడాలి
టెయిల్ లైట్లు, బ్రేక్ లైట్లువెనుక వచ్చే వాహనాలకు మీ కారు కనిపించేందుకు
విండ్‌స్క్రీన్, మిర్రర్లుచుట్టూ స్పష్టంగా చూసేందుకు
వైపర్లు, వాషర్ ఫ్లూయిడ్అద్దంపై నీరు, దుమ్ము తొలగించేందుకు
ఏసీ, ఫ్రంట్ డీఫాగర్అద్దం లోపలి ఆవిరిని తొలగించేందుకు
టైర్లుసరైన గ్రిప్ కోసం టైర్ ట్రెడ్, ప్రెషర్ తనిఖీ చేయాలి

చివరిగా.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు

అన్నింటికంటే ముఖ్యంగా వేగం తగ్గించి, ముందున్న వాహనానికి తగినంత దూరం పాటించాలి. రోడ్డు మార్కింగ్‌లను గమనించండి. అకస్మాత్తుగా బ్రేకులు వేయవద్దు. అవసరమైనప్పుడు వేగాన్ని వెంటనే తగ్గించేందుకు డ్రైవర్ నియంత్రణలోనే కారు ఉండాలి. అందుకే విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించకపోవడం మంచిది. విజిబిలిటీ మరీ తక్కువగా ఉంటే సురక్షితమైన చోట ఆపి వేచి ఉండాలి. ముందున్న రహదారి కనిపించనప్పుడు తొందరగా గమ్యస్థానానికి చేరుకోవడం కంటే సురక్షితంగా ప్రయాణించడం ముఖ్యం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.