VinFast VF6 భారత్‌లో విడుదలైన వెంటనే మార్కెట్‌ను షేక్ చేసింది. 16.4 లక్షల రూపాయలు ప్రారంభ ధరతో వచ్చిన ఈ కారు మంచి చాలా ఫేమస్ అయిపోయింది. ఈ కారు ఉచిత ఛార్జింగ్ ఆఫర్ కూడా అందిస్తోంది. దీనితో ఈ కారు భారతీయ EV మార్కెట్‌లో వేగంగా ప్రజాదరణ పొందుతోంది. మొదట ABP బృందం దీనిని వియత్నాంలో పరీక్షించింది, కాని భారతదేశం కోసం కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. కొత్త ఇంటీరియర్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా ఇది భారతీయ రోడ్ల కోసం మరింత మెరుగ్గా తయారైంది.

VF6 డిజైన్ మొదటి చూపులోనే ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. 4,241 mm పొడవు, 4 మీటర్ల కంటే ఎక్కువ సైజు కలిగిన ఈ కారులో V-ఆకారపు డిటేల్స్‌, పూర్తి-వెడల్పు DRLలు ఉన్నాయి, ఇవి దీనిని చాలా ఆకర్షణీయంగా చేస్తాయి. ఇందులో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, వాలుగా ఉండే రూఫ్‌లైన్ దాని రూపాన్ని మరింత స్టైలిష్‌గా చేస్తాయి. దీని బిల్డ్ క్వాలిటీ కూడా దృఢంగా ఉంది,  డోర్స్ క్లోజ్ చేసే సౌండ్ నుంచి ఇంటీరియర్‌లో ఉపయోగించిన మెటీరియల్ వరకు అన్నీ ప్రీమియం అనుభూతిని కలిగిస్తాయి.

హై-టెక్ ఇంటీరియర్ - ఫీచర్లు

కారు ఇంటీరియర్ కూడా ఏదైనా లగ్జరీ SUV కంటే తక్కువ కాదు. ఇందులో 12.9 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది, ఇది డ్రైవర్ వైపు వంగి ఉంటుంది. ఇందులో చాలా వరకు కంట్రోల్స్, మెనూలు ఉన్నాయి, ఎందుకంటే ఫిజికల్ బటన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇందులో సాంప్రదాయ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లేదు, కానీ హెడ్-అప్ డిస్‌ప్లే (HUD) ఉంది.

VF6లో పూర్తి-పొడవు గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్,  వైర్‌లెస్ Android Auto, Apple CarPlay వంటి ఫీచర్లు ఉన్నాయి. సీట్లు వెగన్ లెదర్‌తో తయారు చేశారు.  డ్రైవర్ కోసం 8-వే పవర్డ్, వెంటిలేటెడ్ సీటును ఎంచుకోవచ్చు. దీంతో పాటు ADAS, 360 డిగ్రీ కెమెరా, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు,  రెయిన్ సెన్సింగ్ వైపర్‌ల వంటి అధునాతన భద్రతా సౌకర్యాలు కూడా ఉన్నాయి. ముందు సీట్లలో కూర్చోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది, అయితే వెనుక సీటులో లెగ్‌రూమ్ బాగానే ఉంది. పొడవైన ప్రయాణికులకు ఇది కొంచెం ఇరుకుగా ఉండవచ్చు, కాని ఫ్యామిలీ కారుగా ఇందులో మంచి స్పేస్, బూట్ కెపాసిటీ  ఇచ్చారు. 

బ్యాటరీ పనితీరు

VF6 మూడు వేరియంట్‌లలో లభిస్తోంది- ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ. బేస్ మోడల్‌లో 59.6 kWh బ్యాటరీ ఉంది, ఇది 174 bhp పవర్,  468 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది, దీనితో బ్యాటరీ కేవలం 25 నిమిషాల్లో 10% నుంచి 70% వరకు ఛార్జ్ అవుతుంది. దీని మరింత శక్తివంతమైన వెర్షన్ 200 bhp పవర్ ఇస్తుంది. దాదాపు 463 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. టాప్ వేరియంట్ ధర 18.2 లక్షల రూపాయలు, ఇది చాలా ఇతర కంపెనీల కార్ల బేస్ వేరియంట్‌ల కంటే ఎక్కువ విలువను ఇస్తుంది.