Electric Vehicle Cyber Security: ఇప్పుడు మన రోడ్లపై ఎలక్ట్రిక్‌ వాహనాలు సాధారణ దృశ్యంగా మారిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చులు తగ్గుతాయన్న ఆశతో, పర్యావరణానికి మేలు చేస్తాయన్న నమ్మకంతో చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ వాహనాల్లో ఒక విషయం ఎక్కువగా చర్చకు రావడం లేదు. అదే సైబర్‌ భద్రత.

Continues below advertisement

ఎలక్ట్రిక్‌ వాహనం అంటే కేవలం బ్యాటరీ, మోటార్‌ మాత్రమే కాదు. ఇవి చార్జింగ్‌ స్టేషన్లు, విద్యుత్‌ గ్రిడ్‌, మొబైల్‌ యాప్‌లు, క్లౌడ్‌ సర్వర్లతో ఎప్పటికప్పుడు డేటా మార్పిడి చేసుకుంటుంటాయి. ఈ అనుసంధానం మీకు సౌకర్యంగా అనిపించినా, అదే సైబర్‌ నేరగాళ్లకు దారి చూపిస్తోంది.

చార్జింగ్‌ స్టేషన్లే ప్రధాన టార్గెట్‌

Continues below advertisement

పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు EV వ్యవస్థలో కీలక భాగం. ఇవి విద్యుత్‌ సరఫరా, యూజర్‌ గుర్తింపు, బిల్లింగ్‌, గ్రిడ్‌తో కమ్యూనికేషన్‌ వంటి పనులు చేస్తాయి. అందుకే హ్యాకర్లు మొదటగా కన్నేయేది వీటిపైనే. ఒకవేళ చార్జింగ్‌ నెట్‌వర్క్‌లో లోపాలు ఉంటే, చార్జింగ్‌ ఆగిపోవడం, తప్పుడు బిల్లింగ్‌, ఒకే సమయంలో ఎక్కువ వాహనాలకు సమస్యలు రావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.

వాహనం నుంచి గ్రిడ్‌కు కూడా విద్యుత్‌

కొత్త తరం ఈవీల్లో ‘వాహనం నుంచి గ్రిడ్‌కు’ విద్యుత్‌ పంపే టెక్నాలజీ వస్తోంది. అంటే వాహనం కేవలం విద్యుత్‌ వినియోగదారుగానే కాదు, అవసరమైతే సరఫరాదారుగా కూడా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వాహనంలో సైబర్‌ లోపం ఉంటే, అది మొత్తం స్థానిక విద్యుత్‌ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నిపుణులు దీనిని ‘మొబైల్‌ ఎనర్జీ హబ్‌’గా అభివర్ణిస్తున్నారు.

డేటా లీక్‌ అయితే ఏమవుతుంది?

ఎలక్ట్రిక్‌ వాహనాలు యూజర్‌ లొకేషన్‌, చార్జింగ్‌ అలవాట్లు, చెల్లింపుల వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటా తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వ్యక్తిగత గోప్యతకే కాదు, ఆర్థిక భద్రతకూ ముప్పే. అందుకే డేటా ఎన్‌క్రిప్షన్‌, గోప్యతను కాపాడే సిస్టమ్‌లపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ అన్ని కంపెనీలు ఒకే స్థాయిలో భద్రత పాటిస్తున్నాయా అన్నదే ప్రశ్న.

వాహన భద్రతకు కూడా ప్రమాదం

ఈవీల్లో ఇంజిన్‌ పనితీరు, వేగం, స్టెబిలిటీ అన్నీ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగానే నియంత్రణలో ఉంటాయి. ఒకవేళ హ్యాకర్లు ఈ సిస్టమ్‌ల్లోకి చొరబడితే, అది ప్రయాణికుల భద్రతకే ముప్పుగా మారుతుంది. కొన్ని పరిశోధనల్లో అసాధారణ ప్రవర్తనను గుర్తించే టెక్నాలజీలను పరీక్షించారు. అవి ఉపయోగకరంగానే ఉన్నా, వ్యవస్థ ఎంత క్లిష్టంగా మారిందన్నది ఇవి నిరూపిస్తున్నాయి.

ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాని భద్రత

ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు ఎక్కువగా ఒక్కో భాగంపైనే దృష్టి పెట్టాయి. కానీ మొత్తం ఈవీ వ్యవస్థను ఒకే ఫ్రేమ్‌లో చూసే అధ్యయనాలు చాలా తక్కువ. చార్జింగ్‌ కంపెనీలు, వాహన తయారీదారులు, విద్యుత్‌ సంస్థలు, నియంత్రణ సంస్థలు కలిసి పనిచేయకపోతే భద్రత బలపడదు.

నిపుణుల మాటల్లో చెప్పాలంటే... ఎలక్ట్రిక్‌ వాహనాలు అసురక్షితమైనవని కాదు. కానీ టెక్నాలజీ వేగంగా ముందుకు వెళ్తుండగా, దానిని కాపాడే రక్షణ వ్యవస్థలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో, ఈవీ అంటే కేవలం రేంజ్‌, ధర మాత్రమే కాదు... సైబర్‌ భద్రత కూడా కీలక అంశంగా మారబోతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.