Tata Tiago Vs Wagon R Comparison: ప్రస్తుతం, మన మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్ల లిస్ట్‌లో టాటా టియాగో, మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్‌ కూడా ఉన్నాయి. కామన్‌ మేన్‌ నుంచి ఈ కార్‌లకు చాలా డిమాండ్ ఉంది. టాటా టియాగో ఎక్స్-షోరూమ్ ధర ‍‌(Tata Tiago ex-showroom price) రూ. 5 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 7.5 లక్షల వరకు ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ధర (Maruti Wagon R ex-showroom price) రూ. 5.78 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ మోడల్‌ రూ. 7.50 లక్షల వరకు ఉంటుంది.

ధర ప్రకారం, టాటా టియాగో బేస్ మోడల్‌ను వ్యాగన్ ఆర్ కంటే చవకగా కొనవచ్చని స్పష్టంగా తెలుస్తుంది. మీ బడ్జెట్ బాగా తక్కువగా ఉండి & ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కొనాలనుకుంటే, టాటా టియాగో మంచి ఎంపిక అవుతుంది. అయితే, ఫీచర్లను చూడకుండా కేవలం ప్రైస్‌ను బట్టి కొనడం కార్‌ టైర్‌లో కాలేయడం లాంటిది. ఈ రెండు కార్లు పెట్రోల్ & CNG వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. అంటే, ఫ్యూయల్‌ ఆప్షన్‌లోనూ మీరు ఎంచుకునే సౌలభ్యాన్ని మీకు అందిస్తున్నాయి.

ఫీచర్లు & టెక్నాలజీ వివరాలు టాటా టియాగో దాని బేస్ వేరియంట్‌లో 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (హై-ఎండ్‌ మోడల్‌లో 10.25 అంగుళాల స్క్రీన్ అందుబాటులో ఉంది), సంగీత సంద్రంలో ముంచి లేపే 8 స్పీకర్ల హర్మాన్ సౌండ్ సిస్టమ్, ఒంటిని చల్లబరిచే ఆటోమేటిక్ AC, కారును పరుగులెత్తించే 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, రోడ్డును క్రిస్టల్‌ క్లియర్‌గా చూపే ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సేఫ్టీని మరో స్టేజ్‌కు పెంచే LED DRLs (Daytime Running Lights) & రివర్స్‌ చేసేప్పుడు తడబడకుండా రియర్‌ పార్కింగ్ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు టాటా టియాగో సొంతం. టియాగో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & ప్రీమియం సీట్ అప్‌హోల్ట్సరీ కూడా కస్టమర్లకు బాగా నచ్చుతున్నాయి.

మారుతి వాగన్ ఆర్ విషయానికి వస్తే... డ్రైవర్‌ అసిస్టెన్స్‌ + ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లే, మ్యాజిక్‌ చేసే 4 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, డ్రైవర్‌ శ్రమను తగ్గించే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హైవే మీద హాయిగా దూసుకెళ్లేందుకు 14 అంగుళాల అల్లాయ్ వీల్స్ & ముచ్చటగొలిపే డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లు మారుతి వాగన్ ఆర్ సొంతం. దీని టాప్ వేరియంట్లలో స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ & డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి. ఫీచర్ల పరంగా, టాటా టియాగో ప్రీమియం ఫీల్‌ అందిస్తూనే సాంకేతికంగానూ వాగన్ ఆర్ కంటే ముందుంది.

మైలేజ్టాటా మోటార్స్‌ వెల్లడించిన ప్రకారం... టాటా టియాగో పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 19-20 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. CNG వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 26.49 కి.మీ./కి.గ్రా. & AMT (ఆటోమేటిక్‌) ట్రాన్స్‌మిషన్‌తో 28.06 కి.మీ./కి.గ్రా. మైలేజీని ఇవ్వగలదు. విశేషం ఏమిటంటే, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ టాటా టియాగో CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది, ఈ సెగ్మెంట్‌లో దీనిని ప్రత్యేకంగా నిలుపుతోంది. అదే సమయంలో, మారుతి వ్యాగన్ ఆర్ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 25.19 కి.మీ. మైలేజీ ఇవ్వగలదు & CNG వేరియంట్‌లో ఈ నంబర్‌ 34.05 కి.మీ/కి.లీ.కు పెరుగుతుంది. వ్యాగన్ ఆర్ CNG వెర్షన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వచ్చింది, దీనిలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ లేదు. మైలేజ్‌ పరంగా చూస్తే, ఈ విభాగంలో మారుతి వ్యాగన్ ఆర్ అత్యధిక మైలేజీని ఇస్తుంది & తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి సరిగ్గా సరిపోతుంది.

ఏ కార్‌ కొనాలి?తక్కువ ధరలో బెస్ట్‌ ఫీచర్స్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కోరుకునే వాళ్లకు టాటా టియాగో బెస్ట్‌ ఆప్షన్‌ అయితే & రోజువారీ ప్రయాణిస్తూ ఎక్కువ మైలేజ్‌ కోరుకునే వాళ్లకు మారుతి వ్యాగన్ ఆర్ సూటవుతుంది.